Share News

ఒట్టిమాటలేనా..?

ABN , Publish Date - Apr 08 , 2024 | 11:58 PM

‘సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడతాం.. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం..’ అని ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే జిల్లాలో పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరందించే ప్రాజెక్టుల ఆధునికీకరణపై మాత్రం శీతకన్ను వేసింది. కనీస స్థాయిలో పనులు చేయించలేకపోయింది. జైకా నిధులు మంజూరైనా.. సకాలంలో బిల్లులు చెల్లించలేకపోయింది.

ఒట్టిమాటలేనా..?
వట్టిగెడ్డ ప్రాజెక్టు ఇలా..

జైకా నిధులు మంజూరైనా.. పనులు పూర్తి చేయించలే..

సకాలంలో బిల్లులు చెల్లించని వైనం

రెండు ప్రాజెక్టులకు గడువు పూర్తి

వట్టిగెడ్డకు ఇంకా నాలుగు నెలలే సమయం

ఇప్పటివరకు 20 శాతానికి మించని పనులు

ప్రభుత్వం నిర్లక్ష్యంపై రైతుల పెదవి విరుపు

(జియ్యమ్మవలస)

‘సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడతాం.. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం..’ అని ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే జిల్లాలో పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరందించే ప్రాజెక్టుల ఆధునికీకరణపై మాత్రం శీతకన్ను వేసింది. కనీస స్థాయిలో పనులు చేయించలేకపోయింది. జైకా నిధులు మంజూరైనా.. సకాలంలో బిల్లులు చెల్లించలేకపోయింది. మరోవైపు అధికారుల పర్యవేక్షణ కూడా కొరవడింది. దీంతో ఏటా రైతులు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పటికే ఆధునికీకరణ విషయంలో జిల్లాలో రెండు ప్రాజెక్టుల గడువు పూర్తయింది. మరో రెండు ప్రాజెక్టులకు సంబంధించి నాలుగు నెలలు, ఏడాది సమయం మాత్రమే ఉంది. ఇప్పటివరకు చేపట్టిన పనులు 20 శాతం లోపలే ఉండగా.. మరోవైపు ఎన్నికల సమయం కావడంతో గడువులోగా మిగతా నిర్మాణాలు పూర్తవడం ప్రశ్నార్థకంగా మారింది. మొత్తంగా వైసీపీ సర్కారు ‘మన్యం’లో సాగునీటి ప్రాజెక్టులపై పెద్దగా దృష్టి సారించకపోవడంపై జిల్లావాసులు మండిపడు తున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో వట్టిగెడ్డ, పెదంకలాం, వెంగళరాయసాగర్‌ ప్రాజెక్టుల ఆధునికీకరణ కోసం ఎన్నో ఏళ్ల నుంచి ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే 2016-17లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ నాలుగు ప్రాజెక్టుల పరిశీలనకు నీటి పారుదలశాఖ చీఫ్‌ ఇంజనీర్‌ బృందం పలుమార్లు సందర్శించింది. ఆ తరువాత 2018లో జపాన్‌ నుంచి వచ్చిన ఇంజనీరింగ్‌ బృందం ప్రాజెక్టుల ఆధునికీకరణ విషయంపై అప్పటి టీడీపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని వెళ్లిపోయింది. ఈ మేరకు జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోపరేషన్‌ ఏజెన్సీ (జైకా), ఏపీ ఇరిగేషన్‌ అండ్‌ లైవ్లీహుడ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం-2 సంయుక్తంగా ఈ ఆధునికీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. జైకా నిధులు పర్యవేక్షణ బాధ్యత ఏఇరిగేషన్‌ అండ్‌ లైవ్లీహుడ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం-2దే. అయితే 2019 ఫిబ్రవరిలో జైకా నిధులు మంజూరయ్యాయి. కాగా వెంగళరాయసాగర్‌, వట్టిగెడ ్డ ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులకు 24 నెలలు గడువు అయితే పెద్దగెడ్డ, పెదంకలాం ప్రాజెక్టుల పనులు పూర్తికి 18 నెలలే గడువు ఇచ్చారు. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే.. ఇప్పటివరకు కనీసం 20 శాతం పనులు జరగలేదు. ఒక్క వట్టిగెడ్డ రిజర్వాయర్‌ పనులను రాష్ట్ర కాంట్రాక్టర్‌ చేస్తుంటే, మిగిలిన మూడు ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం వారు చేస్తున్నారు. జిల్లాలో పెదంకలాం, పెద్దగెడ్డ ప్రాజెక్టుల ఆధునికీకరణ పనుల గుడువు పూర్తయ్యింది. మరిప్పుడు ఏమి చేయాలో అధికారులకు సైతం అర్థం కావడం లేదు. ఆయా ప్రాజెక్టుల పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే..

