Share News

పండగ వేళ పప్పన్నం లేదా?

ABN , Publish Date - Oct 03 , 2024 | 11:45 PM

రేషన్‌ కార్డుదారులకు పూర్తిస్థాయిలో బియ్యం, కందిపప్పు, పంచదార పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదు. ప్రతినెలా జిల్లాలో అరకొరగానే సరుకుల పంపిణీ జరుగుతోంది. బియ్యం మినహా కందిపప్పు, పంచార అందరికీ అందించడం లేదు.

 పండగ వేళ పప్పన్నం లేదా?

బియ్యం పంపిణీతోనే సరిపెట్టేస్తున్న వైనం

పండగ నెలలోనూ అదే పరిస్థితి..

అమలు కాని ప్రభుత్వ ఆదేశాలు

కొన్నిచోట్ల ఇవ్వకుండానే.. ఇచ్చినట్లుగా రికార్డుల్లో నమోదు

ప్రతినెలా .. అరకొరే.. నష్టపోతున్న ఆఫ్‌లైన్‌ లబ్ధిదారులు

కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ

రేషన్‌ కార్డుదారులకు తప్పని అవస్థలు

పార్వతీపురం, అక్టోబరు3 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ కార్డుదారులకు పూర్తిస్థాయిలో బియ్యం, కందిపప్పు, పంచదార పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదు. ప్రతినెలా జిల్లాలో అరకొరగానే సరుకుల పంపిణీ జరుగుతోంది. బియ్యం మినహా కందిపప్పు, పంచార అందరికీ అందించడం లేదు. కొన్నిచోట్ల కేవలం బియ్యం, పంచదార మాత్రమే ఇచ్చి మమ అనిపిస్తున్నారు. ఈ నెలలో దసరా, దీపావళి పండగలు ఉన్న నేపథ్యంలో కార్డుదారులందరికీ తప్పనిసరిగా కిలో కందిపప్పు అందించాలని ప్రభుత్వం ప్రకటించినా.. పరిస్థితేమీ మారలేదు. దీంతో జిల్లావాసులు మండిపడుతున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలోని పార్వతీపురం డివిజన్‌లో ఎనిమిది మండలాలు, పాలకొండ డివిజన్‌లో ఏడు మండలాలున్నాయి. వాటి పరిధిలో ఎనిమిది ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు ఉన్నాయి. మొత్తంగా 578 రేషన్‌ డిపోలో ఉన్నాయి. 196 ప్రాంతాల్లో 27 ఎండీయూ వాహనాల ద్వారా కార్డుదారులకు సరుకులు అందిస్తున్నారు. పార్వతీపురం డివిజన్‌లో 1,56,418, పాలకొండ డివిజన్‌లో 1,24,833 రేషన్‌కార్డులు ఉన్నాయి. వాటిల్లో 33,469 కార్డులకు 60 ఎండీయూ వాహనాల ద్వారా ఆఫ్‌లైన్‌ ద్వారా సరుకులు పంపిణీ చేయాల్సి ఉంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో థంబ్‌ ద్వారా సరుకులు సరఫరా చేస్తారు కాబట్టి కార్డుదారుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదవుతుంటాయి. కానీ ఏజెన్సీలో కొన్నిచోట్ల అది వీలు పడదు. సిగ్నల్స్‌ లేని ప్రాంతాల్లో ఆఫ్‌లైన్‌లోనే సరుకులు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే దీన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది ఒక్కోనెల కందిపప్పు, పంచదారను కార్డుదారులకు పంపిణీ చేయకుండానే.. చేసినట్లుగా రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా కొరవడడంతో సరుకులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలున్నాయి. మొత్తంగా ఆఫ్‌లైన్‌ కార్డుదారులు నష్టపోతున్నారు.

అంతంతమాత్రంగానే సరఫరా ..

జిల్లాలో రేషన్‌ కార్డుదారులకు అవసరమైన 5,116 మెట్రిక్‌ టన్నుల బియ్యం పూర్తిస్థాయిలో సరఫరా జరుగుతుంది. 169.472 మెట్రిక్‌ టన్నుల పంచదార, 281.251 మెట్రిక్‌ టన్నులు కందిపప్పు అవసరమైనప్పటికీ ప్రతినెలా అరకొగానే అవి సరఫరా అవుతున్నాయి. దీంతో కార్డుదారులందరికీ పూర్తిస్థాయిలో అవి అందడం లేదు. ఒక్కోనెల రెండూ పంపిణీ చేయడం లేదు. కేవలం బియ్యం అందించి చేతులు దులుపుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో రేషన్‌ పంపిణీ ప్రారంభమైనప్పటికీ చాలాచోట్ల కార్డుదారులకు కందిపప్పు ఇవ్వడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు కిలో ధర రూ.150 వరకు ఉంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎండీయూ వాహనాల ద్వారా రూ.67కే అందజేయాల్సి ఉంది. కానీ సివిల్‌ సప్లైస్‌ గొడౌన్‌కు పూర్తిస్థాయిలో కందిపప్పు రాకపోవడంతో రేషన్‌ కార్డుదారులకు పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేకపోతున్నారు. వాస్తవంగా ఈ నెలలో జిల్లాకు 210 మెట్రిక్‌ టన్నులు కందిపప్పు అవసరం కాగా.. ఇప్పటివరకు కేవలం 15 మెట్రిక్‌ టన్నులు మాత్రమే సరఫరా అయ్యింది. దీంతో ఆఫ్‌లైన్‌లో కార్డుదారులకు పూర్తిగా కందిపప్పు అందని పరిస్థితి నెలకొంది.

