Share News

ఐదు రోజులైంది!

ABN , Publish Date - Feb 27 , 2024 | 11:42 PM

‘తాటిపూడి పైలెట్‌ ప్రాజెక్టు హెడ్‌ వద్ద సాంకేతిక లోపం తలెత్తింది. దీన్ని సరిచేసేందుకు రెండు రోజుల సమయం పడుతుంది.

   ఐదు రోజులైంది!
పైపులైన్‌కు మరమ్మతులు చేపడుతున్న దృశ్యం

- దాహంతో అల్లాడుతున్న ఎస్‌.కోట ప్రజలు

- ‘తాటిపూడి’ ద్వారా సరఫరా నిలిపివేత

- రోజులు గడుస్తున్న కానరాని పునరుద్ధరణ

- తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు

(శృంగవరపుకోట ఫిబ్రవరి27)

‘తాటిపూడి పైలెట్‌ ప్రాజెక్టు హెడ్‌ వద్ద సాంకేతిక లోపం తలెత్తింది. దీన్ని సరిచేసేందుకు రెండు రోజుల సమయం పడుతుంది. శుక్ర, శనివారాల్లో తాగునీటి సరఫరా చేయలేం. ఆదివారం ఉదయం నుంచి పునఃప్రారంభిస్తాం.’ ఈ నెల 22న (గురువారం) తాటిపూడి పైలెట్‌ ప్రాజెక్టు అధికారులు చెప్పిన మాటలు ఇవి. రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా చేయలేమని చెప్పిన అధికారులు ఐదు రోజులు దాటినా ఇంకా పునరిద్ధరించలేదు. దీంతో శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాల ప్రజలు తాగునీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఎస్‌.కోట నియోజకవర్గంలోని పలు గ్రామాలతో పాటు పట్టణ పరిధిలో గత ఐదు రోజులుగా తాగునీటి సరఫరా కావడం లేదు. తాటిపూడి పైలెట్‌ ప్రాజెక్టు హెడ్‌ వద్ద సాంకేతిక లోపం తలెత్తడంతో ఎస్‌.కోట, పెద్దకండేపల్లి, కిల్తపాలెం, లక్కవరపు కోట, ధర్మవరం, మామిడిపల్లి, వేములపల్లి, వెంకటరమణ పేట, తిమిడి, బొద్దాం, పాకూరు, తలారి, కొట్యాడ, కాశపేట, తదితర గ్రామాలకు కొళాయిల ద్వారా తాగునీరు రావడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ బోర్లు, బావుల నుంచి తాగునీటిని తెచ్చుకొని తాగుతున్నారు. తమ ఇబ్బందులు పైలెట్‌ ప్రాజెక్టు అధికారులతో పాటు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు పట్టడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ హయాంలో ప్రాజెక్టు మంజూరు

రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజల తాగునీటి అవసరాలను గుర్తించి తాటిపూడి పైలెట్‌ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అప్పటి ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి విన్నపం మేరకు రూ.100 కోట్లను నాటి ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో గంట్యాడ మండలం తాటిపూడి రిజర్వాయర్‌ను ఆనుకొని ఉన్న నక్కలవలస వద్ద తాటిపూడి పైలెట్‌ ప్రాజెక్టును నిర్మించారు. దీనిద్వారా నియోజకవర్గంలోని 319 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఈ నిధులు 99 గ్రామాలకు మాత్రమే నీటి సరఫరా చేసేందుకు సరిపోయాయి. మిగిలిన నిధులను కూడా అప్పటి పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి నారా లోకేష్‌ మంజూరు చేశారు. ఇంతలో 2019 సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఈ నిధులు వెనక్కి వెళ్లాయి. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును విస్మరించింది. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టే ప్రయత్నం చేయలేదు. దీంతో కొన్ని గ్రామాలకు మాత్రమే ప్రాజెక్టు పరిమితమైంది. ఈ గ్రామాలకు కూడా సక్రమంగా నీరు అందడం లేదు. తరచూ సరఫరాలో అంతరాయం కలుగుతుంది.

ఏటా ఇదే పరిస్థితి

ప్రతి ఏటా తాగునీటి సరఫరాకు అంతరాయం కల్పించడం అధికారులకు అలవాటుగా మారిందనే విమర్శలు ఉన్నాయి. 2022 మే నెలాఖరులో నాలుగు రోజుల పాటు సరఫరా ఆపేశారు. అడిగితే ట్రాన్స్‌ఫార్మర్‌ చెడిందని అధికారులు చెప్పారు. దీన్ని బాగుచేసి సరఫరాను పునరిద్ధరించారు. అయితే కొళాయిల ద్వారా నురగ, బురద నీరు వచ్చేది. ప్రాజెక్టు అధికారులతో పాటు గ్రామీణ తాగునీటి సరఫరా అధికారులు రావడం తనిఖీలు, పరిశీలనలు చేయడం చేసే వారు. ఎక్కడ లోపముందో తెలియక తలలు పట్టుకొనేవారు. ఆగస్టు నెల వరకు పరిశుభ్రమైన తాగునీటిని ఇవ్వలేకపోయారు.

ఫ గతేడాది మే 29 నుంచి నాలుగు రోజుల పాటు తాగునీటి సరఫరా లేకుండా చేశారు. ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోవడంతోనే తాగునీటి సరఫరా ఆగిందని అధికారులు చెప్పుకొచ్చారు. తీరా సరఫరా సమయంలో కొళాయిల ద్వారా నురగ, బురదతో నీరు వస్తుండడంతో ప్రజలు పట్టడం మానేశారు. ఇలా వారం నుంచి పది రోజులు తాగునీటి కోసం ఇబ్బందులు పడ్డారు.

అల్లాడుతున్న పట్టణ ప్రజలు

పైలెట్‌ ప్రాజెక్టు నుంచి తాగునీరు సరఫరాకాక శృంగవరపు కోట పట్టణ ప్రజలు అల్లాడుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని ఇతర గ్రామాలకు తాగునీటికి ఎంతో కొంత ప్రత్యామ్నాయం ఉంది. అయితే, దాదాపు 50వేలకు పైబడి జనాభా ఉన్న ఎస్‌.కోట పట్టణానికి ప్రత్యామ్నాయం లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పట్టణ పరిధిలోని గాంధీ నగర్‌, రైల్వే లైన్‌కు అవతల ఉన్న బర్మారాలనీ, పుణ్యగిరి తదితర కాలనీలకు నీటి సరఫరా లేదు. తాగునీటి కోసం వాటర్‌ ప్లాంట్‌లకు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాటిపూడి పైలెట్‌ ప్రాజెక్టు నుంచి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

Updated Date - Feb 27 , 2024 | 11:42 PM