Share News

జగనన్నా .. జీడి పరిశ్రమ ఏదీ?

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:36 PM

‘మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో జీడి పరిశ్రమ ఏర్పాటు చేస్తాం’ అని సాక్షాత్తు సీఎం జగన్‌ కురుపాం పర్యటన సమయంలో హామీ ఇచ్చారు. అయితే నేటికీ సీఎం హామీ కార్యరూపం దాల్చలేదు. దీంతో వైసీపీ సర్కారు తీరుపై గిరిజన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జగనన్నా .. జీడి పరిశ్రమ ఏదీ?
గిరిజనులు సేకరించిన జీడిపిక్కలు

ఐదేళ్లుగా గిరిజన రైతులను పట్టించుకోని వైసీపీ

కానరాని కొనుగోలు కేంద్రాలు, మార్కెట్‌ సదుపాయం

ప్రోత్సాహకాలు, గిట్టుబాటు ధర కల్పించని ప్రభుత్వం

తెగుళ్లు, దళారుల కారణంగా ప్రతి ఏటా నష్టాలు

పంట సంరక్షణ చర్యలు శూన్యం

సర్కారు తీరుపై మండిపడుతున్న ఏజెన్సీ వాసులు

(సీతంపేట/గుమ్మలక్ష్మీపురం)

‘మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో జీడి పరిశ్రమ ఏర్పాటు చేస్తాం’ అని సాక్షాత్తు సీఎం జగన్‌ కురుపాం పర్యటన సమయంలో హామీ ఇచ్చారు. అయితే ఇది విని గిరిజన రైతులు ఎంతో సంతోషించారు. తమ కష్టాలు తీరుతాయని భావించారు. స్థానికంగానే గిట్టుబాటు ధరకు పంటను విక్రయించుకోవచ్చని అనుకున్నారు. అయితే వారి ఆశలు అడియాశలయ్యాయి. ఏళ్లు గడుస్తున్నా.. నేటికీ సీఎం హామీ కార్యరూపం దాల్చలేదు. దీంతో వైసీపీ సర్కారు తీరుపై గిరిజన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో అత్యధిక శాతం గిరిజనులకు జీడి పంటే జీవనాధారం. సుమారు 40 వేల ఎకరాల్లో ఈ తోటలు విస్తరించి ఉన్నాయి. ప్రధానంగా పాచిపెంట, సాలూరు రూరల్‌, మక్కువ, కొమరాడ, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సీతంపేట, భామిని, వీరఘట్టం మండలాల్లో గిరిజనులు జీడి సాగు చేపడుతున్నారు. అయితే ఏజెన్సీలో కీలకమైన జీడి సాగు, గిరిజన రైతులపై ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించలేదు. కనీసం పంట కొనుగోలు కేంద్రాలు, మార్కెటింగ్‌ సౌకర్యం, గిట్టుబాటు ధర కల్పించలేదు. నష్టపరిహారం కూడా చెల్లించలేదు. తెగుళ్లు ఆశించిన సమయంలోనూ పట్టించుకోకపోగా.. ప్రోత్సాహకాలు కూడా అందించడం లేదు. దీంతో ఏటా ఆదివాసీలు గట్టుబాటు ధర లేక దళారుల చేతుల్లో దగా పడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. జీడి రైతులకు అవసరమైన యంత్రాలు, పంట నష్టపోయిన వారికి ప్రోత్సాహకాలు అందించేవారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్‌ మారింది. ఐదేళ్లుగా జీడి రైతులకు ఎటువంటి భరోసా కల్పించలేదు.

డిమాండ్‌ ఉన్నా..

మన్యంలో సాగయ్యే జీడి పంటకు మైదాన ప్రాంతాల్లో మంచి డిమాండ్‌ ఉంది. అంతేగాకుండా ఇక్కడి జీడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. దిగుబడి కూడా అధికంగా ఉంటుంది. మైదాన ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ కిలో జీడి పిక్కలకు రూ.ఐదు వ్యత్యాసం ఉండడం వల్ల జీడి ఫ్యాక్టరీ యజమానులు, వ్యాపారులు ఈ ప్రాంతంలో పెద్దఎత్తున జీడి కొనుగోలుకు మొగ్గుచూపుతారు. అయితే ప్రభుత్వపరంగా ఎటువంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఏటా గిట్టుబాటు ధర కూడా కల్పించడం లేదు. జీడిపిక్కల కొనుగోలుపై ఏఎంసీ, జీసీసీ, వన్‌ధన్‌ కేంద్రాలు దృష్టిపెట్టకపోవడం వల్ల వ్యాపారులు, దళారులు నిర్ణయించిన ధరకే గిరిజన రైతులు పంటను విక్రయించాల్సి వస్తోంది. దీంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు.

