Share News

జగన్‌ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:49 AM

జగన్‌ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రతి ఒక్కరు సన్నద్దం కావాలని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. నెల్లిమర్ల నియోజకవర్గంలోని డెంకాడ మండలం సింగవరం గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్‌షోలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు

జగన్‌ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి
జనసంద్రంగా సింగవరం, (ఇన్‌సెట్‌)లో విజయనగరంలో అభ్యర్థులతో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌

జగన్‌ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి

సింగవరం రోడ్‌షోలో చంద్రబాబు

ఊహించని విధంగా తరలివచ్చిన జనం

ఈ ప్రభుత్వాన్ని దించకపోతే నష్టమే: పవన్‌కల్యాణ్‌

నెల్లిమర్ల, ఏప్రిల్‌ 24: జగన్‌ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రతి ఒక్కరు సన్నద్దం కావాలని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. నెల్లిమర్ల నియోజకవర్గంలోని డెంకాడ మండలం సింగవరం గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్‌షోలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి లోకం నాగమాధవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి ఓ దోపిడీదారుడు, అహంకారి, విధ్వంసకారి అని విమర్శించారు. ఐదేళ్ల కాలంలో రాష్టాన్ని, ప్రధానంగా ఉత్తరాంధ్రను దోపిడీ చేశారని విమర్శించారు. తండ్రి మరణాన్ని ఒకసారి, బాబాయ్‌ హత్యను మరోసారి, తాజాగా గులకరాయి దెబ్బను ఉపయోగించి ప్రజలముందుకు వచ్చేందుకు డ్రామాలు ఆడుతున్నాడని విమర్శించారు. ఈ ఐదేళ్ల హయాంలో ఒక్క పరిశ్రమ అయినా తెచ్చాడా, ఒక్క సాగునీటి ప్రాజెక్టు అయినా పూర్తి చేశాడా అని ప్రశ్నించారు. భోగాపురం విమానాశ్రయాన్ని తాను శంకుస్థాపన చేస్తే జగన్‌ మళ్లీ పునః శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అక్రమాలకు అనకొండగా మారారని చంద్రబాబు విమర్శించారు. తంగుడుబిల్లి గ్రానైట్‌ కొండను దోచుకున్నారని, డెంకాడ మండలంలో ఇసుకను దోపిడీ చేశారని విమర్శించారు. కూటమి అభ్యర్థులు లోకం నాగమాధవి, కలిశెట్టి అప్పలనాయుడును గెలిపించాలని చంద్రబాబు కోరారు.

వలసలు ఆగాలి.. పరిశ్రమలు రావాలి: పవన్‌

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి నష్టమేనని అన్నారు. వైసీపీ హయాంలో ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని, వలసలు ఆగాలి.. పరిశ్రమలు రావాలని ఆయన ఆకాంక్షించారు. డెంకాడ మండలం మన్యాలపేటలో కిడ్నీ రోగులు అధికంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే రామతీర్థసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి సాగునీరు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఫార్మా కంపెనీల వల్ల తాగునీరు కాలుష్యం కాకుండా కాలుష్య నియంత్రణ మండలిని బలోపేతం చేస్తామన్నారు. రోడ్‌షోలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి లోకం నాగమాధవి, ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు, మూడు పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే భూ కబ్జాలకు అడ్డుకట్ట పడాలి: చంద్రబాబు

విజయనగరం రూరల్‌ : విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల భూ కబ్జాలు.. సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారని, అరాచక శక్తులను ఓడించి టీడీపీ అభ్యర్థి అదితి గజపతిరాజును ఎన్నికల్లో గెలిపించాలని చంద్రబాబు కోరారు. నగరంలోని కలెక్టరేట్‌ కూడలిలో టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు బుధవారం రోడ్‌షో నిర్వహించారు. తొలుత చంద్రబాబు మాట్లాడుతూ, అవినీతి మరకలేని అశోక్‌ గజపతిరాజు కుమార్తెను గెలిపించాలని కోరారు. మాన్సాస్‌ ట్రస్టు పరిధిలోని విద్యాలయాలపై జగన్‌ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, ఎంతో మంచి ఉద్దేశంతో నెలకొల్పిన విద్యాలయాలను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో కక్ష సాధింపులు, అరాచకాలతో పాటు గంజాయి, డ్రగ్స్‌ విచ్చలవిడిగా దొరుకుతున్నాయన్నారు. జనసేన నాయకుడు పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ, రానున్న ఎన్నికలు చాలా కీలకమని, రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించేవన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:49 AM