గిరిశిఖరంపై వైద్యం
ABN , Publish Date - Nov 13 , 2024 | 11:36 PM
జిల్లాలోని కొండ శిఖర గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గిరి వైద్య కేంద్రాల పేరిట కంటైనర్ ఆస్పత్రుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా సాలూరు మండలం తోణాం పీహెచ్‌సీ పరిధి గిరిశిఖర పంచాయతీ కరడవలసలో కంటైనర్ ఆస్పత్రి ప్రారంభానికి సిద్ధమైంది.

అందనున్న 15 రకాల వైద్య సేవలు
త్వరలో ప్రారంభం
గిరిజనులకు తప్పనున్న కష్టాలు
సాలూరు రూరల్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కొండ శిఖర గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గిరి వైద్య కేంద్రాల పేరిట కంటైనర్ ఆస్పత్రుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా సాలూరు మండలం తోణాం పీహెచ్‌సీ పరిధి గిరిశిఖర పంచాయతీ కరడవలసలో కంటైనర్ ఆస్పత్రి ప్రారంభానికి సిద్ధమైంది. ఈ ఆస్పత్రి ద్వారా సాలూరు మండలంలోని కరడవలస, కరడకొత్తవలస, నారింజపాడు, బొడ్డపాడు, బెల్లపాక, పాచిపెంట మండలంలోని ఆజూరు, కుంబివలస, కంకణాపల్లి, చాకిరేవువలస తదితర గ్రామాల్లోని 2వేల మందికి వైద్య సేవలు అందనున్నాయి. ఇక్కడకు వారానికి రెండు రోజులు తోణాం పీహెచ్‌సీ వైద్యుడు వస్తారు. మిగిలిన రోజుల్లో ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్), హెల్త్ అసిస్టెంట్, ఏఎన్‌ఎం, ఆశా, సీహెచ్‌డబ్ల్యూ సేవలందిస్తారు. అంగన్‌వాడీ కార్యకర్త సైతం సహకరించాల్సి ఉంటుంది. ఈ కంటైనర్ ఆసుపత్రిలో వైద్యుడి గది, రోగులకు చికిత్స అందించడానికి నాలుగు బెడ్లతో కూడిన గది, టీవీ, బాల్కనీ ఉన్నాయి. 15 రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు. టీకా కార్యక్రమం నిర్వహించనున్నారు. మందులు అందుబాటులో ఉంటాయి. గర్భిణులకు తనిఖీలు చేయనున్నారు. వారికి రక్తహీనత ఉంటే ఐరన్ సుక్రోజ్ ఇంజక్షన్లు ఇక్కడే చేయనున్నారు. ఈ కంటైనర్ ఆసుపత్రిని ఇటీవల జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పరిశీలించి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేంద్రం పనితీరును బట్టి జిల్లాలో మరో నాలుగు గిరిశిఖర గ్రామాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
కలెక్టర్ ఆలోచనతోనే..
గిరిశిఖర గ్రామాలకు సరైన రోడ్లు లేక ఆయా గ్రామాల ప్రజలు వైద్యం కోసం మైదాన ప్రాంతాలకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనార్యోగానికి గురైన వారిని, ప్రసవాల కోసం గర్భిణులను డోలి మోతలతో కొండల నుంచి కిందకు దించుతున్నారు. డోలితో దిగడానికి ఇష్టం లేనివారు నాటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల కొన్నిసార్లు మృత్యువాత పడుతున్నారు. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గిరిశిఖరాల్లో డోలి మోతలకు స్వస్తి పలకాలని సీఎం చంద్రబాబునాయుడు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ వినూత్న ఆలోచనతో కంటైనర్ ఆసుపత్రి పురుడుపోసుకుంది. దీనికోసం రవాణా సౌకర్యాలకు దూరంగా ఉన్న గ్రామాలను ఎంపిక చేశారు. కంటైనర్ ఆసుపత్రికి గిరి ఆరోగ్య కేంద్రం అని నామకరణం చేశారు. సమీపంలో వైద్యసేవలు అందుబాటులో ఉంటే గిరిజనులను నాటు మందులు, మంత్రాలు, తంత్రాలు వైపు వెళ్లకుండా చేయవచ్చునని కలెక్టర్ ఆలోచన.
త్వరలో ప్రారంభం
కంటైనర్ ఆసుపత్రి త్వరలో ప్రారంభంకానుంది. వాస్తవానికి ఈ నెల 5న గిరిజనశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో ప్రారంభించడానికి అధికారులు నిర్ణయించారు. అయితే, విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రావడంతో ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎన్ని కల కోడ్ ముగిసిన వెంటనే ఈ ఆసుపత్రి గిరిజనులకు అందుబాటులోకి రానుంది.
గిరిజనులకు ప్రయోజనం
కంటైనర్ ఆసుపత్రితో గిరిజనులకు అధిక ప్రయోజనం కలగనుంది. కరడవలస పరిసర గ్రామాలకు చెందిన 2వేల మంది వరకు వైద్య సేవలు పొందవచ్చు. చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు మైదాన ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. గర్భిణులకు కూడా వివిధ వైద్య పరీక్షలు ఇక్కడే నిర్వహిస్తాం.
-అక్యాన అజయ్, తోణాం పీహెచ్‌సీ వైద్యుడు