భర్తే కాలయముడై..
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:21 PM
కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయ ముడయ్యాడు. మద్యం తాగవద్దని, అప్పులు చేయవద్దని భర్తకు చెప్పడమే ఆమె నేరమైంది. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ భర్త పక్కనే ఉన్న దుక్క (పశువుల మెడలో వేసే చెక్క)తో భార్య తలపై కొట్టి చంపేశాడు.

- భార్యను దుక్కతో కొట్టి చంపేసిన వైనం
- తాగొద్దున్నందుకు ఘాతుకం
- కొండగండ్రేడు గ్రామంలో ఘటన
గుర్ల, జనవరి 12: కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయ ముడయ్యాడు. మద్యం తాగవద్దని, అప్పులు చేయవద్దని భర్తకు చెప్పడమే ఆమె నేరమైంది. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ భర్త పక్కనే ఉన్న దుక్క (పశువుల మెడలో వేసే చెక్క)తో భార్య తలపై కొట్టి చంపేశాడు. ఈ ఘటన గుర్ల మండలం కొండగండ్రేడు గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసుల వివరాల మేరకు.. కొండగండ్రేడుకు చెందిన మునకాల సత్యం, లక్ష్మి (45) దంపతులు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కౌలుకు కొంత భూమిని తీసుకుని దంపతులు సాగు చేస్తున్నారు. సత్యం మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకునే వాడుకాదు. అప్పు చేసి మద్యం తాగడంతో పాటు పేకాట ఆడేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. గురువారం సాయంత్రం కల్లం వద్ద ఆవుకు పాలు తీస్తుండగా మరోసారి వారి మధ్య గొడవ జరిగింది. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసి ఇళ్లను గుళ్ల చేసి తనకు, పిల్లలకు ఎలాంటి ఆధారం లేకుండా చేస్తున్నావని లక్ష్మి.. సత్యంను మందలించింది. దీంతో కోపోద్రిక్తుడై పక్కనే ఉన్న దుక్కతో భార్య తలపై మోదాడు. దీంతో ఆమె అక్కడి కక్కడే మృతిచెందింది. అక్కడి నుంచి సత్యం పరారయ్యాడు. ఘటనా స్థలాన్ని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఉపేంద్రరావు, గరివిడి ఎస్‌ఐ దామోదరావు పరిశీలించారు. గ్రామస్థులను విచారించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సత్యం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు.