Share News

ఇంకెన్నాళ్లిలా?

ABN , Publish Date - May 20 , 2024 | 11:30 PM

ఏళ్లు గడుస్తున్నా.. గిరిజనులకు డోలీ కష్టాలు తీరడం లేదు. వారి గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో.. అత్యవసర వేళల్లో ఇలా మోతలు తప్పడం లేదు.

 ఇంకెన్నాళ్లిలా?
డోలీలో మాణిక్యాన్ని తీసుకెళ్తున్న గ్రామస్థులు

సీతంపేట: ఏళ్లు గడుస్తున్నా.. గిరిజనులకు డోలీ కష్టాలు తీరడం లేదు. వారి గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో.. అత్యవసర వేళల్లో ఇలా మోతలు తప్పడం లేదు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల కిండంగి వద్ద జరిగిన ఆటో ప్రమాదంలో జాతాపు జజ్జువ గ్రామానికి చెందిన నిమ్మక మాణిక్యం కాలుకు గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారం రోజులు వైద్యులు చికిత్స అందించారు. పరిస్థితి మెరుగవడంతో సోమవారం డిశ్చార్జ్‌ చేశారు. దీంతో ఆమెను అంబులెన్స్‌లో పాలకొండ నుంచి కిండంగి వరకు తీసుకొచ్చారు. అక్కడ నుంచి జజ్జువ గ్రామం వరకు ఘాట్‌ రోడ్డు కావడంతో కుటుంబ సభ్యులు ఆటోలో సవర జజ్జువ వరకు తీసుకెళ్లారు. ఆ తర్వాత రెండు కిలోమీటర్ల మేర జాతాపు జజ్జువ వరకు ఉన్న రహదారి అధ్వానంగా మారడంతో వాహనాలు రాకపోకలు సాగించలేని పరిస్థితి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మండుటెండలో మాణిక్యాన్ని డోలీ సాయంతో గిరిశిఖర గ్రామమైన జాతాపు జజ్జువ వరకు మోసుకుని వెళ్లినట్టు ఆ ప్రాంతానికి చెందిన నిమ్మక నందు తెలిపాడు. తమ గ్రామంలో ఎవరు అనారోగ్యం గురైనా డోలీ మోతలు తప్పడం లేదని వాపోయాడు. రహదారి పనులు పూర్తి చేయాలని ఎన్నిసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు వేడుకున్నా ఫలితం లేకపోయిందని ఆ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - May 20 , 2024 | 11:30 PM