Share News

సాగునీరు అందేనా?

ABN , Publish Date - Jul 12 , 2024 | 12:04 AM

తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని ఎడమ, కుడి ప్రధాన కాలువలు అధ్వానంగా ఉన్నాయి.

సాగునీరు అందేనా?
ఎడమ ప్రధాన కాలువ

- అధ్వానంగా ‘తోటపల్లి’ ప్రధాన కాలువలు

-ఆధునికీకరణకు నిధుల సమస్య

- పట్టించుకోని గత ప్రభుత్వం

- గండ్లు పడే పరిస్థితులు అధికం

- రేపు నీటి విడుదలకు అధికారుల సన్నాహం

(గరుగుబిల్లి)

తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని ఎడమ, కుడి ప్రధాన కాలువలు అధ్వానంగా ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఈ ప్రాజెక్టును తీవ్ర నిర్లక్ష్యం చేసింది. దీంతో కాలువల్లో పిచ్చిమొక్కలు, గుర్రపుడెక్క పేరుకుపోయి దారుణంగా తయారయ్యాయి. గట్లు బలహీనంగా మారాయి. ఎక్కడ గండ్లు పడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌ కోసం ఈ నెల 13న (శనివారం) సాగునీటి విడుదలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, కాలువలు అధ్వానంగా ఉండడంతో సాగునీరు సక్రమంగా అందుతుందో లేదోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రధాన ఎడమ కాలువ ద్వారా గరుగుబిల్లి, జియ్యమ్మవలస, వీరఘట్టం, పాలకొండ మండలాల పరిధిలోని 81 గ్రామాల్లోని 31,310 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. కుడి కాలువ ద్వారా గరుగుబిల్లి, బలిజిపేట, వంగర మండలాల్లోని 28 గ్రామాల్లోని 9,128 ఎకరాలకు పైగా సాగునీరు అందాల్సి ఉంది. అలాగే పది ఎడమ ఓపెన్‌ హెడ్‌ చానల్స్‌ ద్వారా 57 గ్రామాల పరిధిలోని 12,450 ఎకరాలకు, ఆరు కుడి హెడ్‌ చానల్స్‌ ద్వారా 21 గ్రామాల పరిధిలోని 2,160 ఎకరాలకు నీరు చేరాల్సి ఉంది. అదేవిధంగా అదనపు ఆయకట్టుకు సంబంధించి వీరఘట్టం, పాలకొండ, జియ్యమ్మవలస మండలాల పరిధిలోని ఆరు గ్రామాల్లోని 6,400 ఎకరాలకు, నాగావళి కుడి వైపు పది గ్రామాలకు సంబంధించి 2,100 ఎకరాలకు, పాలకొండ, కురుపాం, రాజాం నియోజకవర్గాల పరిధిలోని 203 గ్రామాలకు సంబంధించి 26 చానల్స్‌ ద్వారా రెండు కాలువల నుంచి మొత్తం 65 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. ప్రస్తుతం ఎడమ ప్రధాన కాలువ ప్రారంభం నుంచి పాలకొండ ప్రాంతం వరకు, కుడి కాలువకు సంబంధించి గరుగుబిల్లి మండలం సుంకి నుంచి వంగర మండలం వరకు అధ్వానంగా తయారయ్యాయి. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు రెండు కాలువలపై దృష్టి సారించకపోవ డంతో అధికంగా గండ్లు పడిన దాఖలాలు నెలకొన్నాయి. దీంతో సాగునీరు విడుదల చేసినా శివారు భూములకు అందుతుందా? లేదా అని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

ఆధునికీకరణపై వైసీపీ నిర్లక్ష్యం

తోటపల్లి పాత రెగ్యులేటర్‌ నిర్మాణం బ్రిటీష్‌ల కాలంలో జరిగింది. దీని పరిధిలోని ఎడమ ప్రధాన కాలువ, కుడి పిల్ల కాలువల ఆధునికీకరణకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరయ్యాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు ఈ పనులు చేపట్టడకుండా నిర్లక్ష్యం చేసింది. ఐదేళ్ల సమయంలో 23 శాతం పనులు చేపట్టి ఆపేసింది. కాంట్రాక్టర్లకు రూ.17 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. తోటపల్లి సమీపంలోని ఆక్విడెక్టు కొంతమేర కూలిపోయింది. ఆ ప్రాంతం పిచ్చి మొక్కలతో దర్శనమిస్తోంది. ప్రధాన ఎడమ కాలువ పలుచోట్ల కోతకు గురై ప్రమాదకరంగా మారింది. అధికంగా సాగునీరు విడుదల చేస్తే గండ్లు పడే అవకాశాలు ఉన్నాయి. జియ్యమ్మవలస మండలం పెదబుడ్డిడి ప్రాంతంలో సైఫూన్‌ నిర్మించాల్సి ఉంది. ఈ పనులు ముందుకు సాగలేదు. ఆక్విడెక్టుకు ప్రతిపాదనలు చేసినా నిధులు సమస్య నెలకొంది. జియ్యమ్మవలస మండలం తురకనాయుడువలస వద్ద ప్రధాన ఎడమ కాలువకు ఆనుకుని చెక్కల పూను ఏర్పాటు చేసి సాగునీటిని వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గత ఖరీఫ్‌లో రెండు కాలువలకు పడిన గండ్లును అధికారుల సహకారంతో రైతులే పూడ్చారు.

శివారు భూములకు నీరందిస్తాం

తోటపల్లి ప్రాజెక్టు పాత రెగ్యులేటర్‌ పరిధిలోని ఎడమ ప్రధాన కాలువ, కుడి కాలువ ద్వారా ఈ నెల 13న సాగునీరు విడుదల చేస్తాం. గతంలో నిధుల సమస్యతో ఆధునికీకరణ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. కొంతమేర పనులు జరిగాయి. ఈ ఏడాది ఖరీఫ్‌కు ఆటంకం కలగకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నాం. అత్యవసర పనుల నిర్వహణకు రూ.45 లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశాం. సంబంధిత కాంట్రాక్టర్‌కు పనులు చేయాలని సూచించాం. సాగునీరు విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. శివారు భూములకు నీరందిస్తాం. కాలువలకు గండ్లు పడకుండా చూస్తాం.

-డి.రవికుమార్‌, డీఈఈ, పాలకొండ డివిజన్‌

Updated Date - Jul 12 , 2024 | 12:04 AM