Share News

జగనన్న బాదుడే బాదుడు

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:37 AM

ఎన్నికల ముందు వైసీపీ సర్కారు పట్టణవాసులకు పన్ను వాత పెట్టింది. ఏటాలానే ఈసారి కూడా విలువ ఆధారిత ఆస్తి పన్నును 15 శాతం పెంచింది. పన్ను భారం మరింత పెరగడంతో జిల్లావాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

జగనన్న బాదుడే బాదుడు
పార్వతీపురం మున్సిపల్‌ కార్యాలయం

ఆస్తిపన్ను మరోసారి 15 శాతం పెంచిన వైసీపీ సర్కారు

తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జిల్లావాసులు

(పార్వతీపురంటౌన్‌/సాలూరు, ఏప్రిల్‌ 15)

ఎన్నికల ముందు వైసీపీ సర్కారు పట్టణవాసులకు పన్ను వాత పెట్టింది. ఏటాలానే ఈసారి కూడా విలువ ఆధారిత ఆస్తి పన్నును 15 శాతం పెంచింది. పన్ను భారం మరింత పెరగడంతో జిల్లావాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వాస్తవంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా ఆస్తిపన్ను పెంచలేదు. పైగా పట్టణాల్లో మెరుగైన వసతుల కల్పనకు చర్యలు చేపట్టారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్‌ మారింది. 2020-21 తరువాత విలువ ఆధారిత ఆస్తి పన్ను ప్రవేశ పెట్టి... దానిని ఏటా 15 శాతం పెంచుతూ పట్టణ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల ముందు కూడా 15 శాతం పెంచడంతో జిల్లావాసులు మండిపడుతున్నారు. వైసీపీ సర్కారు తీరుపై పెదవి విరుస్తున్నారు. ఒకవైపు రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో సతమతమ వుతుంటే.. మరోవైపు ఎక్కడా లేని విధంగా పన్నులు విధించడం ఎంతవరకు సమంజమని సామాన్య, మధ్యతరగతి వర్గాల వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

జిల్లాకేంద్రం పార్వతీపురం విషయానికొస్తే.. గత ఐదేళ్ల కిందట వరకు పట్టణంలోని 13,225 ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, ఖాళీ స్థలాలు ఉండగా రూ. 3కోట్లు ఆస్తి పన్ను వసూళ్ల డిమాండ్‌ ఉండేది. అయితే వైసీపీ ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత పరిస్థితి మారింది. విలువ ఆధారిత ఆస్తి పన్ను విధానం అమలులోకి తెచ్చాక.. 2020-21 నుంచి 2023-24 నాటికి రూ.4.48 కోట్లకు ఆస్తి పన్ను డిమాండ్‌ పెరిగిందని రెవెన్యూ అధికారుల లెక్కలే చెబుతున్నాయి. ఇక ఖాళీ స్థలాలకు సంబంధించి గతంలో పన్ను నామమాత్రంగా ఉండేది. కానీ 2023-24కి గాను రూ.57 లక్షల వరకు వసూలు చేశారంటే.. పన్నుల బాధుడు ఏవిధంగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఇంటి పన్నులు కూడా ఏటా 15 శాతం మేర పెంచుకుంటూ పోతుండడంతో పట్టణవాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న ఆస్తిపన్ను డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉందని రెవెన్యూ అఽధికారులు చెబుతుండడంతో పేద, మధ్య తరగతి కుటుంబాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ పన్నులు ఎలా కట్టాలో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

సాలూరులో ఇలా....

సాలూరు మున్సిపాల్టీలోని 29 వార్డుల్లో 11,763 ఇళ్లు , వాణిజ్య సముదాయాలతో పాటు 752 ఖాళీ స్థలాలు ఉన్నాయి. కాగా 2019-20లో రూ.2.62 కోట్ల మేర పన్ను వసూలు ఉండేది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. 2020-21 నాటికి రూ.4.28కోట్ల మేర ఆస్తి పన్ను డిమాండ్‌ పెరిగింది. తాజాగా పెంచిన 15 శాతం విలువ ఆధారిత ఆస్తి పన్ను ప్రకారం 2024-25 నాటికి రూ.నాలుగు కోట్ల 81 లక్షల మేర డిమాండ్‌ పెరిగిందని అధికారులు చెబుతున్నారు.

