Share News

పోరుబాటలోనే..

ABN , Publish Date - Jan 07 , 2024 | 11:19 PM

సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, రెగ్యులర్‌ చేయాలని మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు డిమాండ్‌ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నినదించారు. ఈ మేరకు ఆదివారం పార్వతీపురంలో వారు ఇంజనీరింగ్‌ విభాగం కార్మికులతో కలిసి వినూత్నంగా నిరసన తెలిపారు.

పోరుబాటలోనే..
పార్వతీపురంలో రాస్తారోకో చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు

సర్కారు స్పందించాలని నినాదాలు

పార్వతీపురంటౌన్‌/సాలూరు/పాలకొండ, జనవరి 7 : సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, రెగ్యులర్‌ చేయాలని మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు డిమాండ్‌ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నినదించారు. ఈ మేరకు ఆదివారం పార్వతీపురంలో వారు ఇంజనీరింగ్‌ విభాగం కార్మికులతో కలిసి వినూత్నంగా నిరసన తెలిపారు. స్థానిక పాతబస్టాండ్‌ కూడలి వద్ద రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమ్మెలో భాగంగా కొద్దిరోజుల పాటు శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా.. సర్కారు స్పందించకపోవడం దారుణమన్నారు. గతంలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని సాలూరులోని బోసుబొమ్మ కూడలిలో మున్సిపల్‌ కార్మికులు సర్వమత ప్రార్థనలు, మానవహారం నిర్వహించారు. కార్మికులపై ప్రభుత్వ మొండి వైఖరి తగదన్నారు. పాలకొండలోని చెక్‌పోస్టు సెంటర్‌లో పారిశుధ్య కార్మికులు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. అనంతరం జీవో నెంబరు-2 కాపీలను దహనం చేశారు. సీఐటీయూ నాయకులు వారికి సంఘీభావం తెలిపారు.

ఎక్కడి చెత్త అక్కడే..

పార్వతీపురం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పార్వతీపురం, సాలూరు మున్సిపాల్టీలతో పాటు పాలకొండ నగర పంచాయతీలోనూ కొద్దిరోజులుగా పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెగ్యులర్‌ కార్మికులతో పనులు చేయిస్తున్నప్పటికీ ఫలితం ఉండడం లేదు. ఆయా ప్రాంతాల్లో ఎక్కడికక్కడే చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఎక్కడ చూసినా మురుగుతో నిండిన కాలువలే కనిపిస్తున్నాయి. చెత్త, వ్యర్థాల సమస్య వేధిస్తోంది. పల్లెల్లో కాలువలన్నీ పూడికలతో నిండిపోవడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడింది. దుర్వాసన వెలువడడంతో ముక్కుమూసుకుని ప్రయాణించాల్సి వస్తోంది. మొత్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. మరోవైపు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మెను మరింత ఉధృతం చేయాలని కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికులు తీర్మానించారు. దీనిలో భాగంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే పరిస్థితి ఇంకా దిగజారకముందే సర్కారు స్పందించాలని జిల్లావాసులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Jan 07 , 2024 | 11:19 PM