సాగునీటి ప్రాజెక్టులు అస్తవ్యస్తం
ABN , Publish Date - Jul 15 , 2024 | 11:45 PM
గత వైసీపీ ప్రభుత్వం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా గాలికి వదిలేసింది.
- అభివృద్ధిని పట్టించుకోని గత సర్కారు
- ఐదేళ్లూ తీవ్ర నిర్లక్ష్యం
- ఆధునికీకరణకు నోచుకోని కాలువలు
- అర్ధాంతరంగా నిలిచిన పనులు
- ఆయకట్టుకు పూర్తిస్థాయిలో అందని సాగునీరు
- కూటమి ప్రభుత్వంపైనే రైతుల ఆశలు
(పార్వతీపురం-ఆంధ్రజ్యోతి/జియ్యమ్మవలస/కొమరాడ)
గత వైసీపీ ప్రభుత్వం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా గాలికి వదిలేసింది. ఐదేళ్ల పాటు తీవ్ర నిర్లక్ష్యం చేసి వాటిని అస్తవ్యస్తం చేసింది. ఆధునికీకరణకు రూపాయి కూడా విదల్చలేదు. దీంతో పూడిక, గుర్రపుడెక్క పేరుకుపోయి కాలువలు అధ్వానంగా తయారయ్యాయి. కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో పనులను ఎక్కడికక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఫలితంగా ఆయకట్టు భూములకు పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు. సిబ్బంది కొరతతో కాలువలపై పర్యవేక్షణ కరువైంది. కూటమి ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులు బాగుపడతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో తోటపల్లి, జంఝావతి, వెంగళరాయ సాగరం, వట్టిగెడ్డ, పెద్దగెడ్డ, పెదంకలాం సాగునీటి ప్రాజెక్టులతో పాటు మైనర్ ఇరిగేషన్ చెరువులు సుమారు 2,352 ఉన్నాయి. తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు మినహా మిగిలిన మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు చెరువుల ద్వారా సుమారు 1,26,547 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అయితే, వీటి పరిధిలోని కాలువలు అధ్వానంగా ఉండడంతో పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కాలువలను నిర్లక్ష్యంగా వదిలేసింది. ఏ కాలువను కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. పూడికలు, గుర్రపుడెక్క, పిచ్చిమొక్కలు తొలగించలేదు. దీంతో ఆయా ప్రాజెక్టుల ద్వారా పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందక రైతులు నష్టపోతున్నారు. జంఝావతి ఎగువ, దిగువ కాలువల నుంచి 24 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా కేవలం 8 వేల ఎకరాలకు మాత్రమే అందుతుంది. అలాగే, వెంగళరాయ సాగరం ద్వారా మక్కువ, సీతానగరం మండలాల్లోని 18,522 ఎకరాలకు, వట్టిగెడ్డ రిజర్వాయర్ ద్వారా కురుపాం, జియమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లో 16,684 ఎకరాలకు, పెద్దగెడ్డ ద్వారా పాచిపెంట, సాలూరు మండలాల్లోని 9146 ఎకరాలకు, పెదంకలాం ఆయకట్టు ద్వారా బలిజిపేట మండలంలో 6,617 ఎకరాలకు, మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 75,578 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. కానీ, ఏ ప్రాజెక్టు నుంచి కూడా దిగువనున్న ఆయకట్టు భూములకు పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదని రైతులు చెబుతున్నారు.
బిల్లులు పెండింగ్..
సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. మంజూరైన జపాన్ నిధులు కూడా ఖర్చు చేయలేదు. దీంతో కాలువలు అధ్వానంగా తయారయ్యాయి. వెంగళరాయ ప్రాజెక్టుకు సంబంధించి కాలువల ఆధునికీకరణ, తదితర పనులు చేపట్టేందుకు 2021-2022 ఆర్థిక సంవత్సరంలో రూ.48.89 కోట్లతో టెండర్లు ఖరారయ్యా యి. కాంట్రాక్టర్ 22 శాతం పనులు పూర్తి చేసి మిగిలినవి వదిలేశాడు. సుమారు రూ.6.28 కోట్ల బిల్లులను జగన్ సర్కార్ చెల్లించకపోవడమే దీనికి ప్రధాన కారణం. పెద్దగెడ్డ రిజర్వాయర్ పనులు చేపట్టేందుకు రూ.23.83 కోట్లతో టెండర్లు ఖరారయ్యాయి. 2021-22లో పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. సుమారు రూ.1.47కోట్లతో పది శాతం పనులను పూర్తి చేశాడు. దీనికి సంబంధించి బిల్లులను వైసీపీ ప్రభుత్వం చెల్లించక పోవడంతో కాంట్రాక్టర్ ఎక్కడి పనులు అక్కడే ఆపేసి తట్టాబుట్ట సర్దుకొని వెళ్లిపోయాడు. వట్టిగెడ్డ రిజర్వాయర్‌దీ ఇదే పరిస్థితి. దీన్ని అభివృద్ధి పనులు చేసేందుకు రూ.44.85 కోట్లు మంజూరు కావడంతో కాంట్రాక్టరు పనులు ప్రారంభించి 15 శాతం పూర్తిచేశాడు. సుమారు రూ.40లక్షల పెండింగ్ ఉండడంతో పనులకు దండం పెట్టి కాంట్రాక్టర్ వెళ్లిపోయాడు. అలాగే, పెదంకలాం ఆయకట్టు ఆధునికీకరణకు రూ.17.30కోట్లు మంజూరు కావడంతో కాంట్రాక్టర్ కొన్ని పనులు చేశాడు. రూ.36 లక్షల బిల్లులను అప్‌లోడ్ చేయగా వైసీపీ సర్కారు చెల్లించక పోవడంతో మిగతా పనులు ఆపేశాడు. ఇలా జిల్లాలో ఈ ఏప్రాజెక్టు పనులు చూసినా అసంపూర్తిగానే ఉన్నాయి.
సిబ్బంది కొరత
సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను చూసేందుకు అవసరమైన సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రధాన కాలువపై ప్రతీ ఐదు కిలో మీటర్లకు ఒక లస్కరు, డిస్ట్రిబ్యూటరీ పరిధిలో ప్రతీ 1500 ఎకరాలకు ఒక లస్కరు, రిజర్వాయర్‌లో పెద్ద రెగ్యులేటర్ ఉంటే అక్కడ ఒక లస్కరు, వీరందరినీ పర్యవేక్షణ చేయడానికి ఒక వర్క్ ఇన్‌స్పెక్టర్ కచ్చితంగా ఉండాలి. వీరితో పాటు ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, హెల్పర్లు, వాచ్‌మెన్‌లు కూడా అవసరమైనంత వరకు ఉండాలి. కానీ, ఏ ప్రాజెక్టు పరిధిలో కూడా సిబ్బంది పూర్తి స్థాయిలో లేరు.
- వట్టిగెడ్డ ప్రాజెక్టు పరిధిలో 24 మంది లస్కర్లు ఉండాలి. కానీ ఒక్కరే ఉన్నారు. మజ్ధూర్‌లు ఇద్దరు ఉన్నారు. వాచ్‌మెన్‌లు ముగ్గురు, హెల్పర్లు నలుగురు, ఎలక్ట్రీషియన్ ఒకరు, ఫిట్టర్ ఒకరు, వర్క్ ఇన్‌స్పెక్టరు ఒకరు కలిపి మొత్తం 36 మంది ఉండాల్సి ఉండగా ముగ్గురే ఉన్నారు. మిగిలిన 33 పోస్టులు ఖాళీ. - పెద్దగెడ్డ రిజర్వాయర్‌కు 22 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా ఎవరూ లేకపోవడం శోచనీయం. పెదంకలాం ప్రాజెక్టుకు ఆరుగురు సిబ్బంది ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారు. అతడు రామభద్రపురం సెక్టార్‌లో పనిచేస్తున్నాడు. వెంగళరాయసాగర్ పరిధిలో 41 మంది సిబ్బందికి గాను ఇద్దరు మెన్ మజ్ధూర్‌లు, ఇద్దరు ఫిమేల్ మజ్ధూర్‌లు మాత్రమే ఉన్నారు. మిగిలిన 37 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఈ నాలుగు ప్రాజెక్టు పరిధిలో 102 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా కేవలం 8 మందే పనిచేస్తున్నారు. 94 పోస్టులు భర్తీ కావల్సి ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం టెండర్ సిస్టం ద్వారా కాలువల మెంటైనెన్స్‌కు లస్కర్లను సీజనల్ సమయంలో వేశారు. ఆ ఏడాది మూడు నెలలు మాత్రమే ఉంచి వారిని తొలగించారు. మళ్లీ 2020-21లో వీరిని తీసుకొని ఐదు నెలలు పనిచేయించుకొని జీతాలు ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. దీంతో ప్రాజెక్టుల పరిధిలో ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీలపై పూర్తి పర్యవేక్షణ కొరవడింది. ఇంజనీర్లే అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. దీంతో అదనపు పనిభారంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు.
