Share News

ఇల్లేదీ జగనన్నా?

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:20 AM

ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు.. ఎన్నెన్నో వాగ్దానాలు. ఓట్లు వేయించుకున్నారు. గెలిచారు.. అధికారం చేపట్టారు. ప్రజలను మాత్రం మర్చిపోయారు. హామీలు, వాగ్దానాలు గాలికొదిలేశారు. ఇవి ఒకటి, రెండు కాదు.. వందల సంఖ్యలో ఉన్నాయి. గద్దెనెక్కి ఐదేళ్లు పూర్తవుతున్నాయి. ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. రోడ్లూ వేయలేదు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పాలకులు మాట ఇచ్చి తప్పిన వైనంపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు..

ఇల్లేదీ జగనన్నా?
ఎస్‌.కోట మండలం వెంకటరమణపేట గ్రామానికి దూరంగా ఇళ్ల స్థలాలకు సేకరించిన స్థలం

ఇల్లేదీ జగనన్నా?

అందరికీ కాదు కొందరికే కేటాయింపు

అర్హులకు దక్కని ఇంటి పట్టాలు

గ్రామాలకు దూరంగా భూ సేకరణ

స్థలం లేదంటూ కొన్నిచోట్ల మొండిచేయి

పేదల కలను నెరవేర్చలేకపోయిన ప్రభుత్వం

ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు.. ఎన్నెన్నో వాగ్దానాలు. ఓట్లు వేయించుకున్నారు. గెలిచారు.. అధికారం చేపట్టారు. ప్రజలను మాత్రం మర్చిపోయారు. హామీలు, వాగ్దానాలు గాలికొదిలేశారు. ఇవి ఒకటి, రెండు కాదు.. వందల సంఖ్యలో ఉన్నాయి. గద్దెనెక్కి ఐదేళ్లు పూర్తవుతున్నాయి. ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. రోడ్లూ వేయలేదు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పాలకులు మాట ఇచ్చి తప్పిన వైనంపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు..

శృంగవరపుకోట, ఏప్రిల్‌ 17:

‘నవరత్నాల పాంప్లెట్‌ ఓ భగవద్గీత.. బైబిల్‌, ఖురాన్‌ గ్రంథాల కంటే మాకు విలువైనది. ఈ నవరత్నాల్లో పేదలందరికీ ఇళ్ల పథకాన్ని చేర్చుతున్నాం. వైసీపీ అధికారం చేపట్టిన వెంటనే పేదలు ఇళ్లు కట్టుకొనేందుకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలను కేటాయిస్తుంది. గృహనిర్మాణ శాఖ ద్వారా ఇందుకోసం ఆర్థిక సహాయం చేస్తాం. అప్పటికీ ఇబ్బందులు పడే పేదలకు ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుంది. సొంత నివాసం లేకుండా ఒక్క పేద కుటుంబం ఉండదు.’

- పాదయాత్ర సమయంలో జిల్లాలో జగన్‌ ఇచ్చిన హామీ

- శృంగవరపుకోట మండలం వెంకటరమణపేటకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాలు అందించేందుకు ఊరికి దూరంగా భూమి సేకరించారు. దూరం కావడంతో పేదలెవరూ ముందుకు రాలేదు. ఇళ్ల నిర్మాణాల కోసం అధికారులు ఒత్తిడి పెంచడంతో విసుగు చెందిన పేదలు మూకుమ్మడి పట్టాలను తిరిగి ఇచ్చేశారు.

- ఎస్‌.కోట మండలంలోనే పెదఖండేపల్లి గ్రామానికి చెందిన పేదలకు పెద్ద,పెద్ద బండరాళ్లున్న ప్రాంతంలో ఇళ్ల పట్టాలను అందించారు. రాళ్లను తొలగించి స్థలం చదును చేసుకొనేందుకే రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలు ఖర్చు అవుతుందని తెలిసి పేదలు మరోచోట అనువైన స్థలాన్ని ఇవ్వాలని కోరారు. ఇప్పటికీ కదలిక లేదు.

- వేపాడ మండలం సోంపురం, అరిగిపాలెం గ్రామాలు జంట పంచాయతీలు. ఈ రెండు పంచాయతీల పరిధిలో ఇళ్ల పట్టాలు అందించేందుకు పేదలను గుర్తించారు. పట్టాలు ఇచ్చేందుకు భూమిని మాత్రం సేకరించలేదు. అందుబాటులో వున్న ప్రభుత్వ భూమి వైసీపీ నేతల ఆధీనంలో ఉంది. దీంతో అధికారులు అడిగే ధైర్యం చేయలేకపోయారు. ఈగ్రామాలకు సుమారు మూడు కిలోమిటర్లు దూరంలో వున్న నర్సిపల్లి మెట్ట వద్ద స్థల పరిశీలన చేశారు. ఇక్కడ పట్టాలు తీసుకొనేందుకు పేదలు ఇష్టపడలేదు.

