విస్తరణ కలేనా?
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:17 AM
ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం.. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ జాతరకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎక్కడా లేని విధంగా పదివారాల పాటు ఇక్కడ జాతర జరుగుతుంది.

ఏటా భక్తులకు తప్పని అవస్థలు
మక్కువ, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం.. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ జాతరకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎక్కడా లేని విధంగా పదివారాల పాటు ఇక్కడ జాతర జరుగుతుంది. ఏటా జనవరిలో సంక్రాంతి తర్వాత వారం జరిగే పండగకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా, చత్తీస్‌ఘడ్ నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారి జాతరకు వస్తూ ఉంటారు. అయితే ఆదాయం బాగానే వస్తున్నా.. ఆలయ అభివృద్ధి మాత్రం ఆశించినస్థాయిలో జరగడం లేదు. ప్రధానంగా భక్తులు ఉండేందుకు షెడ్లు, బాత్‌రూములు, మరుగుదొడ్ల నిర్మాణం.. ఇతరత్రా వసతుల కల్పన కలగానే మారింది. మరోవైపు ఏటా టెంట్లు, బారికేడ్లు ఇతర సామగ్రి కోసం టెండర్ల పిలవడంతో లక్షలాది రుపాయల ప్రజాధనం వృథా అవుతుంది. ఇదిలా ఉండగా.. అమ్మవారి చదురుగుడి జనావాసాల మధ్య ఉండడంతో ఏటా భక్తులకు అవస్థలు తప్పడం లేదు. జాతర జరిగే సమయంలో వేలాదిగా తరలివచ్చే భక్తజనం కూలైన్లలో గంటల తరబడి నిరీక్షించి.. ఆపసోపాలు పడుతూ అమ్మవారిని దర్శించుకోవాల్సి వస్తోంది. ఆలయం ఇరుకుగా ఉండడం, క్యూలైన్‌లు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసేందుకు అవకాశం లేకపోవడంతో ఏటా వారికి ఇక్కట్లు తప్పడం లేదు.
విస్తరణకు బ్రేక్..
గతంలో ఆలయ అభివృద్ధికి అడుగులు పడ్డాయి. చదురుగుడికి ఇరువైపులా ఉన్న ఇళ్లను తొలగించేందుకు దేవదాయశాఖ సిబ్బంది చర్యలు చేపట్టారు. ఇంటి యజమానులతో మాట్లాడి నష్టపరిహారం, ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రత్యామ్నాయ స్థలం కూడా ఇస్తామని ప్రతిపాదించారు. అయితే సంబంధిత ఇంటి యజమానులు అధిక మొత్తంలో పరిహారం అడగడంతో చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో ఆలయ విస్తరణకు బ్రేక్ పడింది. కాగా నిధులు మంజూరైనా వనం, చదురు గుడులు, సిరిమాను తిరిగే ప్రాంతాల్లో సీసీ రోడ్డు పనులు ఇంకా ప్రారంభం కాలేదు. వచ్చే ఏడాది జనవరిలో శంబర పోలమాంబ జాతర సమయానికి ఆలయ విస్తరణ జరిగినట్లు కనిపించడం లేదు. ఏటాలానే ఈ సారి కూడా భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు.
నివేదిక అందించాం..
పోలమాంబ చదరగుడి విస్తరణపై ఆలయానికి ఇరువైపులా ఉన్న ఇంటి యజమానులతో మాట్లాడినా ఫలితం లేకుండాపోయింది. ఈ సమస్యను నివేదిక రూపంలో కలెక్టర్‌కు అందించాం. తదుపరి ఆదేశాల మేరకు ఆలయ విస్తరణ చర్యలు చేపడతాం.
- వీవీ సూర్యనారాయణ, ఆలయ ఈవో
=================================
ఏటా అవస్థలే..
ఏటా చదురు గుడిలో పోలమాంబను దర్శించుకునేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది. ఆలయ విస్తరణ కార్యరూపం దాల్చడం లేదు. నూతన ప్రభుత్వమైనా ఆలయ అభివృద్ధికి చొరవ చూపాలి.
- కె .లక్ష్మణరావు, కవిరిపల్లి గ్రామం