Share News

ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్క్‌ నిర్వహణ బాధ్యత ఐటీడీఏకి..

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:01 AM

సీతంపేట ఎన్టీఆర్‌అడ్వంచర్‌ పార్క్‌ నిర్వహణ బాధ్యత ఇక ఐటీడీఏ అధికారులదే. ఈ మేరకు పీవో కల్పనాకుమారి ఆదేశాలు జారీ చేశారు. ఇంతవరకు ఆ బాధ్యతలు చూసిన సవర ఆర్ట్స్‌ సొసైటీ కాలపరిమితి ఈ ఏడాది ఫిబ్రవరితో ముగియడంతో ఈ చర్యలు తీసుకున్నారు.

ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్క్‌ నిర్వహణ బాధ్యత  ఐటీడీఏకి..
సీతంపేటలో ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్క్‌

సీతంపేట: సీతంపేట ఎన్టీఆర్‌అడ్వంచర్‌ పార్క్‌ నిర్వహణ బాధ్యత ఇక ఐటీడీఏ అధికారులదే. ఈ మేరకు పీవో కల్పనాకుమారి ఆదేశాలు జారీ చేశారు. ఇంతవరకు ఆ బాధ్యతలు చూసిన సవర ఆర్ట్స్‌ సొసైటీ కాలపరిమితి ఈ ఏడాది ఫిబ్రవరితో ముగియడంతో ఈ చర్యలు తీసుకున్నారు. కాగా అధికారులు కుంటి సాకులు చూపి.. సొసైటీని తప్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒప్పందం ప్రకారం ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్క్‌ నిర్వహణ సొసైటీ చూడాల్సి ఉండగా.. ఆ బాధ్యతలు అధికారులకు ఎలా అప్పగిస్తారని ఆదివాసీలు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

ఐటీడీఏ పరిధిలోని మెట్టుగూడ జలపాతం, ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్క్‌ నిర్వహణ కోసం అప్పట్లో గిరిజన రైతులు మూడెకరాలు స్వచ్ఛందంగా అందించారు. భూమి ఇచ్చిన వారి పిల్లలకు ఉద్యోగం ఇస్తూ.. సీతంపేట ఐటీడీఏ సవర ఆర్ట్స్‌ సొసైటీని ఏర్పాటు చేసింది. పార్క్‌ నిర్వహణ కోసం 2017లో సొసైటీతో ఒప్పందం చేసుకుంది. కాగా అప్పట్లో 70 మంది వరకు గిరిజన నిరుద్యోగులు పనిచేసేవారు. సొసైటీ ప్రతినెలా అద్దె రూపంలో ఐటీడీఏకు రూ. 50 వేలు చెల్లించి విద్యుత్‌, సిబ్బంది జీతాలు నిర్వహణ చూసుకునేది. పార్క్‌లో వచ్చిన ఆదాయాన్ని బట్టి నెలకు రూ.9 వేల చొప్పున సిబ్బందికి చెల్లించుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. అయితే నాలుగేళ్ల కాలంలో పర్యాటకుల సంఖ్య తగ్గడం, కరోనా ప్రభావం తదితర కారణాలతో పార్కు ఆదాయం తగ్గింది. దీంతో పార్క్‌ నిర్వహణ కష్టతరమైంది. దానివల్ల సక్రమంగా అద్దెలు, విద్యుత్‌ బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సొసైటీ కాలపరిమితి ముగి యడంతో ఐటీడీఏ అధికారులు ఈ నెల నుంచి పార్క్‌ నిర్వహణ బాధ్యతను తీసుకున్నారు. దీనిపై ఐటీడీఏ పీవో రోసిరెడ్డిని వివరణ కోరగా.. సొసైటీ కాలపరిమితి ఫిబ్రవరికి పూర్తయిందన్నారు. సక్రమంగా అద్దె చెల్లించకపోవడం, లెక్కల్లో తేడాలు ఉండడం వల్ల ప్రస్తుతం పార్క్‌ నిర్వహణ బాధ్యతలు ఐటీడీఏ చూస్తోందని తెలిపారు. ఇకపై ప్రతి నెలా ఐటీడీఏ ఆధ్వర్యంలో పార్క్‌ సిబ్బందికి జీతాలు చెల్లిస్తామన్నారు. పార్క్‌ సౌకర్యాలు, రోజువారీ ఆదాయం తదితర విషయాలను జీసీసీ డీఎం, ఉద్యాన శాఖాధికారి, ఏపీవో, అకౌంటెంట్లు చూస్తారని ఆయన చెప్పారు.

Updated Date - Mar 11 , 2024 | 12:01 AM