Share News

చరిత్ర తిరగరాసిన జగదీశ్వరి

ABN , Publish Date - Jun 05 , 2024 | 01:11 AM

కురుపాం నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి తోయక జగదీశ్వరి చరిత్ర తిరగరాశారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నికల్లో మాజీ మంత్రి, కురుపాం వైసీపీ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణిపై ఘన విజయం సాధించి.. చాలా ఏళ్ల తర్వాత నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేశారు.

చరిత్ర తిరగరాసిన జగదీశ్వరి
కురుపాం ఎమ్మెల్యేగ ఎన్నికైన జగదీశ్వరి

జియ్యమ్మవలస, జూన్‌ 4 : కురుపాం నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి తోయక జగదీశ్వరి చరిత్ర తిరగరాశారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నికల్లో మాజీ మంత్రి, కురుపాం వైసీపీ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణిపై ఘన విజయం సాధించి.. చాలా ఏళ్ల తర్వాత నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేశారు. నియోజకవర్గంలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, గరుగుబిల్లి మండలాల్లో మొత్తం 137 పంచాయతీల పరిధిలో 268 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 94,336 మంది పురుషులు, 99,736 మంది మహిళలు, 42 మంది ఇతరులు ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో 74,005 మంది పురుషులు, 78,421 మంది మహిళలు, 26 మంది ఇతరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఎంపీటీసీ నుంచి ఎమ్మెల్యేగా

గుమ్మలక్ష్మీపురం: గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేట ఎంపీటీసీ సెగ్మెంట్‌లో ఎంపీటీసీ సభ్యురాలిగా ఉన్న తోయక జగదీశ్వరి మొదటి ప్రయత్నంలో కురుపాం ఎమ్మెల్యే , మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణిపై పోటీ చేశారు. ఈ పోటీలో తెలుగు తమ్ముళ్లు, కూటమి శ్రేణులు సమష్టిగా పనిచేయడంతో 23,500 ఓట్లు మెజార్టీతో తోయక జగదీశ్వరి గెలుపొందారు. తోయక జగదీశ్వరి గుమ్మలక్ష్మీపురం మండలం కొండవాడ గ్రామంలో పుట్టారు. డిగ్రీ తర్వాత బీఈడీ చేశారు. ఆమె భర్త అడ్డాకుల సన్యాసినాయుడు రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. భర్త ప్రోత్సాహంతో జగదీశ్వరి ఎల్విన్‌పేట ఎంపీటీసీగా పనిచేశారు. 2022లో శత్రుచర్ల విజయ రామరాజు ఆశీస్సులతో ఆమె పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. జగదీశ్వరి ఎమ్మెల్యేగా విజయం సాఽధించడంతో గుమ్మలక్ష్మీపురంలో ఆమె ఇంటి వద్ద పండగ వాతావరణం నెలకొంది. వందలాదిగా కార్యకర్తలు తరలివచ్చి ఆమెకు అభినందనలు తెలిపారు. కార్యకర్తలు డాన్సులు చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Updated Date - Jun 05 , 2024 | 01:11 AM