అందరికీ ఎలా?
ABN , Publish Date - Sep 10 , 2024 | 12:01 AM
ఐటీడీఏ పరిధిలో గిరిజన రైతులకు అందించనున్న మారిషస్ పైనాపిల్ మొక్కల సరఫరాకు సంబంధించి ఇటీవల నిర్వహించిన టెండర్ విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టెండర్‌దారులందరికీ మొక్కల సరఫరాకు అనుమతులు
అధికారుల తీరుపై సందేహాలు
సీతంపేట రూరల్, సెప్టెంబరు 9: ఐటీడీఏ పరిధిలో గిరిజన రైతులకు అందించనున్న మారిషస్ పైనాపిల్ మొక్కల సరఫరాకు సంబంధించి ఇటీవల నిర్వహించిన టెండర్ విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్లపై పాల్గొన్న వారందరికీ మొక్కల సరఫరాకు అనుమతులు ఇవ్వడంపై పలు సందే హాలు వ్యక్తమవుతున్నాయి. తక్కువ ధరకు కోడ్ చేసిన వారిని కాకుండా ఐటీడీఏ అధికారులు ఇలా..ఎలా? చేశారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ప్రయోగాత్మకంగా...
సీతంపేట, భామిని మండలాల పరిధిలో సుమారు 90 ఎకరాల్లో కేరళ రకానికి చెందిన మారిషస్ పైనాపిల్ మొక్కలను ప్రయోగాత్మకంగా పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు గత నెల 31న సీతంపేట ఐటీడీఏలో ఇన్‌చార్జి పీవో వీవీ రమణ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. 7.20లక్షల మారిషస్ పైనాపిల్ సక్కర్స్ సరఫరాకు సంబంధించి మొత్తంగా 11మంది టెండర్‌దారులు పాల్గొన్నారు. కాగా నిబంధనల ప్రకారం ఎవరైతే తక్కువ ధర కోడ్ చేస్తారో వారికే ఈ టెండర్‌ను ఖరారు చేయాల్సి ఉంది. కానీ ఐటీడీఏ అధికారులు అలా చేయలేదు. టెండర్‌లో పాల్గొన్న 11 మందికి పైనాపిల్ సక్కర్స్ సరఫరాకు అనుమతులు ఇచ్చారు. ఒక్కో మొక్క ధరను రూ.19గా నిర్ణయించారు. నిర్దేశించిన గడువులోగా సక్కర్స్ సరఫరా చేయాలని టెండర్‌దారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే అధికారులు సీల్డ్ టెండర్‌ను నిర్వహించినప్పటికీ ఈ విధంగా టెండర్‌లో పాల్గొన్న వారందరికి మొక్కల సరఫరా చేసేందుకు సంబంధించి అనుమతులు ఎలా ఇచ్చారనే దానిపై పలు సందేశాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ నెల 20న 7.20లక్షల పైనాపిల్ సక్కర్స్‌ను గిరిజన రైతులకు 90 శాతం సబ్సిడీపై అందించేందుకు ఐటీడీఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మరో రెండు రోజుల్లో మొదటి విడతగా 60 వేల పైనాపిల్ సక్కర్స్ సీతంపేటలోని తురాయిపువలస ఉద్యానవన నర్సరీకి రానున్నాయి.
లీస్ట్ ప్రైస్ కాదని...
టెండర్‌లో పాల్గొన్న 11 మందిలో కడియం ప్రాంతానికి చెందిన గ్లోబల్ నర్సరీ సంస్థ రూ.15కు మొక్కల పంపిణీ చేసేందుకు ముందుకొచ్చింది. అయితే దీనిని అధికారులు తిరస్కరించారు. సీల్డ్ టెండర్‌లో టెండర్‌దారులు కోడ్ చేసిన లీస్ట్ ప్రైస్ కాదని నెగోషిబుల్ పేరుతో రూ.19కి ధరను ఖరారు చేశారు. ఒక్కో టెండర్ దారుడు సుమారు 65,454 వేల పైనాపిల్ సక్కర్స్‌ను సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే అధికారులు ఇలా ఎందుకు చేశారనేది ఎవరికీ అర్థం కావడం లేదు.
