Share News

అసహనం.. గందరగోళం

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:06 AM

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గురువారం గుర్లలో పర్యటించారు. అసహనం, గందరగోళం మధ్య ఆయన పర్యటన సాగింది. ముందుగా ఎస్‌ఎస్‌ఆర్‌పేట నుంచి బయలుదేరిన ఆయన గుర్ల గ్రామానికి చేరుకున్నారు.

అసహనం.. గందరగోళం
డయేరియా బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న జగన్‌

- గుర్లలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన

- కార్యకర్తల అరుపులతో ఆగ్రహం

- కొద్దిసేపు వెనక్కి వెళ్లి మళ్లీ వచ్చిన వైనం

- డయేరియా బాధితులకు పరామర్శ

- మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటన

విజయనగరం (ఆంధ్రజ్యోతి)/గుర్ల అక్టోబరు 24: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గురువారం గుర్లలో పర్యటించారు. అసహనం, గందరగోళం మధ్య ఆయన పర్యటన సాగింది. ముందుగా ఎస్‌ఎస్‌ఆర్‌పేట నుంచి బయలుదేరిన ఆయన గుర్ల గ్రామానికి చేరుకున్నారు. ఇక్కడ ఒకవైపు బాధితులు, మరోవైపు ప్రజలు, ఇంకోవైపు నాయకులు హడావిడి ఎక్కువకావడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా గందరగోళంగా మారింది. కార్యకర్తల కేరింతలు, అరుపులను చూసి ఆయన అసహనానికి గురయ్యారు. అక్కడి నుంచి కొంతదూరం వెళ్లిపోయారు. వెంటనే జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ఆయన్ను తీసుకొని వచ్చారు. అనంతరం డయేరియా బాధితులను పరామర్శించారు. వైసీపీ తరఫున డయేరియా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

అందరినీ ఆదుకుంటాం

డయేరియా బాధితుల పరామర్శ అనంతరం మీడియాతో జగన్‌ మాట్లాడారు. ‘ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా, అక్కడకు నేను వెళ్లి వారికి అండగా ఉంటున్నా. గుర్లలో డయేరియాను అదుపు చేయకుండా చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌, మంత్రులు, ఉన్నతాధికారులు తలోమాట ఆడుతున్నారు. వాస్తవంగా గుర్ల తదితర గ్రామాల్లో 14 మంది డయేరియాతో చనిపోయారు. కానీ, చంద్రబాబు 8 మంది అని, దత్తపుత్రుడు 10 మంది అని, మంత్రి శ్రీనివాస్‌, కలెక్టర్‌ అంబేడ్కర్‌ ఒక్కరు మాత్రమే చనిపోయారని చెబుతున్నారు. వీరు వాస్తవాలు మాట్లాడడం లేదు. డయేరియా విషయమై నేను ఈ నెల 19న ట్వీట్‌ చేశా. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు’ అన్నారు. ‘మంచినీటి సమస్యతో గుర్లలో డయేరియా ప్రబలింది. రక్షిత ట్యాంకులను సమయానికి శుభ్రం చేయాల్సి ఉంది. కానీ, అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. చంపావతి నది నీళ్లు దారుణంగా ఉన్నాయి. గుర్ల మండలానికి సంబంధించి 345 మంది డయేరియా బాధితులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో అంతకంటే ఎక్కువగా దాదాపు 450 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటికీ గరివిడి, గజపతినగరం, దత్తిరాజేరు మండలాల్లో డయేరియా కేసుల నమోదవుతున్నాయి. ఇంకా 62 మంది చికిత్స పొందుతున్నారు’ అన్నారు. కార్యక్రమంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మాజీ మంత్రులు సీదిరి అప్పలరాజు, పుష్పశ్రీవాణి, జడ్పీ చైర్‌పర్సన్‌ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర వైసీపీ నేతలు పాల్గొన్నారు..

Updated Date - Oct 25 , 2024 | 12:06 AM