Share News

ఇది మోసం కాదా?

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:23 PM

గత ఎన్నికల సమయంలో జగన్‌తో పాటు వైసీపీ నాయకులు ఊరూరా తిరిగి.. ఇంటింటికీ వెళ్లి మూతపడిన జూట్‌ పరిశ్రమలను తెరిపిస్తాం.. కొత్త వెలుగులు తెస్తాం.. ఉపాధికి మాది భరోసా.. వెన్నంటే ఉంటాం.. అంటూ ఓటు అడిగారు. నిజమేనని కార్మికులు నమ్మి ఓటేశారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ హామీని విస్మరించింది.

ఇది మోసం కాదా?
ఈ జూట్‌ మిల్లు ఇప్పుడు లేదు

ఇది మోసం కాదా?

పరిశ్రమలు తెరిపిస్తామని.. లేకుండా చేశారు

జూట్‌ కార్మికులకు అన్యాయం చేసిన ప్రభుత్వం

బొబ్బిలిలో మూడు పరిశ్రమల మూత

ఆ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం

జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే దుస్థితి

ఉపాధి కోల్పోయి జీవనానికీ కార్మికుల ఇబ్బందులు

గత ఎన్నికల సమయంలో జగన్‌తో పాటు వైసీపీ నాయకులు ఊరూరా తిరిగి.. ఇంటింటికీ వెళ్లి మూతపడిన జూట్‌ పరిశ్రమలను తెరిపిస్తాం.. కొత్త వెలుగులు తెస్తాం.. ఉపాధికి మాది భరోసా.. వెన్నంటే ఉంటాం.. అంటూ ఓటు అడిగారు. నిజమేనని కార్మికులు నమ్మి ఓటేశారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ హామీని విస్మరించింది. ఆ పార్టీ నాయకులు వాటివైపు చూడకపోగా అసలు పరిశ్రమలే లేకుండా నేలమట్టం చేసి ఆ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి సహకరించారు. కార్మికుల కళ్లు పొడిచారు. నమ్మించి మోసం చేశారు. వెరసి జూట్‌ పరిశ్రమలకు పెట్టింది పేరుగా ఉన్న బొబ్బిలిలో ఆ వైభవం కనుమరుగవుతోంది.

బొబ్బిలి, ఏప్రిల్‌ 25:

మూతపడ్డ పరిశ్రమలను తెరిపిస్తామని, కార్మికుల ఉపాధిని పునరుద్ధరిస్తామని బీరాలు పలికిన వైసీపీ నాయకులు మిల్లులు తెరవలేదు సరికదా ఏకంగా వాటిని పూర్తిగా నేలమట్టం చేసి రియల్‌ఎస్టేట్లుగా మార్చుకునేందుకు నిస్సిగ్గుగా యాజమాన్యాలకు సంపూర్ణ సహకారం అందించారు. ఫలితంగా బొబ్బిలి ప్రాంతంలో మూడు జూట్‌మిల్లులు(లక్ష్మీ శ్రీనివాస, జ్యోతి, నవ్య మిల్లులు), ఎన్‌సీఎస్‌ పంచదార పరిశ్రమ ప్రాభవం కోల్పోయాయి. లక్ష్మీ శ్రీనివాస మిల్లులో 2,175 మంది కార్మికులు పనిచేసేవారు. నవ్యలో 250 మంది విధుల్లో ఉండేవారు. ఈ పరిశ్రమల్లో బేకర్స్‌, డ్రాయింగ్‌, స్పిన్నింగ్‌, మగ్గం, చివరి దశలో గోనె సంచుల బేళ్లు తయారీ విభాగాలు ఉంటాయి. అన్నింటా పురుషులు, స్ర్తీలు షిఫ్టుల వారీగా పనిచేసేవారు. ఇదంతా గతం. పరిశ్రమల మూతతో కార్మికుల జీవితాలు గాడి తప్పాయి. కొందరు దినదినగండంగా బతుకుతుండగా ఇంకొందరు వేర్వేరు కూలి పనులు చేసుకుని జీవిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు తరలిపోయిన వారూ ఉన్నారు. కాగా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలు కూడా మూతపడ్డాయి. విజయనగరంలో అరుణా ఈస్టుకోస్టుమిల్లులలో ఆరువేలమంది కార్మికులు పనిచేసేవారు. ఈ పరిశ్రమ మూతపడింది. సరోజా మిల్లుదీ అదే పరిస్థితి. కొత్తవలస ఉమా జూట్‌మిల్లులో 1500 మంది పనిచేసేవారు. ప్రస్తుతం జిల్లాలో పనిచేస్తున్నది నెలిమర్ల జూట్‌మిల్లు మాత్రమే. కాగా పరిశ్రమలు మూతపడిన ప్రభావం కార్మికుల కుటుంబాలపై తీవ్రంగా పడింది. సుమారు ఐదు వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. వారిని పలకరిస్తే వ్యథాభరితమైన గాథలు వినిపిస్తున్నారు. కన్నీటి కష్టాలను ఏకరువు పెడుతున్నారు.

