జై జగన్నాథ
ABN , Publish Date - Jul 15 , 2024 | 11:22 PM
మేళతాళాలు.. వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల జై జై జగన్నాథ నామస్మరణల మధ్య విజయనగరంలో జగన్నాథుని రథచక్రాలు ముందుకు కదిలాయి. తొలి రథయాత్ర నుంచి సోమవారం జరిగిన మారు రథయాత్ర వరకూ రోజుకో అవతారంలో జగన్నాథుడు దర్శనమిచ్చారు.
జై జగన్నాథ
వైభవంగా మారు రథయాత్ర
విజయనగరం రూరల్, జూలై 15: మేళతాళాలు.. వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల జై జై జగన్నాథ నామస్మరణల మధ్య విజయనగరంలో జగన్నాథుని రథచక్రాలు ముందుకు కదిలాయి. తొలి రథయాత్ర నుంచి సోమవారం జరిగిన మారు రథయాత్ర వరకూ రోజుకో అవతారంలో జగన్నాథుడు దర్శనమిచ్చారు. మారు రథయాత్ర రోజు విశేష పూజలందుకున్నారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల పరివారం రథంపై ఆశీనులు కాగా భక్తులు స్వామి వారి రథాన్ని లాగుతూ తన్మయత్వం చెందారు. భక్తిని చాటుకున్నారు. ఉదయం నుంచి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి రథయాత్ర ప్రారంభమైంది. పురోహితులు తొలిపూజ చేసిన అనంతరం భక్తులకు అవకాశం కల్పించారు. రథంపై వున్న స్వామివార్లను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఆలయం నుంచి రథం నిలిపే ప్రధాన జంక్షన్ వరకూ భక్తులు ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో కోలాటాలు, పులివేషాలు సందడి చేశాయి. విజయనగరం, నెల్లిమర్ల, ఎస్‌కోట, గజపతినగరం, రామభద్రపురం, బొబ్బిలి, చీపురుపల్లి, గంట్యాడ, గుర్ల, బాడంగి, బొండపల్లి, జామి, వేపాడలోనూ స్వామి మారురథయాత్ర జరిగింది.
- విజయనగరంలోని మన్నార్ రాజగోపాలస్వామి ఆలయంలో ఉన్న జగన్నాథునికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయం నుంచి మండపం జంక్షన్ వరకూ స్వామి వారి ఊరేగింపు సాగింది. దాసన్నపేటలో పురాతన జగన్నాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాసన్నపేట నుంచి నవాబుపేట జంక్షన్ వరకూ రథంలో స్వామివార్లను ఊరేగించారు. నవాబుపేట జంక్షన్ వద్ద ఎటువంటి శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలు ఎదురుకాకుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు. అదే విధంగా సంతపేట జగన్నాథ స్వామి ఆలయం వద్దకు కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. కన్యకాపరమేశ్వరి ఆలయం వరకూ ఊరేగింపు కొనసాగింది. ఉల్లివీధి, కాళ్ల నాయుడు మందిరం వద్ద జగన్నాథ స్వామికి విశేష పూజలు నిర్వహించారు. అక్కడ కూడా రథయాత్ర జరిగింది. చిక్కాలవీధిలో వున్న జగన్నాథుని ఆలయం వద్ద భక్తుల కోలాహలం కన్పించింది. ఇక్కడ రథయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం, పులివేషాలు సందడి చేశాయి. జై జగన్నాథ నామస్మరణతో జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం కనిపించింది.