Share News

కేజీబీవీపై ఆసక్తి అంతంతే

ABN , Publish Date - Jun 06 , 2024 | 11:48 PM

ఉమ్మడి జిల్లాలోని కేజీబీవీల్లో విద్యార్థినులు తగ్గుతున్నారు. ఏటా వాటిలో ప్రవేశం పొందే బాలికల సంఖ్య తగ్గుతోంది. పేద బాలికలకు ఉన్నత విద్య అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటైన వీటిపై ఎందుకు ఆసక్తి తగ్గుతోందో తెలియక, సీట్లు భర్తీకాక ప్రత్యేకాధికారులు, సీఆర్టీలు మల్లగుల్లాలు పడుతున్నారు. తల్లిదండ్రులకు అవగాహన ఉండడం లేదా? లేక ఉత్తమ బోధన అందదని అపోహ పడుతున్నారో తెలియడం లేదని వారు చెబుతున్నారు. ఆరోతరగతి, ఇంటర్‌లో ఏటా సీట్లు భర్తీ కావడం లేదు.

కేజీబీవీపై ఆసక్తి అంతంతే

కేజీబీవీపై ఆసక్తి అంతంతే

తగ్గుతున్న బాలికల ప్రవేశాల సంఖ్య

ఆరో తరగతి ఇంటర్‌లో నిండని సీట్లు

తల్లిదండ్రులకు అవగాహన లేకనే కారణమా?

మల్లుగుల్లాలు పడుతున్న ప్రత్యేకాధికారులు, సీఆర్టీలు

ఉమ్మడి జిల్లాలోని కేజీబీవీల్లో విద్యార్థినులు తగ్గుతున్నారు. ఏటా వాటిలో ప్రవేశం పొందే బాలికల సంఖ్య తగ్గుతోంది. పేద బాలికలకు ఉన్నత విద్య అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటైన వీటిపై ఎందుకు ఆసక్తి తగ్గుతోందో తెలియక, సీట్లు భర్తీకాక ప్రత్యేకాధికారులు, సీఆర్టీలు మల్లగుల్లాలు పడుతున్నారు. తల్లిదండ్రులకు అవగాహన ఉండడం లేదా? లేక ఉత్తమ బోధన అందదని అపోహ పడుతున్నారో తెలియడం లేదని వారు చెబుతున్నారు. ఆరోతరగతి, ఇంటర్‌లో ఏటా సీట్లు భర్తీ కావడం లేదు.

రాజాం, జూన్‌ 6:

పేద, సామాన్య వర్గాల విద్యార్థినుల కోసం ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తల్లిదండ్రులు లేకపోయినా, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసపోయినా వారి పిల్లలకు వసతితో కూడిన విద్య అందించేందుకు 2008లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పాఠశాలలను ప్రారంభించాయి. జిల్లాలో 33 మండలాల్లో వీటిని ఏర్పాటుచేశారు. తొలుత 6 నుంచి పదో తరగతి వరకూ ఉన్న ఈ పాఠశాల్లో రెండు సంవత్సరాల కిందట ఇంటర్‌ కూడా ప్రవేశపెట్టారు. సంప్రదాయం కోర్సులతో పాటు ప్రత్యేక సాంకేతిక కోర్సులను సైతం అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో కేజీబీవీలో ఒక్కో కోర్సు అంటే...ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ, కంప్యూటర్‌, ట్యాలీ వంటి వృత్తివిద్యా కోర్సులను కూడా అందిస్తున్నారు. ఇంత చేస్తున్నా విద్యార్థినులు అక్కడ చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. గత విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరు, ఇంటర్‌లో ప్రవేశాలకు జూన్‌లో నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఏడు, ఎనిమిది తరగతుల్లో ఖాళీలకు సైతం దరఖాస్తులు ఆహ్వానించారు. జూలై 25తో గడువు ముగిసినా....చాలా కేజీబీవీల్లో సగం సీట్లు కూడా నిండని పరిస్థితి. దీనిపై పాఠశాలల ప్రత్యేకాధికారులు, సీఆర్‌టీలు మల్లగుల్లాలు పడుతున్నారు. గ్రామాల్లో డ్రాపౌట్స్‌ను, విద్యార్థినుల తల్లిదండ్రులను కలిసి అవగాహన కల్పించినా పాఠశాలల్లో చేరేందుకు వారు ముందుకు రావడం లేదు.

