Share News

మస్తర్ల నిర్వహణ ఇలాగేనా?

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:18 PM

ఉపాధి హామీ పథకం మస్తర్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో డ్వామా పీడీ రామచంద్రరావు అసహనం వ్యక్తం చేశారు. సిబ్బంది తీరుపై మండిపడ్డారు.

మస్తర్ల నిర్వహణ ఇలాగేనా?
సిబ్బందిని ప్రశ్నిస్తున్న పీడీ

భామిని: ఉపాధి హామీ పథకం మస్తర్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో డ్వామా పీడీ రామచంద్రరావు అసహనం వ్యక్తం చేశారు. సిబ్బంది తీరుపై మండిపడ్డారు. ఇలాగే నిర్వహిస్తారా? అంటూ ప్రశ్నించారు. శుక్రవారం భామిని మండల పరిషత్‌ కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో ఉపాధి మస్తర్లలో వేతనదారుల వేలిముద్రలు లేవని తనిఖీ బృందం తెలిపింది. దీనిపై డ్వామా పీడీ స్పందిస్తూ.. మస్తర్ల నిర్వహణలో నిర్లక్ష్యం తగదన్నారు. వేతనదారుల వేలిముద్రలు, సంతకాలు లేకపోతే రికవరీ తప్పదని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం హార్టికల్చర్‌లో భాగంగా నాటిన మొక్కల్లో ప్రస్తుతం 30 శాతం కూడా కనిపించడం లేదని తనిఖీ బృంద సభ్యులు తెలిపారు. దీనికి బాధ్యులైన వారి నుంచి రికవరీ చేస్తామని డ్వామా పీడీ తెలిపారు. విధి నిర్వహణలో వేతనదారులకు పనులు సమకూర్చకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా మండలంలో 2023 డి సెంబరు నుంచి 2024 జనవరి 11 వరకు జరిగిన ఉపాధి పనులపై సామాజిక తనిఖీ చేసినట్టు ఎస్‌ఆర్‌పీ తిరుపతిరావు తెలిపారు. ఆయా పనులకు రూ.12 కోట్లు వెచ్చించినట్లు గుర్తించామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ శ్రీహరి, ఎంపీడీవో ఉమామహేశ్వరి, ఏపీవో తులసీదాస్‌, ప్రజాప్రతినిధులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నీషియన్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 11:18 PM