Share News

వలస ఓటర్లకు గాలం

ABN , Publish Date - Apr 06 , 2024 | 11:36 PM

ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా కీలకమైన వలస ఓటర్లుపైన ఇప్పటినుంచే దృష్టి సారించారు.

  వలస ఓటర్లకు గాలం

స్వగ్రామాలకు రావాలని ఆహ్వానం

కొమరాడ, ఏప్రిల్‌ 6 : ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా కీలకమైన వలస ఓటర్లుపైన ఇప్పటినుంచే దృష్టి సారించారు. ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల్లో ఉన్న వారిని ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందస్తుగా పంచాయతీల వారీగా జాబితాలు రూపొందిస్తున్నారు. ఎక్కువ మంది ఉన్న చోటకు అభ్యర్థుల తరపున వారి ముఖ్య నేతలు ఫోన్లు చేసి ఓటింగ్‌కు స్వగ్రామాలకు రావాలని ఇప్పటి నుంచే ఆహ్వానిస్తున్నారు. ఎన్నికల నాటికి సొంత గ్రామాలకు రప్పించే బాధ్యతను ఆయా పంచాయతీల ముఖ్య నాయకులకు అప్పగిస్తున్నారు.

ప్రతి నియోజకవర్గంలో..

జిల్లాలో కురుపాం, పార్వతీపురం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాలకు చెందిన ఎంతోమంది ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో వలస జీవులుగా ఉన్నారు. కూలీలుగా, భవన నిర్మాణ కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. మరికొందరు ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. వీరితో పాటు చదువులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు వేలల్లో ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఈ తరహా ఓట్లు సుమారు 10 వేల వరకు అంచనా. దీంతో ఎన్నికల షెడ్యూల్‌ రావడానికి ముందుగా వలంటీర్ల ద్వారా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను వైసీపీ నాయకులు గుర్తించినట్లు సమాచారం. వారిని స్వగ్రామాలకు రప్పించి తమకు అనుకూలంగా ఓటు వేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మరి వలస ఓటర్లు ఎవరి గాలానికి చిక్కుతారో చూడాలి

Updated Date - Apr 06 , 2024 | 11:36 PM