Share News

వృద్ధులు.. దివ్యాంగులకు హోమ్‌ ఓటింగ్‌

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:46 AM

ఈసారి వృద్ధులు, దివ్యాంగులకు ఎన్నికల కమిషన్‌హోం ఓటింగ్‌ సదుసాయం కల్పించింది. అందుకు సం బంధించి జిల్లా అధికారు లు ఏర్పాటు చేస్తున్నారు.

వృద్ధులు.. దివ్యాంగులకు హోమ్‌ ఓటింగ్‌

- జిల్లాలో 29,174 మంది గుర్తింపు

- నేటి నుంచి 22 వరకూ దరఖాస్తుల స్వీకరణ

- మే 7 నుంచి 10 వరకు హోం ఓటింగ్‌

కలెక్టరేట్‌ (విజయనగరం): ఈసారి వృద్ధులు, దివ్యాంగులకు ఎన్నికల కమిషన్‌హోం ఓటింగ్‌ సదుసాయం కల్పించింది. అందుకు సం బంధించి జిల్లా అధికారు లు ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు రకాల కేటగిరీల వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ అందజేస్తారు. కొవిడ్‌ బారిన పడిన వారు, 85 ఏళ్లు దాటిన వృద్ధులు... 40 శాతం పైబడి వైకల్యం ఉన్నవారు... 33 రకాల అత్యవసర విభాగాల్లో పని చేస్తున్న సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పిస్తారు. వీరిలో వృద్ధులు, దివ్యాంగులకు హోం ఓటింగ్‌కు అవకాశం కల్పిస్తారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 29,174 మంది హోం ఓటింగ్‌కు ఉన్నట్లు బీఎల్‌వోలు గుర్తించారు. హోం ఓటింగ్‌ కావలసిన వారు ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకూ ఫారం 12(డి) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులను పరిశీలించి 26 నాటికి తుది జాబితా తయారు చేస్తారు. నామినేషన్లు ముగిసిన తరువాత.. బ్యాలెట్‌ పేపర్లు ముద్రించిన తరువాత వీరికి మే నెల 7 నుంచి 10వ తేదీ వరకూ హోం ఓటింగ్‌ నిర్వహిస్తారు. జిల్లాలో సుమారు 7,181 మంది 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న 21,993 మంది దివ్యాంగులు ఉన్నారు. హోం ఓటింగ్‌కు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య అవకాశాన్ని కల్పిస్తారు. ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారులు, వీడియోగ్రాఫర్లు, మైక్రో అబ్జర్వర్‌తో పాటు బీఎల్‌వోలు, పార్టీల ఏజెంట్లు కూడా దరఖాస్తుదారుని ఇంటికి వెళ్లి... ఓటు తీసుకుంటారు. బ్యాలెట్‌ పత్రాల ద్వారా జరిగే ఈ విధానంలో కూడా దరఖాస్తుదారుని ఇంట్లో ప్రత్యేకంగా కంపార్ట్‌మెంట్‌ ఏర్పాటు చేసి... ఏకాంతంగా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. అవసరమైన పక్షంలో కుటుంబ సభ్యులను మాత్రమే వారికి సహకారం అందించేందుకు అనుమతిస్తారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేస్తారు. హోమ్‌ ఓటింగ్‌కు దరఖాస్తు చేసిన వారికి పోలింగ్‌ బూత్‌లో ఓటు వేసే అవకాశం ఉండదు.

దరఖాస్తులు స్వీకరిస్తాం

కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఈసారి వృద్ధులు, దివ్యాంగులకు హోం ఓటింగ్‌ కోసం కొత్తగా అవకాశం కల్పించింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నాం. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 26న తుది జాబితా తయారు చేస్తాం. వచ్చే నెల 7 నుంచి 10 తేదీ వరకూ హోమం ఓటింగ్‌ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తాం.

- కె.సందీప్‌ కుమార్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ నోడల్‌ అధికారి

Updated Date - Apr 18 , 2024 | 12:46 AM