తెగుళ్ల బెడద.. తగ్గిన దిగుబడి

గత ఐదేళ్లు చూసుకుంటే.. ఏజెన్సీ ప్రాంతాల్లో జీడి పంట ఆశాజనకంగా లేదు. దిగుబడులు తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్ల కిందట నాటిన జీడి మొక్కలు.. ఇప్పుడు ముదిరిపోయాయి. దీంతో ఏటా దిగుగబడులు తగ్గిపోవడంతో పాటు జీడి చెట్లకు అగ్గిదోమపోటు వంటి తెగుళ్లు ఆశిస్తున్నాయి. గతంలో 15 సంవత్సరాలు పైబడిన జీడి చెట్లకు కొమ్మ కత్తిరింపు విధానం ద్వారా ఐటడీఏ రైతులను ప్రోత్సహించేది. వాటికి అవసరమైన ఎరువులు, యంత్రాలను జాతీయ, ఐటీడీఏ ఉద్యాన శాఖాధికారులు సమకూర్చేవారు. అయితే గడిచిన ఐదేళ్లలో ఆ పరిస్థితి లేదు. వైసీపీ ప్రభుత్వం అటువంటి చర్యలేవీ చేపట్టకపోగా.. జీడి రైతులకు ఎటువంటి ప్రోత్సాహకాలు అందజేయలేదు.

2020-21లో జీడి పంటలకు పెద్ద ఎత్తున అగ్గితెగులు, దోమపాటు తెగుళ్లు ఆశించాయి. దీంతో పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో సుమారు 25 వేల ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. అప్పట్లో రాష్ట్రస్థాయి ఉద్యాన శాఖ అధికారులతో సర్వే జరిపారు. జీడి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే నేటికీ నెరవేరలేదు. ఏటా జీడి పంట దిగుబడి తగ్గి గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోతున్నా వారికి ఎటువంటి ఆర్థిక సాయం గాని, భరోసా గాని కల్పించడం లేదు. దీంతో సర్కారు తీరుపై గిరిజన రైతులు మండిపడుతున్నారు. దీనిపై గిరిజన సంఘాలు ఆందోళనలు చేపట్టినా.. వైసీపీ సర్కారు స్పందించలేదు. ఈ విషయంపై సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు ఉద్యాన శాఖాధికారిని వివరణ కోరగా ప్రభుత్వపరంగా జీడి రైతులకు ఎటువంటి పరికరాలు, ఎరువులు అందజేయలేదన్నారు. వాటి కోసం ప్రతిపాదనలు పంపించామని ఆయన స్పష్టం చేశారు.

నిధులు కేటాయించని వైనం

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీడీఏల పరిధిలో ప్రాజెక్టు ఉద్యాన శాఖలకు ఎటువంటి నిధులు కేటాయించడం లేదు. దీంతో ఆయా శాఖల అధికారులకు గిరిజన రైతులకు అవసరమైన యంత్రాలు, సేంద్రియ ఎరువులు, తెగుళ్ల నివారణ మందులు తదితర వాటని అందించలేకపోతున్నారు.

ప్రాసెసింగ్‌ యూనిట్లపైనా నిర్లక్ష్యం

గతంలో కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాల హయాంలో గుమ్మలక్ష్మీపురం మండలం జేకేపాడు , ఇరిడి గ్రామాల్లో మినీ జీడి ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యూనిట్లు కూడా మూతపడ్డాయి. మరోవైపు చీడపీడల నుంచి పంట సంరక్షణ చర్యలు కూడా తీసుకోవడం లేదు. దీనిపై స్పందించాలని రైతులు, గిరిజన సంఘాల నేతలు పలుమార్లు కోరినా.. వైసీపీ సర్కారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

నష్టపరిహారం చెల్లించలేదు

2020-21లో అగ్గితెగులు, పొగమంచు వల్ల జీడిరైతులు భారీగా పంటను నష్టపోయారు. అయితే ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఎటువంటి నష్టపరిహారం చెల్లించలేదు. దీనిపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది.

- బిడ్డిక అప్పారావు, గిరిజన సంఘం నాయకుడు, చిన్నకంబ, సీతంపేట మండలం

===================================

కార్యరూపం దాల్చలేదు..

జీడి పరిశ్రమ ఏర్పాటు చేస్తామని సీఎం జగన్‌ ప్రకటించినా.. నేటి వరకు కార్యరూపం దాల్చలేదు. ముఖ్యమంత్రి హామీలు నీటిమూటలుగా మిగిలిపోయాయి.

- కోలక అవినాష్‌, గిరిజన సంఘం నాయకుడు

Updated Date - Apr 19 , 2024 | 11:36 PM