Share News

ఇసుక లేకుంటే ఇల్లు కట్టేదెలా?

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:41 PM

- చాలా కాలంగా అద్దె ఇంట్లో ఉంటున్నాను. ఈ ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వలేదు. పైసా పైసా కూడబెట్టి స్థలం కొని ఇంటి నిర్మాణం ప్రారంభించాను. అయితే ఇసుక కోసం నానా తంటాలు పడాల్సి వస్తోంది. జగనన్న కాలనీల్లో నిర్మాణాలు చేపట్టేవారికే ఇసుక అంటున్నారు. సొంతంగా ఇల్లు కట్టుకొనేవారికి ఇవ్వడం లేదు. నాటుబండి లోడు ఇసుక రూ.1000 అడుగుతున్నారు. ఐదేళ్ల కిందట ఈ ధరకు ట్రాక్టర్‌ ఇసుక వచ్చేది.

ఇసుక లేకుంటే ఇల్లు కట్టేదెలా?

ఇసుక లేకుంటే ఇల్లు కట్టేదెలా?

సామాన్యుడికి అందనంత దూరం

అసలు దొరకడమే గగనం

మూడింతలు పెరిగిన ధర

ట్రాక్టర్ల స్థానంలో విస్తృతంగా నాటుబండ్లు

నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం

వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం

శృంగవరపుకోట, ఏప్రిల్‌ 20:

- చాలా కాలంగా అద్దె ఇంట్లో ఉంటున్నాను. ఈ ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వలేదు. పైసా పైసా కూడబెట్టి స్థలం కొని ఇంటి నిర్మాణం ప్రారంభించాను. అయితే ఇసుక కోసం నానా తంటాలు పడాల్సి వస్తోంది. జగనన్న కాలనీల్లో నిర్మాణాలు చేపట్టేవారికే ఇసుక అంటున్నారు. సొంతంగా ఇల్లు కట్టుకొనేవారికి ఇవ్వడం లేదు. నాటుబండి లోడు ఇసుక రూ.1000 అడుగుతున్నారు. ఐదేళ్ల కిందట ఈ ధరకు ట్రాక్టర్‌ ఇసుక వచ్చేది.

- ఎస్‌.కోటకు చెందిన ఓ ఇంటి నిర్మాణదారుడి అవేదన.

- ప్రభుత్వం ఇసుక ట్రాక్టర్లపై కేసులు నమోదు చేస్తుండడంతో నాటు(ఎద్దులు) బండ్లు సమకూర్చుకున్నాం. వీటిని పట్టుకుంటే ఇసుక మాత్రమే పోతుంది. ట్రాక్టరైతే పోలీస్‌ స్టేషన్‌లో పెట్టుకుంటున్నారు. పనిలేకపోయినా డ్రైవర్‌కు జీతం ఇవ్వాలి. తిరగకపోతే ట్రాక్టరు పాడవుతుంది. ఎద్దులు ఎక్కడున్నా ఒకటే తిండి. బండి తొందరగా పాడవదు. ఇసుకను తోలుకోని జీవనం సాగించే మాకు ఇంతకంటే మరోపని తెలియదు. అప్పుడప్పుడు అధికారులు పట్టుకుంటు న్నారు. పదోపరకో ఇచ్చి వాటిని విడిపించుకుంటున్నాం. అందుకే ఒక బండిపై రూ.వెయ్యి అడుగుతున్నాం.

-నాటుబండ్లతో ఇసుక రవాణా చేస్తున్న ఓ వ్యక్తి జవాబు

సీఎం జగన్‌ దెబ్బకు ఏర్పడిన ఇసుక కోరతతో నిర్మాణదారులు, రవాణాదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇసుక రవాణాదారులు ట్రాక్టర్లను వదిలేసి నాటుబండ్లు వెంట పడ్డారు. ఎద్దులకు పెట్టే దాణా ఖర్చులు పెరిగాయని... రెవెన్యూ, పోలీస్‌లను తప్పించుకొని తీసుకురా వడం ఎంతో కష్టమని వాపోతున్నారు. అధిక ధరకు ఇసుకను కొనుగోలు చేయలేకపోతున్నామని ఇళ్ల నిర్మాణ దారులు ఆవేదన చెందుతున్నారు. ఇలా రెండు వర్గాలను జగన్‌ ప్రభుత్వం దెబ్బతీసింది. జిల్లాలో గోస్తానీ, చంపావతి, వేగావతి వంటి నదులున్నాయి. వీటితో పాటు గెడ్డలు, వాగుల్లోనూ ఇసుక లభ్యమవుతోంది. దీన్నే కొంత మంది వ్యాపారంగా మలుచుకున్నారు. వీటి నుంచి ఇసుకను తవ్వి చుట్టుపక్కల గ్రామాల్లో నిర్మాణాలు చేపడుతున్న వారికి అమ్మేవారు. నదీ పరివాహక ప్రాంతాలు, గెడ్డలు, వాగులకు సమీపంలో ఉన్న గ్రామాలకు ట్రాక్టరు ఇసుక రూ.500లోపే దొరికేది. కాస్త దూరం వున్న గ్రామాలకు రూ.1000 నుంచి రూ.1500 వరకు లభ్యమయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సామాన్యుడికి ఇసుక ధర పెనుభారంగా పరిణమించింది.

