Share News

గీత దాటితే వేటే!

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:15 AM

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై ఎన్నికల సంఘం కొరడా ఝలిపిస్తోంది. గీత దాటితే వేటే అని హెచ్చరించడమే కాదు అన్నంత పనీ చేస్తోంది. అయినా అధికార పార్టీ నేతలు, వలంటీర్లు పదేపదే కోడ్‌ను అతిక్రమిస్తున్నారు. పర్యవసానం ఎదుర్కొంటున్నారు.

గీత దాటితే వేటే!
ఎన్నికల సమావేశంలో నలుగురు వలంటీర్లు

గీత దాటితే వేటే!

నలుగురు వలంటీర్ల

తొలగింపు

వైసీపీ తరపున ప్రచారం చేసినందుకు..

కొరడా ఝులిపించిన ఎన్నికల సంఘం

అయినా తీరు మారని వైనం

వైసీపీ నేతలూ నిబంధనలు

అతిక్రమించి ప్రచారం

రేగిడి ఎంపీడీవో ఫిర్యాదు..

ముగ్గురిపై కేసు నమోదు

విజయనగరం వైసీపీ మీటింగ్‌లో

నలుగురు వలంటీర్లు

ఈ వ్యవహారంపై కలెక్టర్‌కు టీడీపీ

నాయకుల ఫిర్యాదు

కొన్నిచోట్ల డీలర్లూ అంటకాగుతున్న వైనం

ఽఽశృంగవరపుకోట రూరల్‌, మార్చి 21: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై ఎన్నికల సంఘం కొరడా ఝలిపిస్తోంది. గీత దాటితే వేటే అని హెచ్చరించడమే కాదు అన్నంత పనీ చేస్తోంది. అయినా అధికార పార్టీ నేతలు, వలంటీర్లు పదేపదే కోడ్‌ను అతిక్రమిస్తున్నారు. పర్యవసానం ఎదుర్కొంటున్నారు. తాజాగా ఒకేరోజు గురువారం నలుగురు వలంటీర్లను కలెక్టర్‌ తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ ఇదే రోజు విజయనగరంలోని ఓ ఎన్నికల ప్రచార సభలో నలుగురు వలంటీర్లు పాల్గొన్నారు. కాగా ఎన్నికల ప్రచార ర్యాలీకి అనుమతి తీసుకోని కారణంగా రేగిడి మండలంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థి, మరో నేతపై పోలీసులకు ఎంపీడీవో ఫిర్యాదు చేశారు.

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేతో పాటు పాల్గొన్న వలంటీర్లను తొలగిస్తూ కలెక్టర్‌ నాగలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ఓ రేషన్‌ డీలర్‌ను ఆర్డీవో సస్పెండ్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఎస్‌.కోట మండలంలోని అలుగుబిల్లి గ్రామంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనువాసరావు బుధవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వలంటీర్లు బోనీ మనోజ్‌కుమార్‌, బుత్తల కృష్ణతో పాటు రేషన్‌ డీలర్‌ రవ్వ రాజు పాల్గొన్నారు. వీరిని గుర్తించిన కొందరు స్థానికులు ఫొటోలు తీసి ఎన్నికల అధికారులకు పంపారు. పరిశీలించి ఆరా తీసిన కలెక్టర్‌ నాగలక్ష్మి వాస్తవమేనని నిర్ధారణకు వచ్చి వలంటీర్లను తొలగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని మండల పరిషత్‌ కార్యాలయానికి వెంటనే పంపారు. ఈ విషయమై ఎంపీడీవో సాంబశివరావు మాట్లాడుతూ గ్రామంలో వలంటీర్లు నేరుగా ప్రచారంలో పాల్గొన్న ఫొటోలు, సమయం, ప్రదేశం వంటి ఖచ్చితమైన వివరాలు కలెక్టర్‌కు అందాయని, వెంటనే తొలగిస్తూ ఉత్వర్వులు పంపారని తెలిపారు. అదే విధంగా ఎమ్మెల్యే వెంటే ఉన్న గ్రామ రేషన్‌డీలర్‌ రవ్వ రాజును ఆర్డీవో సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రచారంలో డీలర్‌ ఉన్న ఫొటోలను కూడా స్థానికులు ఎన్నికల అధికారులకు పంపారు. వాటిపై తహసీల్దార్‌తో విచారించి నిజమని నిర్ధారించుకున్నాక డీలర్‌ను సస్పెండ్‌ చేసి ఆ డిపో బాధ్యతలను గ్రామానికి చెందిన మరో డీలర్‌ బీల నర్శింహనాయుడుకు అప్పగించారు. ఈ ఘటనతో మండలం లోని వలంటీర్లు, అధికారులు, ఎన్నికల సిబ్బంది షాక్‌ అయ్యారు. కలెక్టర్‌ కూడా అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి నిబంధనల అమలు పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

వైసీపీ నేతలపై కేసు

రేగిడి : ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ఎంపీడీవో శ్యామలాకుమారి ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఎంపీ, రాజాం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి, రాజాం నియోజకవర్గ పరిశీలకునిపై గురువారం కేసు నమోదైనట్లు సమాచారం. రేగిడి మండలం జోడుబందల, కందిశ, తునివాడలో ఎంపీతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి, పరిశీలకుని ఆధ్వర్యంలో గురువారం ఎన్నికల ప్రచారం, గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు. రిటర్నంగ్‌ అధికారి అనుమతి లేకుండా చేపట్టడంతో కోడ్‌ను ఉల్లంఘించారని ఎంపీడీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయం రాజాం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి జోషఫ్‌ వద్ద ప్రస్తావించగా సమాచారం తెలిసిందని, రాతపూర్వకంగా రావాల్సి ఉందని చెప్పారు.

ఎన్నికల సమావేశంలో నలుగురు వలంటీర్లు

విజయనగరం రూరల్‌ : విజయనగరంలోని 16వ డివిజన్‌లో స్థానిక వైసీపీ కార్పొరేటర్‌ నారాయణరావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంతో పాటు ఎన్నికల కార్యాలయ ప్రారంభోత్సవం గురు వారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి హాజర య్యారు. వైసీపీ జోనల్‌ నాయకులు పాల్గొన్నారు. అదే డివిజన్‌కి చెందిన వలంటీర్లు కూడా ఈ సమావేశంలో కూర్చోవడం గమనార్హం. సమావేశంలో కార్పొరేటర్‌ నారాయణరావుతో కలిసి వలంటీర్లు గురజాపు శేఖర్‌, గంగి మురళీ, కుప్ప గురుమూర్తి, రాజు పాల్గొన్నారు. ఆ వలంటీర్లపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నగర అధ్యక్షుడు ప్రసాదుల ప్రసాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నాగలక్ష్మి ఫిర్యాదు చేశారు. ఇదే ఫిర్యాదును రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ-మెయిల్‌లో పంపించారు.

-----------

Updated Date - Mar 22 , 2024 | 12:15 AM