వట్టిగెడ్డ రిజర్వాయర్‌

వట్టిగెడ్డ రిజర్వాయర్‌ను జియ్యమ్మవలస మండలం తాళ్లడుమ్మ పంచాయతీ రావాడ గ్రామం వద్ద నిర్మించారు. కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 16,680 ఎకరాలకు సాగునీరే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు ఆధునికీకరణ కోసం 2019, జనవరి 8న రూ. 44.85 కోట్లతో పరిపాలనా ఆమోదం లభించింది. 2020, ఆగస్టు 19న సాంకేతిక ఆమోదం లభించింది. శ్రీసాయిలక్ష్మీ కనస్ట్రక్షన్‌, విజయవాడ వారు 2021, జనవరి 8న నీటి పారుదలశాఖ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ ఒప్పందం కుదర్చుకున్నారు. అనంతరం పనులు ప్రారంభించారు. అయితే 2023, జూన్‌ నాటికి కేవలం 15 శాతం పనులు మాత్రమే జరిగాయి. 2023, జనవరి 7 నాటికి అంటే రెండేళ్లలో పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ పనులు నత్తనడకన సాగుతుండటంతో 2024, జూలై 7 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. అంటే ఇంకా నాలుగు నెలలే గడువు ఉంది. రెండేళ్లలో 15 శాతం పనులు చేసిన కాంట్రాక్టరు ఈ నాలుగు నెలల్లో పనులు పూర్తి చేయడం సాధ్యమేనా అనేది ఉన్నతాధికారులే తేల్చాల్సి ఉంది.

వెంగళరాయసాగర్‌..

వెంగళరాయసాగర్‌ (వీఆర్‌ఎస్‌) ప్రాజెక్టు సువర్ణముఖి నదిపై సాలూరు మండలంలోని లక్ష్మీపురం గ్రామం వద్ద ఉంది. ఈ ప్రాజెక్టు కుడి, ఎదమ ప్రధాన కాలువల ద్వారా మూడు మండలాల్లో 24,700 ఎకరాలకు సాగునీరందేలా డిజైన్‌ చేశారు. మక్కువ మండలంలో 14,550 ఎకరాలకు, బొబ్బిలి మండలంలో 6,427 ఎకరాలకు, సీతానగరం మండలంలో 3,723 ఎకరాలకు సాగునీరందుతుంది. అయితే దీని ఆధునికీకరణ పనులకు రూ.63.50 కోట్లతో 2019 ఫిబ్రవరి 15న పరిపాలనా ఆమోదం లభించింది. 2020 జూలై 11న సాంకేతిక ఆమోదం లభించింది. తెలంగాణ రాష్ట్రం సూర్యపేటలో ఉన్న ఎం/ఎస్‌ ఎస్‌కేఆర్‌ కనస్ట్రక్షన్‌ , ఎం/ఎస్‌ రాజ్‌పద్మ ఇన్‌ కార్పొరేషన్‌లతో 2020, ఏప్రిల్‌ 26లో రూ. 48.90 కోట్లతో అగ్రిమెంట్‌ కుదిరింది. వాస్తవానికి 2023, ఏప్రిల్‌ 25 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఇంతవరకు కేవలం 21 శాతం పనులే పూర్తయ్యాయి. అయితే దీనిని పూర్తి చేసేందుకు 2025, మార్చి 24 వరకు గడువు ఉంది.

పెద్దగెడ్డ ..

