Share News

నిఘా నీడలో..

ABN , Publish Date - May 24 , 2024 | 11:50 PM

జిల్లా అంతా నిఘా నీడలో ఉంది. కౌంటింగ్‌కు ముందు.. తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌ శాఖ అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తోంది. పోలింగ్‌కు ముందు 144 సెక్షన్‌ విధించినప్పటికీ కౌంటింగ్‌ ముగిసిన తరువాత కూడా జూన్‌ 6వరకు అమలు కానుంది.

నిఘా నీడలో..
కవాతు నిర్వహిస్తున్న పోలీసులు

నిఘా నీడలో..

కౌంటింగ్‌ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసు ఆంక్షలు

ఎక్కడికక్కడ పహారా

విజయనగరం (ఆంధ్రజ్యోతి)

జిల్లా అంతా నిఘా నీడలో ఉంది. కౌంటింగ్‌కు ముందు.. తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌ శాఖ అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తోంది. పోలింగ్‌కు ముందు 144 సెక్షన్‌ విధించినప్పటికీ కౌంటింగ్‌ ముగిసిన తరువాత కూడా జూన్‌ 6వరకు అమలు కానుంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పోలింగ్‌ ముగిసిన తరువాత హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో జిల్లాలో కూడా పోలీసులు ప్రతి చర్యను లోతుగా పరిశీలిస్తున్నారు. నాయకులు, వారి అనుచరులపై ఓ కన్నేసి ఉంచారు. అనుమానం వస్తే పిలిచి మాట్లాడుతున్నారు. క్షేత్ర పర్యటనలకూ వెళ్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇద్దరు నుంచి ముగ్గురు పోలీసులు సాయంత్రం నుంచి రాత్రి వరకూ పహారా కాస్తున్నారు. సచివాలయ మహిళా పోలీసుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారు. నగరాలు, గ్రామాల్లో ఎటువంటి సామూహిక కార్యక్రమాలకూ అనుమతి ఇవ్వడం లేదు. పండుగలు, జాతర్లను హంగు, ఆర్భాటాలు లేకుండా చేసుకోవాలని సూచిస్తున్నారు. పెట్రోల్‌ బంకుల వద్ద కేవలం వాహనాలకే పెట్రోలు కొట్టాలని, ఖాళీ బాటిళ్లను నింపవద్దని ఆదేశించారు. దీనికి సంబంధించి బోర్డులను కూడా వేలాడదీశారు. కౌంటింగ్‌ జరిగే, జెఎన్‌టీయు, లెండి కళాశాలల వద్ద పోలీసుశాఖ మూడంచెల భద్రతను ఏర్పాటు చేసింది. కౌంటింగ్‌ రోజున జూన్‌ 4న మద్యం, బార్లును మూసివేయాలని ఇప్పటికే ఎక్సైజ్‌ శాఖ నిర్ణయం తీసుకుంది.

- అన్ని గ్రామాల్లో ఇప్పటికే పోలీసుశాఖ అవగాహన కార్యక్రమాలు, ముఖ్య కూడళ్లలో సమావేశాలు ఏర్పాటు చేసి వివాదాలకు దూరంగా ఉండాలని కోరారు. కౌంటింగ్‌కు ముందు, తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదని సూచించారు. వాహన తనిఖీలు చురుగ్గా నిర్వహిస్తున్నారు. పత్రాలు సరిగా లేకుంటే సీజ్‌ చేస్తున్నారు.

గొడవలు చేస్తే నాన్‌బెయిలబుల్‌ కేసులు: ఎస్పీ

వచ్చేనెల 4వ తేదీన కౌంటింగ్‌ ప్రక్రియ జరగనుంది. 6వ తేదీవరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుంది. కౌంటింగ్‌ అయిన తరువాత బాణసంచా కాల్చడం, డీజేలు ఏర్పాటు చెయ్యటం చెయ్యకూడదు. ఎవరైన రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపట్టినా, గొడవలకు పాల్పడినా వారిపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశాం. కౌంటింగ్‌ రోజున జిల్లా పోలీసులు, ఆర్ముడ్‌ రిజర్వు పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తాం.

3 రోజులు ముందే సిద్ధం కావాలి: కలెక్టర్‌ నాగలక్ష్మి

కలెక్టరేట్‌ : ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో మూడు రోజుల ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలని కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. ఆయా శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం ఆమె చర్చించారు. లెక్కింపు ప్రక్రియ సజావుగా సకాలంలో పూర్తి చేసేలా చూడాలన్నారు. అన్ని వసతులతో లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేయాలని చెప్పారు. లెండి కళాశాల లెక్కింపు కేంద్రానికి మోప్మా పీడీ సుధాకరరావు, హౌసింగ్‌ పీడీ శ్రీనివాసరావు, జెఎన్‌టీయూ కేంద్రానికి డిప్యూటీ సీఈవో రాజ్‌కుమార్‌, ఎస్‌సి కార్పొరేషన్‌ ఈడీ సుధారాణి ఇన్‌చార్జులుగా ఉంటారని తెలిపారు. వచ్చేనెల 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, సిబ్బంది అంతా 6 గంటలకే తమకు కేటాయించిన లెక్కింపు కేంద్రాలకు చేరుకుని, అంతా సిద్ధం చేసుకోవాలని సూచించారు. వారికి అల్పాహారం, భోజన సదుపాయం కల్పించాలన్నారు. లెక్కింపు ప్రక్రియ రాత్రి వరకూ కొనసాగితే ఇబ్బంది పడకుండా బయట కూడా లైటింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఏజెంట్లు నగదు చెల్లించి తీసుకునేలా భోజనం కౌంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. పాత్రికేయుల కోసం రెండు చోట్లా రెండు మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ కార్తీక్‌, డీఆర్‌వో అనిత తదితరులు ఉన్నారు.

Updated Date - May 24 , 2024 | 11:50 PM