పంచాయతీలకూ పన్ను పోటు

జియ్యమ్మవలస: జిల్లాలోని పంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లపైనా పంచాయతీ కార్యదర్శులు దృష్టి సారించారు. ఇప్పటికే సగటున 85శాతం వసూళ్లు పూర్తి చేశారు. అయితే మిగిలిన 15శాతం కూడా పన్ను వసూలు చేయాలని ఉన్న తాధికారులు ఆదేశించడంతో సర్పంచ్‌, గ్రామ పెద్దల సహకారంతో గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు ఆ పనిలో నిగమ్న మయ్యారు. జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్ను పాత బకాయి రూ.77.22 లక్షలు. ప్రస్తుత బకాయి రూ.4.20 కోట్లు. మొత్తంగా రూ.4.98 కోట్లు మేర బకాయిలుండగా.. ఇప్పటివరకు రూ. 4.15 కోట్ల మేర వసూలు చేశారు. ఇంకా రూ.82.15 లక్షల మేర బకాయిలు ఉండగా.. ఇందుకోసం పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ఇంటింటికి వెళ్లి పన్ను వసూలు చేస్తున్నారు. పార్వతీపురం, పాలకొండ డివిజన్లలో కొమరాడ మండలం నుంచి 78 శాతం, వీరఘట్టం మండలం నుంచి 65 శాతం మేర మాత్రమే పన్నులు వసూళ్లయ్యాయి. మిగిలిన చోట్ల 95 నుంచి 98 శాతం మేర పన్నులు వసూలు చేశారు. మక్కువ, బలిజిపేట, గరుగుబిల్లి, కొమరాడ, పాచిపెంట, పార్వతీపురం, సాలూరు, సీతానగరం మండలాల నుంచి రూ.33.04 లక్షల మేర వసూళ్లు చేయాల్సి ఉంది. భామిని, కురుపాం, జియ్యమ్మవలస, పాలకొండ, సీతంపేట, వీరఘట్టం మండలాల నుంచి రూ.49.15 లక్షల మేర వసూళ్లు చేయాల్సి ఉంది. అయితే దీనిపై పంచాయతీ వాసులు మండిపడుతున్నారు. ఎన్నికల ముందు ఉన్నట్టుండి ఒకేసారి ఇళ్ల పన్నులు కట్టాలనడంతో ఆందోళన చెందుతున్నారు.

శత శాతం వసూళ్లు చేయాలి

ఇంటి పన్ను వసూళ్లు అనేది పంచాయతీ కార్యదర్శుల విధుల్లో ఒక భాగం. కచ్చితంగా ఇంటి పన్ను వసూళ్లు శత శాతం జరగాలి. లేదంటే చర్యలు తీసుకుంటాం.

- బి.సత్యనారాయణ, డీపీవో, పార్వతీపురం మన్యం జిల్లా

===========================

ఏటాలానే..

2020-21 నుంచి 15 శాతం మేర విలువ ఆధారిత ఆస్తి పన్ను పెంచుతూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా అలానే పన్ను పెంచారు. ప్రజలు పన్నులు చెల్లించి .. మున్సిపాల్టీ అభివృద్ధికి సహకరించాలి. - రుబేను, ఆర్‌వో, పార్వతీపురం

===========================

పెరుగుతూ ఉంటాయి..

సెంట్రల్‌ వాల్యూ సిస్టమ్‌ ప్రకారం ఏటా 15 శాతం చొప్పున పన్నులు పెరుగతూ ఉంటాయి. వాటిని సంబంధిత యజమానులు చెల్లించాల్సిందే. దీనిలో మున్సిపల్‌ అధికారుల ప్రమేయం ఏమీ ఉండదు.

- కె.శ్రీనివాసరావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ , సాలూరు

Updated Date - Apr 16 , 2024 | 12:37 AM