Share News

రైతులకు అండగా ఉంటాం

ABN , Publish Date - Dec 10 , 2024 | 12:33 AM

రైతులకు అన్ని విధాలా అండగా నిలబడతామని పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. డెంకాడ మండలం చందకపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు.

 రైతులకు  అండగా ఉంటాం
మాట్లాడుతున్న మంత్రి నాదెండ్ల మనోహర్‌

రైతులకు అండగా ఉంటాం

48 గంటల్లోనే ధాన్యం డబ్బులు జమ

పౌర సర ఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌

డెంకాడ, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి):

రైతులకు అన్ని విధాలా అండగా నిలబడతామని పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. డెంకాడ మండలం చందకపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ధాన్యం దిగుబడి, కొనుగోలు ప్రక్రియ, రవాణా, నగదు జమ, ఇతర సమస్యలపై ఆరా తీశారు. అనంతరం రైతులనుద్దేశించి మాట్లాడారు. గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, సుమారు రూ.1674 కోట్ల ధాన్యం డబ్బులు బకాయి పెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే ఆ బకాయిలన్నింటినీ పూర్తిగా చెల్లించిందని తెలిపారు. గతంలా కాకుండా రైతులు తమకు నచ్చిన మిల్లుకు ధాన్యం తరలించవచ్చునని సూచించారు. తేమ 17శాతం వర కు అనుమతి ఉందని, 5 కిలోలు అదనంగా తీసుకుని, తేమ 24 శాతం వరకు ఉన్నప్పటికీ కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సుమారు 2వేల టార్పాలిన్లను రైతులకు అందించామని తెలిపారు. రైతులు ఇబ్బంది పడకుండా ఏఐ టెక్నాలజీతో ట్రక్‌సీట్లను రూపొందిస్తున్నామన్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే నాగమాధవి మాట్లాడుతూ, తమ నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులు లేక బోర్లు పైనే వ్యవసాయం సాగుతోందని, సాగునీటి సదుపాయం కల్పించాలని కోరారు. జాయింట్‌ కలెక్టర్‌ సేతుమాధవన్‌ మాట్లాడుతూ, ఈ నెల 10,11,12 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు తగిన జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. రైతులు దళారులను ఆశ్రయించవద్దని, కొనుగోలు కేంద్రాలకు మాత్రమే ధాన్యం తరలించాలన్నారు. కార్యక్రమంలో ఏపీ మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌ కర్రోతు బంగార్రాజు, వ్యవసాయశాఖ జేడీ వీటీ రామారావు డీఎస్‌ఓ మధుసూధనరావు, సివిల్‌ సప్లయిస్‌ డీఎం మీనాకుమారి, మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్‌రావు, ఎంపీపీ వాసుదేవరావు, ఏడీఏ నాగభూషణరావు, ఏవో నిర్మల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 10 , 2024 | 12:33 AM