మంత్రిపైనే ఆశలు..
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:39 PM
కూటమి ప్రభుత్వంలో జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. ఇది గుర్తించిన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లాకు చెందిన సాలూరు ఎమ్మెల్యే సంధ్యారాణికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. దీంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమ వుతున్నాయి. జిల్లాకు మంచి రోజులు వచ్చాయని ప్రజలు భావిస్తున్నారు. ఆమెపైనే ఎన్నో ఆశ

గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్నింటా వెనుబడిన వైనం
జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టించాల్సిన బాధ్యత ఆమెపైనే..
విద్య, వైద్యం, సాగునీరు, రహదారులపై దృష్టి సారించాలని కోరుతున్న ప్రజలు
పార్వతీపురం, జూన్12 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ పాలనలో జిల్లా అన్నింటా వెనుకబడింది. ఐదేళ్లలో కనీస అభివృద్ధికి నోచుకోలేదు. ఎన్నో సమస్యలతో జిల్లావాసులు సతమతమయ్యారు. జిల్లా పరిధిలో రెండు ఐటీడీఏలు ఉన్నా.. నిధుల లేమితో నామమాత్రంగా మారాయి. దీంతో గిరిజనులకు పూర్తిస్థాయిలో సేవలు అందలేదు. మొత్తంగా వైసీపీ సర్కారు హయాంలో అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అందుకే ఓటుతో అరాచక పాలనకు ముగింపు పలికారు. చంద్రబాబుపై నమ్మకంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి పట్టం కట్టారు. సాలూరు, పాలకొండ, పార్వతీపురం, కురపాం నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు అఖండ విజయాన్ని అందించారు. కూటమి ప్రభుత్వంలో జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. ఇది గుర్తించిన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లాకు చెందిన సాలూరు ఎమ్మెల్యే సంధ్యారాణికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. దీంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమ వుతున్నాయి. జిల్లాకు మంచి రోజులు వచ్చాయని ప్రజలు భావిస్తున్నారు. ఆమెపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల ద్వారా గిరిజన ప్రాంతాల ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలని, అదేవిధంగా జిల్లాలో నెలకొన్న అనేక సమస్యలకు పరిష్కార మార్గం చూపాలని ‘మన్యం’ వాసులు కోరుతున్నారు. కాగా మంత్రి సంధ్యారాణి దృష్టి సారించాల్సిన ప్రధాన అంశాలు ఇవే..
- జిల్లాలో గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన వైటీసీ (యూత్ ట్రైనింగ్ సెంటర్)లపై దృష్టి సారించి ఎంతోమంది గిరిజన యువత ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాల్సి ఉంది.
- జిల్లాలో వందలాది గిరిజన గ్రామాలకు రోడ్డు, రవాణా సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ఇక పట్టణ, పల్లెలతో పాటు జిల్లా పరిధిలోని అంతర్రాష్ట్ర రహదారులను బాగు చేయాల్సి ఉంది.
- సాలూరు, పార్వతీపురం , పాలకొండ నియోజకవర్గాల్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాల్సి ఉంది. రోడ్డు విస్తరణ, బైపాస్ పనులను మంత్రి పూర్తి చేయించాల్సి ఉంది.
- గిరిజన గర్భిణుల వసతి గృహాలను గాడిలో పెట్టాల్సి ఉంది.
- జిల్లాలో అనేక గిరిజన గ్రామాలకు పీహెచ్‌సీల నుంచి 24 గంటల పాటూ వైద్య సేవలు అందించాల్సి ఉంది.
- జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను నియమించాలి. పార్వతీపురం, సీతంపేటలో ఉన్న సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణాలను వేగవంతం చేయాలి.
- ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాల్సి ఉంది.
- కురుపాం నియోజకవర్గంలో ఉన్న గిరిజన ఇంజనీరింగ్ కళాశాల పనులను వేగవంతంగా పూర్తి చేయించి గిరిజన ఇంజనీరింగ్ విద్య స్థానికంగా విద్యారులకు అందబాటులోకి తేవాల్సిన బాధ్యత మంత్రిపై ఉంది. వైసీపీ ప్రభుత్వంలో మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
- సాలూరులో నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆసుపత్రి పనులు వేగవంతంగా పూర్తి చేయించాలి. కురుపాం సీహెచ్‌సీ అభివృద్ధి పనులపైనా మంత్రి దృష్టి సారించాల్సి ఉంది. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలను బలోపేతం చేయాలి.
- పాచిపెంట మండలం కొటికిపెంట ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణం త్వరగా పూర్తిచేయాలి. మక్కువ మండలం అనసభద్ర, కురుపాంలో నిర్మించిన ఏకలవ్య పాఠశాలల్లో పెండింగ్ పనులు పూర్తి చేయించి, వసతులను కల్పించాల్సిన బాధ్యత మంత్రి సంధ్యారాణిపై ఉంది.
- జైకా నిధులతో వీఆర్‌ఎస్ , పెద్దగెడ్డ, పెదంకలాం ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులు పూర్తి చేయాల్సి ఉంది.
- కొమరాడ మండలం పూర్ణపాడు-లాబేసు వంతెన, సీతానగరంపై వంతెన పనులు పూర్తిచేయాలి.