వినూత్నంగా విజయనగరం ఉత్సవాలు
ABN , Publish Date - Sep 24 , 2024 | 11:45 PM
ఈ ఏడాది విభిన్నంగా, వినూత్నంగా విజయనగరం ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు.
- కలెక్టర్ అంబేడ్కర్
కలెక్టరేట్, సెస్టెంబరు 24: ఈ ఏడాది విభిన్నంగా, వినూత్నంగా విజయనగరం ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉత్సవాల నిర్వహణ కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు, కమిటీ జీవిత కాల సభ్యులు సమన్వయంతో పని చేసి ఉత్సవాలకు పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలన్నారు. నాలుగు రోజుల్లో కార్యక్రమాలను ఖరారు చేయాలని సూచించారు. ‘ఉత్సవాలకు పలువురు ప్రముఖులు వచ్చే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయాలి. అక్టోబరు 13న ఉత్సవాల ర్యాలీని పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభించి అయోద్య మైదానం వరకూ నిర్వహించాలి. ఈ ర్యాలీని వివిధ జానపద కళారూపాలు, 15వేల మందితో గొప్పగా నిర్వహించాలి. 13,14 తేదీల్లో అయోద్య మైదానంలో మెగా కల్చరల్ ఈవెంట్‌ను నిర్వహిస్తాం. పెట్‌షో కూడా ఏర్పాటు చేస్తాం. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పలు ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని’ కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జేసీ సేతుమాధవన్, డీఆర్వో ఎస్‌డీ అనిత, విజయనగరం, బొబ్బిలి ఆర్డీవో సూర్యకళ, సాయిశ్రీ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.