జిల్లాలో జోరువాన
ABN , Publish Date - Jun 17 , 2024 | 11:29 PM
జిల్లావ్యాప్తంగా సోమవారం జోరువాన కురిసింది. ఉదయం ఆరు గంటలకే ఆకాశం మేఘావృతమైంది. ఆ తర్వాత కారుమబ్బులు కమ్ముకున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఓ మెస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడిందని ప్రజలు ఊరట చెందారు. అయితే వారి ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఉదయం తొమ్మిది గంటల తర్వాత ఎండ వేడి, ఉక్కపోత తీవ్రమైంది. దీంతో జిల్లావాసులు అల్లాడిపోయారు.

ఆ తర్వాత మారిన వాతావరణం
ఎండ వేడి, ఉక్కపోతకు అల్లాడిన జనం
జిల్లావ్యాప్తంగా సోమవారం జోరువాన కురిసింది. ఉదయం ఆరు గంటలకే ఆకాశం మేఘావృతమైంది. ఆ తర్వాత కారుమబ్బులు కమ్ముకున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఓ మెస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడిందని ప్రజలు ఊరట చెందారు. అయితే వారి ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఉదయం తొమ్మిది గంటల తర్వాత ఎండ వేడి, ఉక్కపోత తీవ్రమైంది. దీంతో జిల్లావాసులు అల్లాడిపోయారు. కాగా ఏకధాటిగా కురిసిన వర్షానికి పాలకొండ ప్రధాన రహదారి, ఆర్టీసీ కాంప్లెక్స్‌లో నీరు నిలిచింది. దీనితో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలుల కారణంగా పార్వతీపురం మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రైతులు మాత్రం ఖరీఫ్ పనుల్లో నిమగ్నమయ్యారు. పత్తి, వరి పంటలను వేసేందుకు సిద్ధమవుతున్నారు.
చినుకు పడితే ఇంతే..
వర్షం కారణంగా పార్వతీపురం నుంచి కూనేరు వరకు ఉన్న అంతర్రాష్ట్ర రహదారి చెరువును తలపించింది. రహదారిపై ఏర్పడిన భారీ గోతుల్లో వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు ఎక్కడుందోనని వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం జిల్లా పరిధిలోని ఈ రహదారి మరమ్మతులను పూర్తిగా విస్మరించింది. దీంతో ఈ మార్గం ప్రమాదకరంగా మారింది. తరచూ ఎంతోమంది వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. నూతన ప్రభుత్వం స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు.
- పాలకొండ/పార్వతీపురం రూరల్/పార్వతీపురంటౌన్ /కొమరాడ