Share News

కమనీయం.. రాములోరి కల్యాణం

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:25 AM

రామతీర్థంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. భక్తిప్రపత్తులతో జైశ్రీరాం నినాదాల నడుమ ఒక్కో ఘట్టం కమనీయంగా సాగింది. విశ్వక్షేణ పూజతో ప్రారంభమైన కల్యాణోత్సవం తలంబ్రాల తంతు వరకు మూడున్నర గంటలసేపు ఎంతో వైభవంగా నడిచింది. జీలకర్ర బెల్లం ఘట్టం, మంగళసూత్రధారణ, తలంబ్రాలను చల్లుకునే ప్రక్రియలను చూసి భక్తులు పులకించారు. కల్యాణోత్సవాన్ని ఆద్యంతం భక్తులు కనులార్పకుండా చూసి ఆనంద పరవశులయ్యారు.

కమనీయం.. రాములోరి కల్యాణం
రామతీర్థంలో కల్యాణఘట్టంలో భాగంగా మంగళసూత్రం చూపుతున్న అర్చకుడు

కమనీయం.. రాములోరి కల్యాణం

కన్నుల పండువగా వివాహ వేడుక

మార్మోగిన రామనామస్మరణ

తిలకించి తరించిన భక్తజనం

రామతీర్థంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. భక్తిప్రపత్తులతో జైశ్రీరాం నినాదాల నడుమ ఒక్కో ఘట్టం కమనీయంగా సాగింది. విశ్వక్షేణ పూజతో ప్రారంభమైన కల్యాణోత్సవం తలంబ్రాల తంతు వరకు మూడున్నర గంటలసేపు ఎంతో వైభవంగా నడిచింది. జీలకర్ర బెల్లం ఘట్టం, మంగళసూత్రధారణ, తలంబ్రాలను చల్లుకునే ప్రక్రియలను చూసి భక్తులు పులకించారు. కల్యాణోత్సవాన్ని ఆద్యంతం భక్తులు కనులార్పకుండా చూసి ఆనంద పరవశులయ్యారు.

నెల్లిమర్ల, ఏప్రిల్‌ 17:

శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా రామతీర్థంలో బుధవారం సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. దేవస్థానం వెనుక వైపున ఉన్న సువిశాలమైన స్థలంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికపై తొలుత సీతారాములను కొలువుదీర్చారు. అర్చకులు ఖండవిల్లి కిరణ్‌కుమార్‌, సాయిరామాచార్యులు, గొడవర్తి నరసింహాచార్యుల బృందం కల్యాణోత్సవాన్ని శాస్ర్తోక్తంగా ప్రారంభించారు. ఈ వేడుకకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉత్సవ ప్రత్యేక అధికారి, సింహాచలం దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి పట్టువస్ర్తాలను, ముత్యాలను అర్చకులకు సమర్పించారు. వీరితో పాటు రాష్ట్ర విద్యామంత్రి బొత్స సత్యనారాయణ, ఝాన్సీలక్ష్మి దంపతులు, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, పద్మావతి దంపతులు, రాష్ట్ర సాధుపరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి వ్యక్తిగతంగా స్వామి వారికి పట్టువస్ర్తాలను అందజేశారు.

వేలాదిమంది భక్తులతో పాటు ప్రముఖులు కల్యాణోత్సవ వేదిక వద్ద నుంచి ఆద్యంతం తిలకించారు. కల్యాణ ఘట్టాలను నంద్యాలకు చెందిన ప్రముఖ వేద పండితుడు డీవీ హయగ్రీవాచార్యులు వివరించారు. వేడుకలకు సుమారు 25 వేల మంది భక్తులు వచ్చారని అంచనా. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా వేదిక ఎదురుగా, చుట్టూ టెంట్‌ హౌస్‌లు ఏర్పాటు చేసి కుర్చీలు వేశారు. రామతీర్థం ప్రాంతం బుధవారం రామనామ స్మరణతో మార్మోగింది. కల్యాణాన్ని దేవస్థానం ఈవో వై.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరగ్గా ఉత్సవ ప్రత్యేక అధికారి శ్రీనివాసమూర్తి పర్యవేక్షించారు. కల్యాణోత్సవం ముగిసిన తర్వాత ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు బుధవారం సాయంత్రం ఆలయానికి చేరుకుని సీతారాములను దర్శించుకున్నారు. అర్చకుల నుంచి ఆశీర్వాదం అందుకున్నారు.

ప్రముఖులు హాజరు

రామతీర్థంలో బుధవారం జరిగిన సీతారాముల కల్యాణోత్సవానికి మంత్రి, ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ అంబళ్ల సుధారాణి,శ్రీరాములనాయుడు దంపతులు, మత్స సత్యనారాయణ, డెంకాడ ఎంపీపీ బంటుపల్లి వాసుదేవరావు దంపతులు తదితరులు హాజరయ్యారు. నగర పంచాయతీ వైస్‌చైర్మన్‌ సముద్రపు రామారావు, ఆర్డీవో సూర్యకళ, దేవదాయ శాఖ రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ ఎం.విజయరాజు, జిల్లా సహాయ కమిషనర్‌ టి.అన్నపూర్ణ, తహసీల్దార్‌ ధర్మరాజు, ఎంపీడీవో రామారావు, నగర పంచాయితీ కమిషనర్‌ బాలాజీ ప్రసాద్‌ తదితరులు హాజరయ్యారు.

ఏర్పాట్లు భేష్‌

కల్యాణోత్సవానికి హాజరైన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. మజ్జిగ, తాగునీరు అందించారు. పది వేల మందికి మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్‌పీ ఆర్‌.గోవిందరావు పర్యవేక్షణలో భోగాపురం రూరల్‌ సీఐ బి.వెంకటేశ్వరరావు, నెల్లిమర్ల ఎస్‌ఐ డి.రామగణేష్‌ గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.

Updated Date - Apr 18 , 2024 | 12:25 AM