Share News

ఐదేళ్లు సరిపోలేదా?

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:03 AM

2018లో చేపట్టిన పాదయాత్ర సమయంలో కురుపాం బహిరంగ సభలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ఐదేళ్లు సరిపోలేదా?
అసంపూర్తిగా పూర్ణపాడు - లాబేసు వంతెన

- పూర్ణపాడు - లాబేసు వంతెనపై వైసీపీ నిర్లక్ష్యం

- 20 శాతం పనులు పూర్తి చేసుకోలేకపోయిన వైనం

- ప్రజలకు తప్పని పడవ ప్రయాణం

( కొమరాడ )

2018లో చేపట్టిన పాదయాత్ర సమయంలో కురుపాం బహిరంగ సభలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పూర్ణపాడు - లాబేసు వంతెన పూర్తి చేయడం కూడా చేతకాలేదని అప్పటి ప్రభుత్వంపై మండిపడ్డారు. తీరా అధికారం చేపట్టిన తరువాత వంతెనను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఈ ఐదేళ్లలో మిగిలి ఉన్న 20 శాతం పనులను పూర్తి చేసుకోలేకపోయారు. విపక్షంలో ఉన్నప్పుడు చేసిన విమర్శలు చేసిన నాయకులు అధికారంలోకి వచ్చాక పట్టించుకున్న దాఖలాలు లేవని గిరిజనులు మండిపడుతున్నారు.

కొమరాడ మండల వాసులు చిరకాల స్వప్నం నాగావళి నదిపై పూర్ణపాడు - లాబేసు గ్రామాల మధ్య వంతెన నిర్మాణం. ఈ వారధి పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తొలగిపోవడమే కాదు, చుట్టు పక్కల ఉన్న మండలాలకు సైతం రాకపోకలకు అనువుగా ఉంటుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే వంతెన పనులు ప్రారంభమయ్యాయి. 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఈలోగా ఎన్నికలు రావడంతో మిగిలిన పనులు చేసే అవకాశం లేకుండా పోయింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ వంతెనను పూర్తిగా విస్మరించింది. మిగిలిన 20 శాతం పనులను పూర్తి చేయలేకపోయింది. ఈ ప్రభుత్వానికి ఐదేళ్లు సమయం చాలలేదా? అని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కురుపాం శాసనసభ్యురాలు పాముల పుష్పశ్రీవాణికి మంత్రి పదవి దక్కడంతో ఈ ప్రాంతవాసులంతా వంతెన నిర్మాణం జరుగుతుందని సంబరపడ్డారు. తీరా ఆమె వంతెన పూర్తి కోసం అదనపు నిధులు జీవోలు తెచ్చారు తప్ప నిర్మాణం మాత్రం పూర్తి చేయలేకపోయారు. దీంతో నదిపై పడవ ప్రయాణమే ఈ ప్రాంతవాసులకు శరణ్యంగా మారింది. కొమరాడ మండలానికి చెందిన 30 గ్రామాలు, 8 గ్రామ పంచాయతీలలో నాగావళి నదికి తూర్పున ఉన్నాయి. వర్షా కాలంలో వీరంతా కొమరాడ మండల కేంద్రానికి చేరుకోవాలంటే పడవ ప్రయాణం తప్పడం లేదు. కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేశామని గొప్పలు చెబుతున్న వైసీపీ ప్రభుత్వం సుమారు రూ. 8 కోట్లు నిధులు కేటాయించి పనులు చేయిస్తే వేలాది మందికి రాకపోకలకు సౌకర్యం కలిగేది. కానీ, పట్టించుకోవడం లేదు.

Updated Date - Apr 12 , 2024 | 12:03 AM