ఉమ్మడి జిల్లాలో బాడంగి, బలిజిపేట, భోగాపురం, బొబ్బిలి, బొండపల్లి, చీపురుపల్లి, జియ్యమ్మవలస, డెంకాడ, దత్తిరాజేరు, గంట్యాడ, గరివిడి, గరుగుబిల్లి, గుమ్మలక్మీపురం, గజపతినగరం, గుర్ల, జామి, సీతానగరం, పార్వతీపురం, కొమరాడ, కొత్తవలస, కురుపాం, ఎల్‌.కోట, మక్కువ, మెంటాడ, మెరకముడిదాం, నెల్లిమర్ల, పాచిపెంట, పూసపాటిరేగ, రామభద్రపురం, సాలూరు, తెర్లాం, వేపాడ, విజయనగరంలో కేజీబీవీ పాఠశాలలు ఉన్నాయి. ఆరు నుంచి ఇంటర్‌ వరకూ ఇక్కడ విద్య అందిస్తున్నారు. ప్రతీ తరగతిలో 40 సీట్లు చొప్పున ఉంటాయి. తల్లిదండ్రులు లేని పిల్లలకు ఇక్కడ ప్రాధాన్యమిస్తారు. కంప్యూటర్‌ విద్యతో కూడిన ఉత్తమ విద్యాబోధన అందిస్తారు. సబ్జెక్టుల వారీగా మహిళా ఉపాధ్యాయులు (సీఆర్టీలు)ను నియమించారు. నిరంతర వైద్య సేవల కోసం ఒక ఏఎన్‌ఎం సైతం అందుబాటులో ఉంటుంది. బోధనేతర సిబ్బంది, చివరకు స్వీపర్లు, వాచ్‌మెన్‌ సైతం మహిళలే ఉంటారు.

వసతులు ఉన్నా..

కేజీబీవీ పాఠశాలల్లో పౌష్టికాహారంతో పాటు అన్నిరకాల వసతులు అందుబాటులోకి తెచ్చారు. ప్రతిరోజూ ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఉంటుంది. మధ్యలో స్నాక్స్‌, బూస్టు, హార్లిక్స్‌, పాలు కూడా అందిస్తారు. వారంలో రోజుకో మెనూ ఉంటుంది. ఎంపిక చేసిన రోజుల్లో మాంసాహారం అందిస్తారు. కోడిగుడ్లు పెడతారు. స్నాక్స్‌లో బెల్లం చక్కీలు, గుడ్లు సైతం అందిస్తారు. రాత్రి భోజనం తరువాత పండ్లు, పాలు పెడతారు. యూనిఫారంతో పాటు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ అందిస్తారు. కంప్యూటర్‌ బోధన, స్టైఫండ్‌, గ్రంథాలయ సేవలు, క్రీడా, సాంస్కృతిక రంగాల్లో ప్రోత్సాహం, ఆత్మరక్షణకు కరాటే, ఆరోగ్యానికి యోగా సైతం నేర్పిస్తారు.

పరిష్కారం కాని సమస్యలు

సమగ్ర శిక్ష అభియాన్‌ పరిధిలో ఉండే ఈ పాఠశాలల్లో నిధుల ఖర్చు విషయంలో అవినీతి జరుగుతోందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. పాఠశాలల నిర్వహణకు ప్రత్యేకాధికారుల ఖాతాల్లో నిధులు పుష్కలంగా ఉంటాయి. వాటిని తమ విచక్షణాధికారంతో ఖర్చు చేసుకునే వెసులబాటు ఉంది. ఈ అధికారాన్ని కొందరు దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అలాగే పాఠశాలల్లోనే సీఆర్‌టీలు ఉండాలి. రోజుకొకరు చొప్పున రాత్రి విధులు నిర్వహించాలి. తప్పకుండా ప్రత్యేకాధికారి పాఠశాలలోనే ఉండాలి. కానీ వేరొక చోటు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. చాలా పాఠశాలలకు ఇప్పటికీ ప్రత్యేకాధికారులు లేరు. సీఆర్‌టీలు కూడా పూర్తిస్థాయిలో లేరు. ఇంటర్‌కు సంబంధించి అధ్యాపకులు కూడా తగినంతమంది లేరు. కొత్త నియామకాలు చేపట్టలేదు. ఈ కారణంతోనే తల్లిదండ్రులు పిల్లలను కేజీబీవీలకు పంపడం లేదేమో.

కేజీబీవీల్లో చేరండి

కేజీబీవీ పాఠశాలల్లో ఉత్తమ విద్యాబోధనతో పాటు పౌష్టికాహారం అందిస్తాం. బాలికా రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రుల మాదిరిగానే వారిని కంటికిరెప్పలా చూసుకుంటాం. ఈ విషయం తల్లిదంద్రులు గమనించాలి. తల్లిదండ్రులు లేకపోయినా, వలసపోయినా అటువంటి పిల్లలంతా తప్పకుండా పాఠశాలల్లో చేరేందుకు ముందుకు రావాలి.

- పల్లి సావిత్రి, ప్రత్యేకాధికారి, కేజీబీవీ, రాజాం

-----------

Updated Date - Jun 06 , 2024 | 11:49 PM