ప్రతినెలా అంతే..

- జిల్లాలో సెప్టెంబరు నెల కోటా కింద 210 మెట్రిక్‌ టన్నులు కందిపప్పు అవసరం. కాగా కేవలం 50 మెట్రిక్‌ టన్నులు మాత్రమే సరఫరా అయ్యింది. ఇది కూడా సకాలంలో రాలేదు. దీంతో ఆఫ్‌లైన్‌లో నిత్యావర సరుకులు పొందే కార్డుదారులకు కందిపప్పు అందలేదు. ఇక జూన్‌ నెలలో చూసుకుంటే.. 144 మెట్రిక్‌ టన్నులు కందిపప్పు సరఫరా అవ్వగా.. ఆఫ్‌లైన్‌లో దానిని సరఫరా చేసినట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో కార్డుదారులకు పూర్తి స్థాయిలో కందిపప్పు అందలేదనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మే, జూలై, ఆగస్టు నెలల్లో అయితే పూర్తిగా కందిపప్పు సరఫరా జరగలేదు.

- పంచదార విషయానికొస్తే.. గత నెలలో 153 మెట్రిక్‌ టన్నులు అవసరం. అయితే కేవలం 70 మెట్రిక్‌ టన్నులు మాత్రమే సరఫరా అయ్యింది. అరకొర సరఫరా కారణంగా ఆఫ్‌లైన్‌లో కార్డుదారులందరూ నిత్యావసరాలను పొందలేక పోతున్నారు. కొన్ని ప్రాంతాలకే సరుకులు పరిమితం కావడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు.

మరికొన్ని రేషన్‌ డిపోలు...

జిల్లాలో 800 రేషన్‌ కార్డులు దాటిన ప్రాంతాల్లో మరో డిపో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వాటి సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అధికారులు కూడా ఈ ప్రక్రియలోనే ఉండగా.. కొంతమంది రేషన్‌ డిపో డీలర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో కొత్త డిపోల ఏర్పాటుకు బ్రేక్‌ పడింది. న్యాయస్థానంలో విషయం తేలిన తర్వాత జిల్లాలో కొత్తగా 43 రేషన్‌ డిపోలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.

సీతంపేట పరిధిలో..

సీతంపేట రూరల్‌: సీతంపేట ఐటీడీఏ పరిధిలో రేషన్‌కార్డుదారులకు కందిపప్పు ఇవ్వడం లేదు. బియ్యం, పంచదార మాత్రమే ఇస్తున్నారు. ఇదేంటని కార్డుదారులు ప్రశ్నిస్తుండడంతో కందిపప్పు రాలేదని, తరువాత పంపిణీ చేస్తామని ఎండీయూ వాహనాల ఆపరేటర్‌లు సమాధానమిస్తున్నారు. సీతంపేట సివిల్‌సప్లయిస్‌ గొడౌన్‌ పరిధిలో సీతంపేట, భామిని మండలాలు ఉన్నాయి. వాటి పరిధిలో 30 వేల రేషన్‌కార్డులు ఉన్నాయి. 23 ఎండీయూ వాహనాల ద్వారా రేషన్‌కార్డు దారులకు నిత్యావసర సరుకులను అందిస్తున్నారు. ప్రతినెలా 30 టన్నుల కందిపప్పు అవసరం కాగా ఈ నెల 2టన్నులు(2 వేల కేజీలు) మాత్రమే గొడౌన్‌కు స్టాక్‌ వచ్చింది. దీంతో కార్డుదారులకు సరఫరా నిలిచిపోయింది. ‘సీతంపేట, భామిని మండలాలకు 30 టన్నుల కందిపప్పు అవసరం. గతనెల 30న సాయంత్రం 2టన్నులు మాత్రమే గొడౌన్‌కు వచ్చింది. మరోవైపు డీఆర్‌ డిపోల సేల్స్‌మెన్‌ థంబ్‌ల ఆలస్యం కావడం... డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా లేని కారణంగా కందిపప్పు పంపిణీ చేపట్టలేదు. ’ అని సివిల్‌ సప్లయిస్‌ డీటీ కె.మధు తెలిపారు.

కఠిన చర్యలు తప్పవు

ఆఫ్‌లైన్‌ ద్వారా రేషన్‌కార్డుదారులకు ప్రతినెలా నిత్యావసర సరుకులన్నీ ఇవ్వాలి. ఇవ్వకుండా ఇచ్చినట్టు రికార్డుల్లో నమోదు చేస్తే.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ నెల 210 మెట్రిక్‌ టన్నుల కందిపప్పు కోసం ఇండెంట్‌ పెట్టగా.. 15 మెట్రిక్‌ టన్నులు వచ్చింది. ఈ మేరకు పంపిణీ చేస్తున్నాం.

- శ్రీనివాసరావు, డీఎం, సివిల్‌ సప్లైస్‌, పార్వతీపురం మన్యం

Updated Date - Oct 03 , 2024 | 11:45 PM