Share News

ఒక్క జీడి పంటకే బీమా!

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:31 PM

: జిల్లాలో ఒక్క జీడి పంటకు తప్ప ఇతర ఉద్యాన పంటలకు బీమా వర్తించకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జి

ఒక్క జీడి పంటకే బీమా!
మామిడి తోట

- మిగిలిన ఉద్యాన పంటలకు ఎత్తివేత

- మామిడి పంట విస్తీర్ణం ఎక్కువగా ఉన్నా వర్తింపజేయని అధికారులు

- గగ్గోలు పెడుతున్న రైతులు

బొబ్బిలి, జూన్‌ 7: జిల్లాలో ఒక్క జీడి పంటకు తప్ప ఇతర ఉద్యాన పంటలకు బీమా వర్తించకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్నిరకాల ఉద్యాన పంటల విస్తీర్ణం 45,750 హెక్టార్లు. ఇందులో మామిడి 30,714 హెక్టార్లు, జీడి 6,500, అరటి 1,600, ఆయిల్‌పామ్‌ 1,638, కొబ్బరి 3,500, జామ 150 హెక్టార్లలో సాగవుతున్నాయి. కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం 25 శాతానికి మించి సాగు విస్తీర్ణం ఉన్న పంటలకే బీమా వర్తింపజేస్తున్నారు. తక్కువ విస్తీర్ణం ఉన్న పంటలకు వర్తింపజేయడం లేదు. అయితే, ఒక్కో జిల్లాలో ఒక్కో పంటకు బీమాను చెల్లిస్తుండడం విమర్శలకు తావిస్తుంది. విజయనగరం జిల్లాలో మామిడి పంట అధిక విస్తీర్ణంలో సాగవుతున్నా బీమాను అందించడం లేదు. కేవలం జీడి పంటకే బీమా చెల్లిస్తున్నారు. దీంతో రైతాంగం లబోదిబోమంటోంది. గడిచిన నాలుగైదేళ్ల నుంచి ప్రకృతి అనుకూలించకపోవడంతో మామిడి రైతులు పూర్తిగా కుదేలవుతున్నారు. ఆయిల్‌ పామ్‌ సాగు మోజుతో పలువురు రైతులు మామిడి తోటలను తొలగిస్తున్నారు. బొబ్బిలి ప్రాం తం ఒకప్పుడు మామిడి సాగులో ముందుండేది. నాణ్యమైన ఎగుమతి రకాల మామిడి పండ్లను పండించడంలో మంచి గుర్తింపు ఉండేది. మామిడి పండ్ల ప్రదర్శనలో అనేక బహుమతులను కైవసం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ వైభవమంతా కనుమరుగై చరిత్రగానే మిగిలిపోయిందని మామిడి రైతులంతా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. విజయనగరం జిల్లాలో మామిడి పంటకు బీమాను వర్తింపజేయాలని గత జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వానికి ప్రత్యేక నివేదిక పంపారు. ప్రజాప్రతినిధులు, మామిడి రైతుల వినతుల మేరకు కలెక్టరు ప్రతిపాదనలు పంపినప్పటికీ వైసీపీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల నిర్ణయం వెలువడలేదు.

అధికారులు పట్టించుకోవడం లేదు

ఐదేళ్లుగా మామిడి రైతులకు దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉంది. బీమా సంగతి పూర్తిగా మరిచిపోయాం. కొన్ని జిల్లాలకు మాత్రమే బీమాను వర్తింపజేస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో జిల్లా మామిడికి ముఖ్యంగా బొబ్బిలి మామిడికి ఎంతో ప్రత్యేక స్థానం ఉండేది. ఉద్యానశాఖతో రైతులకు పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. మామిడి దిగుబడికి గతంలో అధికారులు యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేవారు. ఇప్పుడు కనీసం సమాచారం అందించడం లేదు. 50 ఏళ్లు వయస్సు దాటిన మామిడి చెట్లను కాపాడుకునేందుకు ప్రతీ రైతుకు ఏటా వంద రూపాయల సాయాన్ని ప్రభుత్వం అందజేయాలి. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. మామిడికి బీమాను కచ్చితంగా వర్తింపజేయాలి.

-సాలా వెంకట మురళీకృష్ణారావు, అభ్యుదయ రైతు, బొబ్బిలి

25 శాతం విస్తీర్ణం ఉంటేనే..

రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన ఉద్యాన పంటకు బీమాను వర్తింపజేస్తున్నారు. విజయనగరం జిల్లాలో జీడి పంటకు మాత్రమే వాతావరణ ఆధారిత బీమాను సంక్లిష్ట పరిస్థితుల్లో వర్తింపజేస్తారు. జిల్లాలో అరటి 1,600 హెక్లార్లలో మాత్రమే సాగవుతోంది. వాస్తవానికి 25 శాతం మేర పంట విస్తీర్ణం ఉంటేనే బీమాను వర్తింపజేస్తారు.

-వెంకటరత్నం, ఉద్యానవనశాఖాధికారి

Updated Date - Jun 07 , 2024 | 11:31 PM