జంఝావతికి అరకొర నిధులు
కొమరాడ మండలంలోని జంఝావతి ఎగువ, దిగువ కాలువల నుంచి 24 వేల ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా రూ.124 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు పనులను చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వం బడ్జెట్‌లో అరకొర నిధులు కేటాయించడంతో పూర్తిస్థాయిలో పనులు జరగక శివారు భూములకు సాగునీరందడం లేదు. 27,790 కిలో మీటర్ల పొడవు ఉన్న ఎగువ కాలువ ద్వారా కొమరాడ, పార్వతీపురం, సీతానగరం మండలాల్లోని 12 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. అయితే, కొమరాడ మండలం డంగభద్ర వద్ద పెద్ద బండరాయి ఉండడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. దిగువ కాలువ నుంచి ఎగువ కాలువకు నీరును ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన పథకం మరమ్మతులకు గురికావడంతో కేవలం 700 ఎకరాలకు మాత్రమే నీరందుతుందని రైతులు చెబుతున్నారు. అలాగే, 26.925 కిలో మీటర్ల పొడువున దిగువ కాలువ ద్వారా గరుగుబిల్లి, పార్వతీపురం, కొమరాడ, సీతానగరం మండలాల్లోని 12 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. కాలువ పనులు జరిగినా నీరు మళ్లించే మదుముల వద్ద షట్టర్లు ఏర్పాటు చేయలేదు. పంట భూములకు సాగునీరు చేరేలా పిల్ల కాలువలను తవ్వాల్సి ఉంది. కొన్ని చోట్ల యూటీలు నిర్మించాలి. ఎగువ, దిగువ కాలువలకు కెనాల్ మెయింటెనెన్స్ డిస్ట్రిబ్యూటర్ చానల్స్ నిర్మించవలసి ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో జరగలేదు. దిగువ కాలువ ద్వారా ఏటా 7 వేల ఎకరాలకు మాత్రమే నీరందుతుందని రైతులు చెబుతున్నారు. రెండు కాలువల్లో గుర్రపు డెక్క పేరుకుపోవడంతో సాగునీరు ముందుకు సాగడం లేదు. దీనివల్ల గండ్లు పడతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కూటమి ప్రభుత్వంపైనే ఆశలు
గత ఐదేళ్లలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ముఖ్యంగా అసంపూర్తిగా పనులను పూర్తి చేయాలని విన్నవిస్తున్నారు. అలాగే, సిబ్బంది నియామకాల విషయంపై చొరవ చూపాలని వేడుకుంటున్నారు. ఇటీవల మంత్రి సంధ్యారాణి పర్యవేక్షణలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రాజెక్టుల నిర్వహణ, ఆధునికీకరణ, తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. దీంతో తమ భూములకు పూర్తిస్థాయిలో సాగునీరందుతుందని ఆయకట్టు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిపాదనలు పంపించాం
ప్రాజెక్టుల పరిధిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటం వాస్తవమే. అయితే దీనిపై పూర్తి నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదించాం. ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకుంటుందని ఆశతో ఉన్నాం.
-వైవీ రాజరాజేశ్వరి, ఎస్‌ఈ, నీటి పారుదలశాఖ