Share News

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

ABN , Publish Date - Feb 29 , 2024 | 11:44 PM

జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 20 వరకూ ఇవి జరగనున్నాయి.

 నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

- 73 కేంద్రాల్లో నిర్వహణ

- హాజరు కానున్న 45,755 మంది విద్యార్థులు

కలెక్టరేట్‌, ఫిబ్రవరి 29: జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 20 వరకూ ఇవి జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ పరీక్ష జరగనుంది. ఇందుకు సంబంధించి జిల్లాలోని 73 కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రథమ సంవత్సర విద్యార్థులు 20,630 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 25,125 మంది మొత్తం 45,755 మంది పరీక్షలు రాయనున్నారు. 1200 మంది ఇన్విజరేటర్లను నియమించారు. అలాగే 24 స్టోరేజీ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఉదయం 8.30 గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రా లకు చేరుకోవాలని ఆర్‌ఐవో మజ్జి ఆదినారాయణ తెలిపారు. 8.45 గంటలకు పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తారని చెప్పారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, కేంద్రాల సమీపంలో జెరాక్స్‌ షాపులు తీయరాదని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే 08922-237988 నెంబరుకు పోన్‌ చేయాలని సూచించారు.

ప్రభుత్వ విద్యార్థులు ఎలా రాస్తారో?

ఈ ఏడాది ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయలేదు. దీంతో వారు పరీక్షలు ఎలా రాస్తారోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నిరుపేద, మధ్య తరగతికి చెందిన విద్యార్థులే ఎక్కువగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చేరుతారు. బయట మార్కెట్‌లో పుస్తకాలను కొనుగోలు చేసే ఆర్థిక పరిస్థితి వారికి ఉండదు. దీంతో ప్రభుత్వం అందించే పుస్తకాలపైనే ఆధారపడి చదువులు సాగిస్తుంటారు. సాధారణంగా విద్యా సంవత్సరం ప్రారంభించిన వెంటనే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంది. వాటి ఆధారంగా అధ్యాపకులు పాఠాలు బోధిస్తారు. కానీ గత మూడేళ్ల నుంచి కూడా విద్యార్థులకు పుస్తకాలను ప్రభుత్వం అందించడం లేదు. జిల్లా వ్యాప్తంగా 18 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలు ఉన్నాయి. వీటిల్లో ఈ ఏడాది 2,873 మంది మొదటి సంవత్సర విద్యార్థులు, 3451 మంది రెండో సంవత్సర విద్యార్థులు చదువుతున్నారు. ఫస్టియర్‌కు 20 వేలు పుస్తకాలు, సెకండియర్‌కు 20 వేలు పుస్తకాలు కావాలని జిల్లా ఇంటర్మీడియట్‌ శాఖ అధికారులు ప్రభుత్వానికి గతంలో ప్రతిపాదనలు పంపారు. అయినా జిల్లాకు పుస్తకాలు రాలేదు. దీంతో ఆయా కళాశాలల్లో అధ్యాపకులు పాత పుస్తకాలు ద్వారా బోధన సాగించాల్సి వచ్చింది. ప్రభు త్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులతో పాటు కసూర్బా గాంధీ బాలికల విద్యాలయం, ఏపీ మోడల్‌ కళాశాలల్లో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులదీ ఇదే పరిస్థితి. పుస్తకాలు అందకపోవడంతో ప్రైవేటు కళాశాలల విద్యార్థులతో పోటీ పడి పరీక్షలు ఎలా రాయగలమని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. పుస్తకాలు ఇవ్వకపోవడంతో గత ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత తగ్గింది.

Updated Date - Feb 29 , 2024 | 11:44 PM