Share News

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:03 AM

జిల్లాలో శుక్రవారం నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 20వ తేదీ వరకు ఇవి జరగనుండగా.. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు
భామిని: పరీక్ష గదిలో ల్యాబ్‌ సామగ్రి ఉన్న దృశ్యం

పార్వతీపురం, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్రవారం నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 20వ తేదీ వరకు ఇవి జరగనుండగా.. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తంగా 32 కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. మొదటి సంవత్సరం పరీక్షలకు 5,756 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 5,700 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. సప్లమెంటరీ విభాగంలో 1744 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇదిలా ఉండగా కేంద్రాలకు చీఫ్‌ సూపరింటెం డెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులు, రెండు సిట్టింగ్‌, రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను నియమించారు. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు. వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా బస్సులు నడపాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. తాగునీరు, విద్యుత్‌ సరఫరా నిరంతరాయంగా ఉండాలని సూచించారు.

- బెలగాం/జియ్యమ్మవలస/సాలూరు: జిల్లాకేంద్రం పార్వతీపురంతో పాటు సాలూరు, పాలకొండ, కురుపాం, జియ్యమ్మ వలసలోని చినమేరంగి తదితర చోట్ల కూడా ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు. పరీక్ష గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా తాగునీరు, మరగుదొడ్లు తదితర మౌలిక వసతులు కల్పించారు. జంబ్లింగ్‌ విధానంలో పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు.

పరీక్ష గదిలోనే ల్యాబ్‌ సామగ్రి

భామిని: భామిని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఈ ఏడాది ఇంటర్‌ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. ఈ కేంద్రంలో ఏపీ ఆదర్శ పాఠశాల, కస్తూర్బా, డాక్టర్‌ అంబేడ్కర్‌ గురుకులంతో పాటు జూనియర్‌ కళాశాలల విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అయితే భామిని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అవసరమైన గదులు లేవు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కాలేజీలో ఉన్న పెద్ద మూడు హాళ్లను పరీక్షలకు కేటాయించారు. ఒక్కో హాల్‌కు రెండు గదులుగా విభజించారు. 50 మంది విద్యార్థులకు ఒక్కో గదిలో కూర్చొనేలా ఏర్పాట్లు చేశారు. కాగా పరీక్ష గదిలో కాగితపు ముక్క కూడా ఉండకూడదని ఉన్నతాధికారులు చెప్పినప్పటికీ.. అదేదీ ఇక్కడ అమలు కావడం లేదు. ల్యాబ్‌కు సంబంధించి సామగ్రి, బీరువా, పుస్తకాలు, ఇతరత్రా సామగ్రి ఒక గదిలోనే ఉంచారు. మరుగుదొడ్లు కూడా అందుబాటులో లేవు. కళాశాల ఎంట్రన్స్‌లో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

Updated Date - Mar 01 , 2024 | 12:03 AM