కేరళ రకం సక్సెస్ అయ్యేనా?
కేరళలో రైతులకు అధిక లాభాన్ని చేకూర్చే పంటల్లో ప్రధానమైనది ఈ మారిషస్ పైనాపిల్. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పైగా అక్కడి వాతావరణం, సారవంతమైన నేల ఆ పంటకు అనుకూలం. అందుకే పూర్తిస్థాయిలో దిగుబడులు వస్తుంటాయి. కానీ ఇక్కడ పరిస్థితులు వేరు. సీతంపేట ఏజెన్సీలో సకాలంలో వర్షాలు కురిసే అవకాశాలు తక్కువ. ఎండ తీవ్రత ఎక్కువ. తరచూ వాతావరణ మార్పుల కారణంగా కేరళ రకానికి చెందిన పైనాపిల్ ఈ ప్రాంతంలో ఎంత వరకు సక్సస్ అవుతుందనేది సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
లాభపడుతున్న దళారులు
ఐటీడీఏ పరిధిలోని సీతంపేట, భామిని, హిరమండలం, మెళియాపుట్టి, పాతపట్నం, కొత్తూరు మండలాల్లో పైనాపిల్ సాగు ఎక్కువగా ఉంది. అయితే సింహాచలం రకానికి చెందిన లోకల్ వెరైటీ పైనాపిల్ మాత్రమే ఇక్కడ సాగవుతోంది. అయితే ఈ రకానికి చెందిన పంట మూడు రోజులకు మించి నిల్వ ఉండదు. పైగా ఈ పంటలో పులుపు ఎక్కువగా ఉంటుంది. మరోవైపు ఐటీడీఏలో కోల్డ్ స్టోరేజీ సౌకర్యం లేకపోవడంతో గిరిజన రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ ధరకు పైనాపిల్‌ను విక్రయిస్తున్నారు. దీంతో దళారులు ఆర్థికంగా లాభపడు తున్నారు.
పీహెచ్‌వో ఏమన్నారంటే...
‘కేరళ రకానికి చెందిన మారిషస్ పైనాపిల్ మొక్కల సక్కర్స్‌కు తీవ్ర డిమాండ్ ఉంది. అందుకే టెండర్‌లో పాల్గొన్న వారందరికి సక్కర్స్ సరఫరాకు అనుమతులు ఇచ్చాం. ఏ ఒక్కరో అయితే వాటిని ఇన్‌టైంలో సరఫరా చేయలేరనే ఉద్దేశంతోనే ఇలా చేశాం. తొమ్మిది మంది సభ్యులతో అధ్యయన కమిటీ వేసి ... ఈ రకం పైనాపిల్ గిరిజన ప్రాంతంలో ఎంత వరకు సక్సస్ అవుతందో గుర్తించాం. ఆ నివేదిక ఆధారంగానే కేరళ రకానికి చెందిన మారిషస్ మొక్కలను సీతంపేట ఏజెన్సీకి పరిచయం చేస్తున్నాం. ఇప్పుడు తెప్పిస్తున్న 7.20 లక్షల పైనాపిల్ మొక్కలు కూడా శాంపిల్స్ మాత్రమే. ఇక్కడ దిగుబడి ఆధారంగా మరిన్ని మారిషస్ పైనాపిల్ మొక్కలను తెప్పించి.. గిరిజన రైతులకు పంపిణీ చేస్తాం. వాటితో ఏడాదికి మూడు సార్లు దిగుబడులు పొందే అవకాశం ఉంది.’ ఐటీడీఏ ఉద్యానవన శాఖ అధికారి వెంకట గణేష్ తెలిపారు.