పాచిపెంటలో ఉన్న పెద్దగెడ్డ ప్రాజెక్టు ద్వారా పాచిపెంట మండలంలో 6,039 ఎకరాలు, సాలూరు మండలంలో 2,839 ఎకరాలు, రామభద్రపురం మండలంలో 3122 ఎకరాలకు సాగునీరందుతోంది. మొత్తంగా మూడు మండలాల పరిధిలో 12 వేల ఎకరాలకు సాగునీరందించే ఈ ప్రాజెక్టు ఆధునికీకరణకు గాను 2019, ఫిబ్రవరి 15లో రూ. 28.18 కోట్లతో పరిపాలన ఆమోదం లభించింది. 2020, మే 22లో సాంకేతిక ఆమోదం లభించింది. ఈ పనులు చేయడానికి గాను హైదాబాద్‌ తార్నాకకు చెందిన ఎం/ఎస్‌ జీవీవీ - వైఎంఎంఆర్‌ (జేవీ) ముందుకొచ్చింది. రూ. 23.83 కోట్లతో ఆధునికీకరణ చేసేందుకు గాను 2020 జూలై 5న ఒప్పందం జరిగింది. వాస్తవానికి 18 నెలల్లో ఆ పనులు పూర్తికావాల్సి ఉంది. కానీ నిర్ణీత గడువుకు 20 శాతం పనులు మాత్రమే జరిగాయి. వాస్తవానికి 2023, డిసెంబరు 31 నాటికే ఈ ప్రాజెక్టు ఆధునికీకరణ తుది గడువు.

పెదంకలాం..

ఈ ప్రాజెక్టు సీతానగరం మండలం పెదంకలాం గ్రామం వద్ద ఉంది. దీని ద్వారా రెండు మండలాల్లో 8,253.47 ఎకరాలకు సాగునీరందుతుంది. జిల్లాలోని బలిజిపేట మండలంలో 6617.16 ఎకరాలకు, విజయనగరం జిల్లాలోని వంగర మండలంలో 1636.31 ఎకరాలకు సాగునీరందించే సామర్థ్యం ఉంది. దీని ఆధునికీకరణకు గాను 2019, ఫిబ్రవరి 15న రూ. 17.30 కోట్లతో పరిపాలనా ఆమోదం లభించింది. 2020, జూన్‌ 22లో సాంకేతిక ఆమోదం కూడా లభించింది. ఈ ప్రాజెక్టు ఆధునికీకరణకు తెలంగాణ రాష్ట్రం సూర్యపేటలో ఎం/ఎస్‌ ఎస్‌కేఆర్‌ కనస్ట్రక్షన్‌, ఎం/ఎస్‌ రాజ్‌పద్మ ఇన్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా ముందు కొచ్చాయి. ఈ మేరకు నీటి పారుదలశాఖ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2023, డిసెంబరు 31లోపు పనులు చేయాల్సి ఉంది. అయితే కేవలం 5 శాతం పనులు మాత్రమే గడువు నాటికి జరగడం విశేషం. మొత్తంగా వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పనులు పూర్తికాని పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా ఈ ఏడాది జనవరి నుంచి ఆధునికీకరణ పనులు చేయిస్తామని చెప్పుకొచ్చిన నీటి పారుదల శాఖ అధికారులు కూడా చొరవ చూపలేదు. దీంతో కాంట్రాక్టర్లు కూడా స్పందించడం లేదు. బిల్లులు చెల్లింపులు కాకపోవడంతో ఆశించిన స్థాయిలో పనులు సాగడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

నోటీసులిచ్చాం

జిల్లాలో ప్రాజెక్టుల ఆధునికీకరణకు సంబంధించి కాంట్రాక్టర్లకు వర్క్‌ రివిజన్‌ నోటీసులు ఇచ్చాం. త్వరలో పనులు ప్రారంభిస్తారు. వారు ఇంతవరకు చేసిన పనులకు రూ. 8 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని క్లియర్‌ చేస్తాం.

- వైవీ రాజరాజేశ్వరి, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌, నీటి పారుదలశాఖ

Updated Date - Apr 08 , 2024 | 11:58 PM