Share News

చెరువు స్థలామా.. జిరాయితీయా?

ABN , Publish Date - May 24 , 2024 | 11:56 PM

అక్కడ సెంటు భూమి రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పలుకుతోంది. దాదాపు రూ.2కోట్లు విలువైన భూమి విషయంలో ఓ వ్యాపారి, రైతుల మధ్య వివాదం నెలకొంది. రాచ్చెరువు గర్భానికి చెందిన భూమి అని రైతులు, జిరాయితీ భూమిగా వ్యాపారి వాదించుకోవడంతో స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.

చెరువు స్థలామా.. జిరాయితీయా?
స్థలాన్ని చదును చేసి చెట్లను కొట్టేసి ట్రాక్టర్‌కు లోడ్‌ చేసిన దృశ్యం

చెరువు స్థలామా.. జిరాయితీయా?

స్పష్టత ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు

చెట్లు నరికేయడంతో ఆగ్రహం వ్యక్తంచేసిన రైతులు

శృంగవరపుకోట, మే 24:

అక్కడ సెంటు భూమి రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పలుకుతోంది. దాదాపు రూ.2కోట్లు విలువైన భూమి విషయంలో ఓ వ్యాపారి, రైతుల మధ్య వివాదం నెలకొంది. రాచ్చెరువు గర్భానికి చెందిన భూమి అని రైతులు, జిరాయితీ భూమిగా వ్యాపారి వాదించుకోవడంతో స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్‌.కోట రెవెన్యూ అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. దీనికి తోడు అనుమతి లేకుండా ఆ భూమిలోని చెట్లను వ్యాపారి నరికేయడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది.

స్థానిక విశాఖ-అరకు రోడ్డుకు ఆనుకుని కెనరా బ్యాంకు వెనక ఉన్న భూమిని ఓ వ్యాపారి ఇటీవల చదును చేశారు. ఈభూమికి ఆనుకుని రాచ్చెరువు ఉంది. చెరువు భూమి ఇప్పటికే చాలా వరకు అన్యాక్రాంతమైంది. దీంట్లోనూ చెరువు గర్భం కలిసి వుందని ఆయకట్టు రైతులు అభ్యంతరం చెబు తూ భూమి చదును పనులను అడ్డుకున్నారు. అయితే శుక్ర వారం తిరిగి ఈ భూమిని వ్యాపారి చదును చేస్తూ చెట్లన్నిం టినీ నరికేశారు. విషయం తెలుసుకున్న రైతులు వ్యాపారిని ప్రశ్నించారు. సర్వేయర్‌ నిర్ణయించిన హద్దుల ప్రకారం భూమి చదును చేసుకుంటున్నానని వ్యాపారి బదులిచ్చారు. చెట్లు అడ్డంగా ఉండడంతో నరికేశానన్నారు. భూమి విషయం తేల్చకుండా చెట్లు నరకడమేంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికా రులు కన్నయ్య, రమణలు క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. భూమి చదును పనులను ఆపించారు. ఇరు వర్గాలను తహసీల్దార్‌ కార్యాలయానికి పిలిపించారు. తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌ వారితో మాట్లాడారు. చెరువు భూమో, జిరాయితీ భూమో తేల్చిన తరువాతే భూమిలోకి వెళ్లాలని వ్యాపారికి తహసీల్దార్‌ సూచించడంతో రైతులు శాంతించారు.

Updated Date - May 24 , 2024 | 11:56 PM