- బొబ్బిలి పట్టణంలోని తారకరామాకాలనీకి చెందిన 53 ఏళ్ల పిరిడి రాంబాబు జీవితం దయనీయంగా మారింది. 14 సంవత్సరాలపాటు స్థానిక జూట్‌మిల్లులో డ్రాయింగ్‌ డిపార్టుమెంట్‌లో పనిచేశాడు. ఏడేళ్ల కిందట జూట్‌మిల్లును మూసేయడంతో సాఫీగా సాగే ఆయన జీవితంలో పెద్ద పిడుగుపడ్డట్టయింది. కష్టంగా కుటుంబాన్ని నడుపుతున్న క్రమంలో రెండేళ్ల కిందట పక్షవాతం సోకింది. వైద్యం చేసుకునే స్థోమత లేక మందులు కొనుక్కోలేక దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు. అద్దె ఇంట్లో ఉంటూ భార్య తెచ్చే అరకొర జీతంతో కాలం నెట్టుకొస్తున్నాడు. జూట్‌ యాజమాన్యం 18 నెలలకు సంబంధించిన పీఎఫ్‌ బకాయిలను చెల్లించని కారణంగా రాంబాబుకు నెలవారీ రావాల్సిన రూ.1500 పెన్షన్‌ కూడా రావడం లేదు.

- పూలమ్మినచోటనే రాళ్ల మోత అన్నట్లుగా జూట్‌మిల్లులో హెడ్‌ ఫిట్టర్‌గా పనిచేసిన అప్పారావు అనే కార్మికుడు రైల్వేస్టేషన్‌లో సమోసాలు అమ్ముకుంటున్నారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు కార్మికులంతా తలో వృత్తిని ఎంపిక చేసుకొని బతుకుబండి ఈడుస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులుగా, హోటళ్లలో సర్వర్లు, క్లీనర్లుగా, చిత్తు కాగితాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాల కొనుగోలు, పండ్లు, కూరగాయల విక్రయం తదితర పనులు చేసుకుంటున్నారు. గ్రోత్‌సెంటరులో కొత్త పరిశ్రమల ఉనికి కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఉన్న కొద్దిపాటి ఫ్యాక్టరీల్లో కొన్నింటిని రేపోమాపో మూసేందుకు సిద్ధమవుతున్నారు. విద్యుత్‌ చార్జీల భారం అధికం కావడం, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో పారిశ్రామిక రంగం దాదాపుగా కునారిల్లిపోతోంది. జూట్‌ పరిశ్రమలో పనిచేసిన అనుభవం దృష్ట్యా కొందరు నెలిమర్ల, ఏలూరు దరి కొత్తూరు, గుంటూరు ప్రాంతాలకు వలసవెళ్లారు.

ఉపాధి వెతుక్కుంటున్నాం

కార్మికులు కిరణ్‌, మురళి, గోపి, సతీష్‌,శ్రీరామ్మూర్తి

బొబ్బిలిలోని జూట్‌మిల్లులు మూసివేయడంతో మేమంతా ఉపాధిని కోల్పోయాం. జూట్‌మిల్లులో పనిచేసే అనుభవంతో నెల్లిమర్ల, ఏలూరులో ఉన్న జూట్‌మిల్లుల్లో పనిదొరుకుతుందన్న ఆశతో పయనమయ్యాం. జూట్‌ మిల్లులో పని దొరికేవరకు ప్రత్యామ్నాయంగా ఏదో కాయకష్టం చేసుకొని బతుకుతాం. పిల్లాపాపలను పోషించేందుకు శ్రమించకతప్పదు కదా.

ఈ పాపం పాలకులదే

పి.శంకరరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు, బొబ్బిలి

వందలమంది జూట్‌ కార్మికులకు చెందిన పీఎఫ్‌ రూ.1.63 కోట్లను యాజమాన్యం చెల్లించాలి. వైసీపీ నాయకులు, ఎమ్మెల్యే కలిసి మధ్యవర్తిత్వం చేసి జూట్‌ కార్మికులను నిలువునా ముంచారు. తీరని అన్యాయం చేశారు. పరిశ్రమలు మూతపడి వేలాది మంది కార్మికులు వలసబాట పడుతున్నారు. ఈ పాపం ముమ్మాటికి పాలకులదే. గతంలో ఉపాధి కల్పించాలని అడిగిన పాపానికి మహిళలని చూడకుండా పోలీసుల చేత ఉక్కుపాదం మోపి జైళ్లలో కుక్కారు. జూట్‌ పరిశ్రమల ఉనికి పూర్తిగా కనుమరుగైంది. చెరకు రైతుల పరిస్థితీ దయనీయంగా ఉంది.

Updated Date - Apr 25 , 2024 | 11:24 PM