Share News

పోరుబాటలో..

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:03 AM

వైసీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా జిల్లాలో ఉద్యోగులు పోరుబాట పట్టారు. తొలిరోజు బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

 పోరుబాటలో..
పార్వతీపురం జిల్లా ఆసుపత్రి వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న ఉద్యోగులు, వైద్య సిబ్బంది

వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

(పార్వతీపురం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి)/సాలూరు రూరల్‌ / పాలకొండ/ కురుపాం)

వైసీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా జిల్లాలో ఉద్యోగులు పోరుబాట పట్టారు. తొలిరోజు బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రి వద్ద ఏపీజేఏసీ జిల్లా అధ్యక్షుడు జీవీ కిషోర్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీల ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఇప్పటివరకు పదకొండు సార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపామన్నారు. అయితే ఎటువంటి ఫలితం లేకపోవడం వల్లే ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. డీఏ, పీఆర్సీల మాట దేవుడెరుగు , కనీసం జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ, సరెండర్‌ లీవ్‌ నిధులు ఎంత పెండింగ్‌ ఉన్నాయో తెలపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డీఏ బకాయిలు రూ.8వేల కోట్లు, పీఆర్సీ ఏరియర్స్‌ రూ.7వేల కోట్లు ఉండగా.. వచ్చే జూన్‌, ఆగస్టులో కొంత ఇస్తామని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. ఏపీజీఎల్‌ఐ బకాయిలు రూ. వెయ్యి కోట్లు ఉన్నాయని, ఉద్యోగ సంఘాలు చెబుతుంటే.. రూ.300 కోట్లే ఉన్నాయంటూ ప్రభుత్వం చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సరెండర్‌ లీవుల బకాయిలు ఊసే లేదని, సీపీఎస్‌ రద్దుకు అతిగతీ లేదని, హెల్త్‌కార్డులకు దిక్కే లేదని తెలిపారు. నాలుగున్నరేళ్లు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేసిన సర్కారు.. ఇప్పుడు ఎన్నికల తరువాత చేద్దాం..చూద్దాం అంటే కుదరదని ఆయన వెల్లడించారు. తమ సమస్యలపై సర్కారు స్పందించే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఈనెల 15, 16 తేదీల్లో మధ్యాహ్న భోజన సమయంలో నిరసనలు, 17న ఆయా మండల, పట్టణ, జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, 20న కలెక్టరేట్‌ ఎదుట నిరసన, 27న చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామన్నారు.

- సాలూరులో జేఏసీ చైర్మన్‌ ఆకుల ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో జేఏసీ కో చైర్మన్‌ మీసాల వెంకట గౌరీశంకరరావు,నాయుడు ప్రభాకర్‌, అన్ను సురేష్‌, పద్మావతి, అచ్యుతాంబ తదితరులు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. సాలూరు మున్సిపల్‌, రెవెన్యూ, ఉపాధ్యాయులు తదితరులు కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఐఆర్‌ ప్రకటించాలని, పీఆర్సీ, డీఏ తదితర బకాయిలు చెల్లించాలని, ఓపీఎస్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

- పాలకొండ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం తహసీల్దార్‌ వరహాలకు జేఏసీ డివిజన్‌ గౌరవాధ్యక్షుడు లిల్లీ పుష్పనాథం ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఈ నిరసనలో ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు, ఉపాధ్యక్షుడు వాసుదేవరావు, కార్యవర్గ సభ్యులు , రెవెన్యూ అసోసియేషన్‌ నాయకులు పాల్గొన్నారు.

- కురుపాంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కురుపాం తహసీల్దార్‌ కార్యాయంలో డీటీ బి.నాగేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ నిరసనలో కురుపాం తాలూకా యూనిట్‌ ఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు ప్రకాశరావు, ఉపాధ్యక్షులు రామకృష్ణ, ఎ.సత్యనారాయణ, ఎస్‌.రమణ, పి.భారతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 12:03 AM