Share News

ఇంటర్‌ సీట్లకు తీవ్ర పోటీ

ABN , Publish Date - May 22 , 2024 | 11:15 PM

సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఉన్న పెద్దమడి బాలురు, సీతంపేట బాలికలు, బాలురు గురుకుల రెసిడెన్షియల్‌ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి బుధవారం కౌన్సిలింగ్‌ నిర్వహించారు.

 ఇంటర్‌ సీట్లకు తీవ్ర పోటీ

- మూడు రెసిడెన్షియల్‌ కళాశాలల్లో భర్తీకి కౌన్సిలింగ్‌

- కొందరికే దక్కిన సీట్లు

- పూర్తిస్థాయిలో కేటాయించకపోవడంపై విద్యార్థుల్లో నిరాశ

సీతంపేట, మే 22: సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఉన్న పెద్దమడి బాలురు, సీతంపేట బాలికలు, బాలురు గురుకుల రెసిడెన్షియల్‌ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి బుధవారం కౌన్సిలింగ్‌ నిర్వహించారు. స్థానిక బాలుర రెసిడెన్షియల్‌ కళాశాలలో జరిగిన ఈ కౌన్సిలింగ్‌కు జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు తరలివచ్చారు. ఈ మూడు రెసిడెన్షియల్‌ కళాశాలల్లో 430 సీట్లు ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి అధికారులు విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీక రించారు. మొత్తం 1,181 మంది విద్యార్థులు దరఖాస్తులు పెట్టుకున్నారు. వీరిలో 1150 మంది విద్యార్థులు కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు. అయితే జిల్లాలో ఏకైక బాలికల రెసిడెన్షియల్‌ కళాశాల సీతంపేటలో ఉంది. ఈ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, ఒకేషనల్‌ కోర్సులకు సంబంధించి 635 మంది విద్యార్థినులు దరఖాస్తులు చేసుకొని కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు. దీంతో సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. పదో తరగతిలో 530 మార్కులకు పైబడి వచ్చిన విద్యార్థినులకు ఇక్కడ సీటు లభించింది. దీంతో చాలా మంది బాలికలకు సీటు లభించక నిరాశ చెందారు. పెద్దమడి బాలురు కళాశాలకు సంబం ధించిన కౌన్సిలింగ్‌ కూడా సీతంపేటలోనే నిర్వహించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతూ కౌన్సిలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. ఇక్కడ కూడా తీవ్ర పోటీ ఉండడంతో సీట్లు లభించక విద్యార్థులు నిరాశకు గురయ్యారు. చాలా మంది విద్యార్థులు 100 కిలోమీటర్లు దూరం నుంచి కౌన్సిలింగ్‌ హాజరుకావడం, వారికి కళాశాలలో సీట్లు లభించకపోవడంతో తీవ్ర ఆవేదన చెందారు. గిరిజన విద్యార్థులు చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నప్పటికీ కళాశాలల్లో సీట్లు పూర్తిస్థాయిలో కేటాయించకపోవడంతో వారు చదువుకు దూరమై డ్రాపౌట్స్‌గా మిగిలిపోతున్నారు. కౌన్సిలింగ్‌లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సిబ్బంది అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సహాయ గిరిజన సంక్షేమశాఖ అధికారి ఎం.శ్రీనివాసరావు, సీతంపేట పెద్దమడి ప్రిన్సిపాల్‌ పి.వి.రామారావు, సూర్యకుమారి, గురుకుల సెల్‌ ఇన్‌చార్జి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

22 పిఎల్‌కెపి 3: సీతంపేట గురుకుల కళాశాలలో నిర్వహిస్తున్న కౌన్సిలింగ్‌కు హాజరైన విద్యారులు

111111111111111

Updated Date - May 22 , 2024 | 11:15 PM