- ఇసుక తవ్వకాలతో నదీ పరివాహక ప్రాంతాలకు నష్టం కలగకుండా తెలుగుదేశం ప్రభుత్వం నిఘా పెట్టేది. వంతెనలు, తాగునీరు అందించే ఊటబావుల దగ్గర తవ్వకాలు జరగకుండా అడ్డుకోనేది. పర్యావరణం దెబ్బతినకుండా చూడడంతో పాటు స్థానిక అవసరాలకు ఇసుక పొందేలా వ్యవహరించేది. వైసీపీ అధికారం చేపట్టాక అంతా తారుమారైంది. నూతన ఇసుక పాలసీని తీసుకొచ్చింది. నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుకను తవ్వేందుకు టెండర్‌లను పిలిచింది. వేలంపాట వేసి కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఎక్కడా ఇసుకను తవ్వకుండా అడ్డుకట్ట వేసింది. విడిగా ఇసుక ట్రాక్టర్‌ కనిపిస్తే చాలు కేసులు నమోదు చేశారు. అయితే జిల్లాలో వున్న నదులు, గెడ్డలు, వాగుల్లో కాంట్రాక్టర్‌ ద్వారా తవ్వేటంతటి ఇసుక నిల్వలు లేవు. మొదట్లో ఇసుకను విక్రయించిన అధికారులు ఇసుక నిల్వలు బాగా తగ్గిపోవడంతో పర్యావరణ ఇబ్బందులు తలెత్తుతాయని జిల్లా అధికార యంత్రాంగం హెచ్చరించడంతో అపేశారు. అప్పటి నుంచి స్థానిక అవసరాలకు ఇసుక దొరకడం లేదు.

- టన్ను, రెండు టన్నుల ఇసుక కావాలన్నా డిపోలకు వెళ్లి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇక్కడ కూడా జగనన్న కాలనీలకు మాత్రమే అందిస్తున్నారు. సొంతంగా ఇళ్లు నిర్మించుకోనే వారికి ఇసుక దొరకడమే గగనమవుతోంది. ఇలాంటి వారందరికీ నాటుబండ్లుతో వచ్చే ఇసుకే ఆధారం. ట్రాక్టర్లను అధికారులు అడ్డుకోవడంతో ఇసుక వ్యాపారం చేసేవారంతా నాటు (ఎద్దుల)బండ్లును కొనుక్కొన్నారు. ఒక్కొక్కరు ఒకటి నుంచి మూడు, నాలుగు నాటు బండ్లు లాగేందుకు అవసరమైన ఎద్దులను పోషిస్తున్నారు. వీటి ద్వారా ఇసుకను రవాణా చేస్తున్నారు. ఇప్పుడు జిల్లాలో చిన్నచిన్న నిర్మాణాలు చేపట్టేవారికి వీరే ఆపద్బాంధవులు. అయిఏ వీరు ఎక్కడ ఇసుక ఉంటే అక్కడ తవ్వేస్తున్నారు. ఊటబావులు, వంతెనల సమీప ప్రాంతాలనూ వదలడం లేదు. ఇవేమీ పట్టించుకోని యంత్రాంగం కంటబడితే కేసులు నమోదు చేయకుండా బేరాలకు దిగుతున్నారు. ఇసుక రవాణా చేస్తున్నవారు ఇదే విషయం చెబుతూ నిర్మాణదారుడికి మరింత ఎక్కువ ధరకు ఇసుకను అమ్ముతున్నారు.

Updated Date - Apr 27 , 2024 | 11:41 PM