Share News

చార్జీలు పెంచి.. డొక్కు బస్సులే ఉంచి

ABN , Publish Date - May 08 , 2024 | 11:08 PM

గన్‌ ప్రభుత్వం తమ సభలు, సమావేశాలకు ఆర్టీసీ బస్సులను నచ్చినట్టుగా వాడుకుంది. ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా తరలించుకుపోయింది. బస్సుల సామర్థ్యం పెంచడానికి కాని కొత్త బస్సుల కొనుగోలుపై కాని దృష్టిసారించలేదు.

చార్జీలు పెంచి.. డొక్కు బస్సులే ఉంచి

చార్జీలు పెంచి.. డొక్కు బస్సులే ఉంచి

జిల్లాలో అధ్వానంగా ఆర్టీసీ బస్సులు

25 లక్షల జనాభాకు 165లోపే సర్వీసులు

నిత్యం కిక్కిరిసి ప్రయాణం

విజయనగరం(ఆంధ్రజ్యోతి), మే 8: జగన్‌ ప్రభుత్వం తమ సభలు, సమావేశాలకు ఆర్టీసీ బస్సులను నచ్చినట్టుగా వాడుకుంది. ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా తరలించుకుపోయింది. బస్సుల సామర్థ్యం పెంచడానికి కాని కొత్త బస్సుల కొనుగోలుపై కాని దృష్టిసారించలేదు. ఫలితంగా జిల్లా ప్రజలు ఈ ఐదేళ్లలో సౌకర్యమైన ప్రయాణం చేయలేకపోయారు. అర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం.. సుభప్రదం అని అందరూ భావిస్తారు. పూర్వం నుంచి ఈ నాటి వరకూ అదే నమ్మకంతో వాటిని ఆశ్రయిస్తున్నారు. అయితే బస్సుల సామర్థ్యం ప్రజల విశ్వాసానికి తగినట్టుగా ఉందా అంటే లేదనే సమాధానమే సర్వత్రా విన్పిస్తోంది.

జిల్లాలో తిరుగుతున్న అనేక ఆర్టీసీ బస్సులు ధ్రుడంగా లేవు. డొక్కు బస్సులు, సరిగా పనిచెయ్యని క్లచ్‌, గేర్లు, అరిగిపోయిన టైర్లు వెరసి ఎక్కడికక్కడ రోడ్డు మధ్యలో ఆగిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. జగన్‌ సీఎం అయిన తరువాత 2019 నుంచి ఇప్పటివరకు జిల్లాకు ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదు. పాడైపోయిన బస్సులనే తిప్పుతున్నారు. సుమారు 25 లక్షల జనభా ఉన్న జిల్లాలో 2 డిపోల్లో 165 బస్సులు మాత్రమే ఉన్నాయి. అలాగే వీటిలో 8 నుంచి 10 బస్సులు రిపేర్లు, రిజర్వుడు పేరుతో ఉంచుతారు. ఎస్‌.కోట డిపోలో 50 బస్సులు వరకు ఉన్నాయి. వీటిలో కొన్ని రిపేరులో ఉన్నాయి. విజయనగరం డిపోలో కొన్ని కాలం చెల్లిన బస్సులు ఉన్నాయి. వాటిని ఇంకా తిప్పుతున్నారు. మధ్యలో ఆగిపోవటం, బస్సునుంచి శబ్ధాలు రావడం.. టైర్లు పంచర్లు కావడం.. తదితర సమస్యలు వస్తున్నా వాటిని ఆపడం లేదు. ఇదిలా ఉండగా 2020-21 తరువాత ఆమాంతం ప్రతి టిక్కెట్‌పై రూ.5 పెంచేశారు. రూ.5 ఉన్న మినిమం టిక్కెట్‌ ధర రూ.10 చేశారు. సౌకర్యాలు పెంచలేదు. కొత్త బస్సులూ రాలేదు. మరోవైపు 50 మంది ప్రయాణించాల్సిన బస్సులో 80 నుంచి 90 మంది దాకా ప్రయాణిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మరో 50 నుంచి 60 బస్సులు అదనంగా కావాలన్న ప్రతిపాదనలు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ ఐదేళ్లలో ఆర్టీసీని నిర్వీర్యం చేశారని అన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయి.

----------------------

Updated Date - May 08 , 2024 | 11:08 PM