Share News

ఇప్పుడెలా?

ABN , Publish Date - May 19 , 2024 | 12:06 AM

జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆశించిన స్థాయిలో మద్దతు ధర లేక.. పంటను విక్రయించుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు అకాల వర్షాలు వారిని కలవరపెడుతున్నాయి.

 ఇప్పుడెలా?
కన్నపుదొరవలసలో మొక్కజొన్న పంటను బస్తాలకు ఎత్తిన దృశ్యం

పంటను విక్రయించుకోలేక.. కాపాడుకోలేక అవస్థలు

నామమాత్రంగా ప్రభుత్వ మద్దతు ధర

కొనుగోలుకు సిద్ధమంటున్న అధికారులు ప్రకటనలకే పరిమితం

ఇదే అదునుగా దళారులు రంగ ప్రవేశం

రోజురోజుకూ ధరను తగ్గిస్తున్న వైనం

కొమరాడ/జియ్యమ్మవలస,మే 18: జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆశించిన స్థాయిలో మద్దతు ధర లేక.. పంటను విక్రయించుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు అకాల వర్షాలు వారిని కలవరపెడుతున్నాయి. కొనుగోలుకు చర్యలు చేపట్టామంటున్న అధికారులు ప్రకటనలకే పరిమితమయ్యారు. దీంతో దళారులు రైతులను దోచుకుంటున్నారు. జిల్లాలో 3,492 మంది రైతులు 11,820 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేపట్టారు. గతేడాదితో పోలిస్తే.. రబీ సీజన్‌లో మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగింది. కాగా ఈ ఏడాది 41,279 మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్న దిగుబడి వచ్చినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. అయితే దీని కొనుగోలుకు 209 ఆర్‌బీకేలలో రిజిస్ట్రేషన్‌ కార్యక్రమానికి మార్క్‌ఫెడ్‌ అధికారులు చర్యలు తీసుకోగా ఒక్క రైతు కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకోకపోవడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేస్తున్న ధర కంటే మార్కెట్‌లో ధర అధికంగా ఉండడమే. ప్రభుత్వం క్వింటాకు రూ. 2090లు మద్దతు ధరగా నిర్ణయించింది. అయితే మార్కెట్‌లో రూ. 2,100 నుంచి రూ. 2,300ల వరకు ధర పలుకుతోంది. దీంతో రైతులందరూ మార్కెట్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో దళారులు, ప్రైవేట్‌ వ్యాపారులు సగానికి పైగా పంటను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే అదునుగా కొందరు గోనె సంచులకని, రవాణా ఖర్చులకని, ఇంకొక ఖర్చులకని రైతుల నుంచి వసూలు చేస్తున్నారు.

గతేడాదిలో ఇలా..

గతేడాది రబీ సీజన్‌లో క్వింటా రూ.1962లకు 32 ఆర్‌బీకేల ద్వారా 475 మంది రైతుల నుంచి 3,404.50 మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్నను మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేశారు. అయితే అప్పటికే ఆర్‌బీకేలలో టార్గెట్లు పూర్తవ్వడంతో చాలామంది ప్రైవేట్‌ వ్యాపారులకు పంటను విక్రయించాల్సి వచ్చింది.

వాతావరణ మార్పులతో ఆందోళన

ప్రస్తుతం అకాల వర్షాలు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. పంటను రక్షించుకోలేక.. విక్రయించు కోలేక రైతులు సతమతమవుతున్నారు. మరోవైపు దళారులు రోజురోజుకూ ధర తగ్గిస్తూ పంటను కొనుగోలు చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్‌ వ్యాపారులు అడిగిన ధరకు పంటను అమ్ముకోవాల్సి వస్తోందని, దీనివల్ల ఆర్థికంగా నష్టపోతున్నట్లు రైతులు వాపోతున్నారు. ఎకరా సాగుకు సుమారు రూ. 30 వేల వరకు ఖర్చయిందని, పంట పెట్టుబడి పెరిగిన నేపథ్యంలో మద్దతు ధరను రూ.3వేలుగా నిర్ణయించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఎవరూ ముందుకు రాలేదు

జిల్లాలో 209 ఆర్‌బీకేలలో మొక్కజొన్న కొనుగోలు రిజిస్ట్రేషన్‌కు చర్యలు చేపట్టాం. కానీ ఎవరూ ముందుకు రాలేదు. అందుకే కొనుగోలు చేయలేకపోయాం. ప్రభుత్వ మద్దతు ధరకు, బయట వ్యాపారులు కొనుగోలు చేస్తున్న ధరకు పెద్ద వ్యత్యాసం లేదు.

- విమల, డీఎం, మార్క్‌ఫెడ్‌, పార్వతీపురం మన్యం జిల్లా

Updated Date - May 19 , 2024 | 12:06 AM