- ఇళ్ల స్థలం కోసం దరఖాస్తు చేసిన 90 రోజుల్లో పట్టాలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో శృంగవరపుకోట మేజర్‌ పంచాయతీ పరిధిలో 481 మంది లబ్ధిదారులు ముందుకు వచ్చారు. వీరంతా దరఖాస్తు చేసి రెండేళ్లు గడుస్తున్నా పట్టాలు ఇవ్వలేదు. ఇప్పటికి చాలా మంది తహసీల్దార్‌ కార్యాలయం, స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. పంచాయతీ పరిధిలో పేదలకు ఇళ్ల పథకం కింద 1114 మందికి పట్టాలు పంపిణీ చేశారు అయితే వైసీపీ నేతల సన్నిహితులు, బంధువులే ఎక్కువగా లబ్ధిపొందారు.

జిల్లాలో ప్రతి మండలంలోనూ ఎంతో మంది అర్హులకు ఇళ్ల స్థలాలు దక్కలేదు. కొన్ని గ్రామాలకు దూరంగా స్థలాలు చూపించడంతో పేదలు అక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు ఇష్టపడలేదు. పట్టాలు ఇచ్చిన గ్రామాల్లో అర్హులకంటే అనర్హులే ఎక్కువ ఉన్నారు. దీనిపై పేదల నుంచి వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు నైంటీడేస్‌ (90రోజులు) పథకాన్ని తెరమీదకు తెచ్చారు. దరఖాస్తు చేసిన 90 రోజుల్లో ఇళ్ల స్థల పట్టాను చేతిలో పెడతామని పేర్కొన్న ప్రభుత్వం రెండేళ్లయినా ఇవ్వకపోవడంతో నేటికీ వేలాది మంది పేదలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇలా పేదల సొంతింటి కల నిజం చేయడంలో జగన్‌ ప్రభుత్వం విఫలమైంది. అందరికీ కాదు కొందరికే ఇళ్ల పథకం అనిపించేలా చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్‌ జిల్లాలో పాదయాత్ర చేశారు. ఆ సమయంలో పేదలందరికీ ఇళ్ల స్థల పట్టాలు ఇస్తామని ఊరూ వాడా వాగ్ధానం చేశారు. ఇళ్ల స్థలంతో పాటు గృహ నిర్మాణ శాఖ ద్వారా ఆర్థిక సహాయం చేస్తామని కూడా చెప్పారు. అవసరమైతే ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుందనీ బీరాలు పలికారు.

అధికారంలోకి వచ్చిన తరువాత సాంఘిక సంక్షేమ శాఖ సేకరించి వుంచిన భూములపై పడ్డారు. ఇళ్ల స్థల పట్టాలకు కాంగ్రెస్‌, టీడీపీ సేకరించిన భూములను తామే సేకరించినట్లు బిల్డప్‌ ఇచ్చారు. తాత, తండ్రుల నుంచి తమ సొంత భూములుగా భావించి సాగు చేసుకుంటున్న రైతుల వద్ద నుంచి లాక్కున్నారు. కాగా లబ్ధిదారుల ఎంపికలోనూ అధికార పార్టీకి చెందిన వారికే లబ్ధి చేకూర్చారు. దీంతో అర్హుల కంటే అనర్హులకే ఎక్కువ లాభం చేకూరింది. దీనిపై పేదల నుంచి ఆందోళన వ్యక్తమవడంతో దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో స్థలం ఇస్తామని సరికొత్త నాటకం అడారు. ప్రభుత్వ స్థలాలు లేకపోవడంతో ప్రైవేటు స్థలాలు కొంటున్నట్లు నివేదికలు తయారు చేశారు. ఈ విధానంలోనే శృంగవరపుకోట పంచాయతీలో 11 ఎకరాలు సేకరించారు. ప్రతిపాదనలతోనే సరిపెట్టారు. ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో ఒక మంచం కూడా పట్టని గది స్థలం వుండడం, ఇచ్చిన స్థలాల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పాటు ప్రభుత్వం ఇస్తున్న రూ.1.80 లక్షలు సరిపోక చాలా మంది ఇళ్ల నిర్మాణాలకు వెనుకంజ వేశారు. ఇంటి స్థలం వెనక్కితీసుకుంటామని బెదిరించడంతో కొంత మంది అదనంగా మరో నాలుగు లక్షలు అప్పు చేసి కట్టారు. ఇప్పుడు ఇలాంటి వారంతా వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:20 AM