Share News

ఉత్తుత్తి నొక్కుడేనా?

ABN , Publish Date - May 19 , 2024 | 11:39 PM

పేదలను వైసీపీ సర్కారు మోసం చేసింది. సంక్షేమ పథకాలకు సీఎం జగన్‌ బటన్‌ నొక్కి నెలలు గడుస్తున్నా ఇంకా పేదల ఖాతాల్లోకి నగదు జమ కాలేదు.

ఉత్తుత్తి నొక్కుడేనా?

- సీఎం బటన్‌ నొక్కి నెలలు గడుస్తున్నా..

- ఇంకా పేదల ఖాతాల్లోకి జమకాని నిధులు

- పోలింగ్‌కు రెండు రోజులు ముందు హడావుడి

- తరువాత మరచిపోయిన సర్కారు

- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జిల్లావాసులు

విజయనగరం (ఆంధ్రజ్యోతి) మే 19: పేదలను వైసీపీ సర్కారు మోసం చేసింది. సంక్షేమ పథకాలకు సీఎం జగన్‌ బటన్‌ నొక్కి నెలలు గడుస్తున్నా ఇంకా పేదల ఖాతాల్లోకి నగదు జమ కాలేదు. ఎన్నికల్లో గెలుపు కోసం పోలింగ్‌కు రెండు రోజుల ముందు పేదల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ప్రభుత్వ పెద్దలు హడావుడి చేశారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత వేయాలని ఈసీ ఆదేశించడంతో ప్రభుత్వం హైకోర్టును ఆదేశించింది. నగదు జమ చేసేందుకు కోర్టు ఒక్కరోజు మాత్రమే అవకాశం ఇచ్చింది. కానీ, ఆ ఒక్కరోజులో కొందరికే నగదు జమ చేశారు. మిగతా వారికి పోలింగ్‌ తరువాత ఇస్తామని చెప్పారు. అయితే, పోలింగ్‌ ముగిసి వారం రోజులు అవుతున్నా పేదల ఖాతాల్లో డబ్బులు వేయలేదు. కల్యాణమస్తు, షాదీతోఫా, చేయూత, ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఈబీసీ నేస్తం, విద్యాదీవెన పథకాలకు ఇప్పటి వరకూ రూపాయి కూడా విడుదల చేయలేదు. ఇది పేదలను మోసగించటమే అంటున్నాయి ప్రతి పక్షాలు. ఈ పథకాలకు సంబంధించి సీఎం జగన్‌ రెండు నెలల కిందట బటన్‌ నొక్కారు. కానీ ఇప్పటికీ ఖాతాల్లోకి డబ్బులు జమకాకపోవడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బటన్‌ నొక్కినప్పుడల్లా తమను కూలి పనులు మాన్పించి మీటింగ్‌లకు తీసుకెళ్లిన నాయకులు ఇప్పుడు నోరు మెదపడం లేదని మండిపడుతున్నారు. జగన్‌కు చెందిన మీడియాలో పెద్దఎత్తున బొమ్మలు వేస్తూ యాడ్‌లు చూసి మోసపోయామని గగ్గోలు పెడుతున్నారు. మార్చి, ఏప్రిల్‌ నెలలో డబ్బులు జమ అవుతాయని అనుకుంటే మే నెల ముగుస్తున్నా పైసా కూడా ఖాతాల్లోకి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ఒకటి రెండు రోజుల ముందు అంటే ఈ నెల 11, 12 తేదీల్లో డబ్బులను ఖాతాల్లో వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. పథకం ప్రకారం ఎన్నికల తేదీ వరకు అట్టిపెట్టి పోలింగ్‌కు ఒకటి రెండు రోజులు ముందు జమ చేసి లబ్ధిపొందాలని అధికార పార్టీ ప్రయత్నించింది. దీనిని గుర్తించిన ఎన్నికల సంఘం నిధుల విడుదలను పోలింగ్‌ పూర్తయ్యాక చేయాలని ఆదేశించింది. ఇప్పుడు ఎన్నికలు పూర్తియినా ఎందుకు తమ ఖాతాల్లో నగదు జమకాలేదని జిల్లా మహిళలు వైసీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఆసరా లబ్ధిదారుల్లో కొందరికి మాత్రమే సొమ్ము జమ అయింది. మిగిలిన పథకాల నగదు ఇంకా అందలేదు.

ఈబీసీ నేస్తం..

అగ్రవర్ణ కులాలకు చెందిన 40 నుంచి 60 ఏళ్ల పేద మహిళలకు ఈబీసీ నేస్తం కింద ఏడాదికి రూ.15వేలు చెల్లించాల్సి ఉంది. మూడోవిడతలో భాగంగా జిల్లాలో 5,546 మంది మహిళలకు రూ.8.31 కోట్లు రావల్సి ఉండగా ఇప్పటి వరకు వారి ఖాతాల్లోకి రూపాయి కూడా జమకాలేదు. సీఎం జగన్‌ బటన్‌ నొక్కి తమను మోసం చేశారని మహిళలు మండిపడుతున్నారు.

సున్నా వడ్డీ..

మహిళలు బ్యాంకే లింకేజి ద్వారా తీసుకున్న రుణాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.3 లక్షల వరకు సున్నా వడ్డీ రాయితీ ఇవ్వాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం 7 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 5 శాతం రాయితీ ఇవ్వాల్సి ఉంది. ఈ మేరకు ఇటీవల నాలుగో విడత వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ కింద జిల్లాలో సుమారు 38,222 సంఘాలకు రూ.66.2 కోట్లు వడ్డీ మాఫీ చేయాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించిన నిధులకు గత ఏడాది జూలైలోనే జగన్‌ బటన్‌ నొక్కారు. కానీ కొంతమేర మాత్రమే జమ అయ్యాయి. ఇంకా రూ.16 కోట్లు రావల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు జమ చేయలేదు.

చేయూత ఏదీ..

మహిళలు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చేయూత ఇస్తున్నట్లు జగన్‌ సర్కారు గొప్పలు చెబుతుంటుంది. 45ఏళ్లు దాటిన మహిళకు ప్రతి ఏటా రూ 18,750 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. అయితే, ఈ ఏడాది మే నెల ముగుస్తున్నా ఇప్పటికీ మహిళల బ్యాంక్‌ ఖాతాల్లో నిధులు జమకాలేదు. దీంతో జగనన్న చేయూత ఏదీ అంటూ వారు నిట్టూర్చుతున్నారు.

Updated Date - May 19 , 2024 | 11:40 PM