Share News

అడ్డగింతలు..అరెస్ట్‌లు

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:45 PM

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. గురువారం చలో విజయవాడకు పిలుపునిచ్చిన ఆశావర్కర్లను బుధవారం జిల్లాలో పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. ముందస్తుగా హౌస్‌ అరెస్ట్‌లు చేశారు. నోటీసులు అందించారు. వారికి మద్దతు తెలుపుతున్న ప్రజా సంఘాల నేతలను సైతం అదుపులోకి తీసుకున్నారు.

అడ్డగింతలు..అరెస్ట్‌లు
గుమ్మలక్ష్మీపురం: ఎల్విన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఆశా కార్యకర్తలు

ఎక్కడిక్కడే అడ్డుకున్న పోలీసులు .. ముందస్తుగా హౌస్‌ అరెస్ట్‌లు

నోటీసులు అందజేత.. ప్రజా సంఘాల నేతలూ అదుపులోకి..

పార్వతీపురంటౌన్‌/బెలగాం/సాలూరు/ సాలూరు రూరల్‌/ కురుపాం/గుమ్మలక్ష్మీపురం, ఫిబ్రవరి 7 : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. గురువారం చలో విజయవాడకు పిలుపునిచ్చిన ఆశావర్కర్లను బుధవారం జిల్లాలో పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. ముందస్తుగా హౌస్‌ అరెస్ట్‌లు చేశారు. నోటీసులు అందించారు. వారికి మద్దతు తెలుపుతున్న ప్రజా సంఘాల నేతలను సైతం అదుపులోకి తీసుకున్నారు. మరికొందర్ని పోలీస్‌ స్టేషన్‌లో ఉంచారు. మొత్తంగా జిల్లాలో 166 మందిని గృహనిర్బంధం చేశారు. అయితే దీనిపై ఆశావర్కర్లు, ప్రజా సంఘాలు, యూనియన్‌ నేతలు మండిపడుతున్నారు. సర్కారు తీరును ఖండిస్తున్నారు. అక్రమ అరెస్ట్‌లు, నిర్బంధాలతో పోరాటాలను ఆపలేరని స్పష్టం చేశారు. కాగా పార్వతీపురంలోని సుందరయ్య భవనంలో సీఐటీయూ నాయకులు యమ్మల మన్మఽథరావు, గొర్లి వెంకటరమణను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మహిళా నాయకురాలు వాకాడ ఇందిరను అరెస్ట్‌ చేసి సీతానగరం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విజయవాడ వెళ్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని నోటీసులు ఇచ్చారు. పాదయాత్ర సమయంలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను నెరవర్చాలని కోరితే.. ఇలా అరెస్ట్‌ చేసి, నోటీసులు ఇస్తారా? అని వారు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు తగవన్నారు. చలో విజయవాడకు బయల్దేరిన వారిని అడ్డుకోవడం ఏమిటని, నిరసన తెలిపే హక్కు లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సర్కారు వైఖరిని మేధావులు, విద్యావంతులు ఖండించాలని వారు కోరారు. న్యాయం కోసం పోరాడుతుంటే పోలీసులతో తమ గొంతు నొక్కే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా సమాధానం చెప్పాలని వారు పిలుపునిచ్చారు. ఇక సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లో ఉద్యమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే 37 మందిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. పాచిపెంట మండలానికి చెందిన సీఐటీయూ నేత కోరాడ ఈశ్వరరావు సాలూరు మండలం మరిపిల్లిలో ఇంటికి రాగా.. ఆయన్ను అక్కడే సాలూరు రూరల్‌ ఎస్‌ఐ వెంకట రమణ గృహనిర్బంధం చేశారు. మామిడిపల్లిలో ఆశా వర్కర్‌ రాజేశ్వరికి నోటీసు ఇచ్చారు. సాలూరులో సీఐటీయూ నేత ఎన్‌వై నాయుడిని కూడా పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. కురుపాంలో ఎస్‌ఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో పోలీసులు ముందుగా ఆశవర్కర్లను అదుపులోకి తీసుకోని బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో సీఐటీయూ నేత గౌరీశ్వరరావు ఆధ్వర్యంలో విజయవాడకు వెళ్తున్న ఆశ వర్కర్లను ఎల్విన్‌పేట పోలీసులు అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Updated Date - Feb 07 , 2024 | 11:45 PM