Share News

హత్య కేసులో యావజ్జీవ కారాగారం

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:21 AM

సంతకవిటి మండలం కొండగూడెం గ్రామంలో 13 ఏళ్ల బాలుడిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు కొండపల్లి గోవిందరావుకు యావజ్జీవ కారాగారశిక్షతో పాటు రూ. 2 వేలు జరిమానా విఽధిస్తూ శ్రీకాకుళం ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి టి.భాస్కరరావు సోమవారం తీర్పు వెలువరించారు.

 హత్య కేసులో   యావజ్జీవ కారాగారం

రాజాం రూరల్‌, మార్చి 25: సంతకవిటి మండలం కొండగూడెం గ్రామంలో 13 ఏళ్ల బాలుడిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు కొండపల్లి గోవిందరావుకు యావజ్జీవ కారాగారశిక్షతో పాటు రూ. 2 వేలు జరిమానా విఽధిస్తూ శ్రీకాకుళం ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి టి.భాస్కరరావు సోమవారం తీర్పు వెలువరించారు. దీనికి సంబంధించి రాజాం రూరల్‌ సి.ఐ. ఎస్‌. శ్రీనివాస్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రేగిడి మండలం లింగాలవలస గ్రామానికి చెందిన రెడ్డి సూరపునాయుడు కుటుంబం సంతకవిటి మండలం కొండగూడెం గ్రామానికి వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అప్పటి నుంచి అక్కడ గోవిందరావు, సూరపునాయుడు కుటుంబాల మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకునేవి. దీంతో సూరపునాయుడు కుటుంబంపై కక్ష పెంచుకున్న గోవిందరావు అవకాశం కోసం వేచిచూసి ఎనిమిదో తరగతి చదువుతున్న సూరపునాయుడు కొడుకు దుర్గాప్రసాద్‌ని గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడివద్ద మే 1, 2021 తేదీన రాత్రి 8 గంటల సమయంలో కొండపల్లి సింహాచలం(ఏ2), కొండపల్లి శంకర్రావు(ఏ3), కొండపల్లి లక్ష్మీనారాయణ(ఏ4), కొండపల్లి అన్నపూర్ణ(ఎ5) సహకారంతో హత్య చేశాడు. అప్పటి సంతకవిటి ఎస్‌.ఐ. సీహెచ్‌.రామారావు కేసు నమోదు చేయగా అప్పటి రాజాం రూరల్‌ సి.ఐ నవీన్‌కుమార్‌ దర్యాప్తు ప్రారంభించి అయిదుగురు నిందితుల్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. ఆపై రాజాం రూరల్‌ సి.ఐ. కె.శ్రీనివాస్‌ ప్రత్యేకశ్రద్ధతో కోర్టు హెచ్‌.సి. తారకేశ్వర్రావు సహకారంతో సాక్ష్యాలను సకాలంలో కోర్టులో ప్రవేశపెట్టారు. పొలీసుల తరపున అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాన కృష్ణచంద్‌ వాదనలు వినిపించారు. ప్రధాన నిందితుడు కొండపల్లి గోవిందరావుపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి టి.భాస్కరరావు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

Updated Date - Mar 26 , 2024 | 12:21 AM