Share News

శిరస్త్రాణం .. శ్రేయస్కరం

ABN , Publish Date - Dec 22 , 2024 | 12:38 AM

నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో వేగానికి ఉన్న ప్రాధాన్యం భద్రతకు ఇవ్వకపోవడంతో భారీ మూల్యం చెల్లించక తప్పడం లేదు. చిన్నపాటి నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఎక్కువగా యువత హెల్మెట్‌ ధరించకుండా బైక్‌లపై వేగంగా ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. కుటంబాలకు తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు.

 శిరస్త్రాణం .. శ్రేయస్కరం

లేకపోతే చర్యలు తప్పవు

నిర్లక్ష్యంతో పెరుగుతున్న ప్రమాదాలు

రోడ్డున పడుతున్న కుటుంబాలు

కోర్టు ఆదేశాలతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

విద్యార్థులు, వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న పోలీస్‌, రవాణా శాఖ

బెలగాం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో వేగానికి ఉన్న ప్రాధాన్యం భద్రతకు ఇవ్వకపోవడంతో భారీ మూల్యం చెల్లించక తప్పడం లేదు. చిన్నపాటి నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఎక్కువగా యువత హెల్మెట్‌ ధరించకుండా బైక్‌లపై వేగంగా ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. కుటంబాలకు తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు. రోజురోజుకూ ఇటువంటి రోడ్డు ప్రమాదాలు పెరిగిపోవడంతో హెల్మెట్‌ వినియోగాన్ని హైకోర్టు తప్పనిసరి చేసింది. శిరస్ర్తాణం పెట్టుకోకుంటే ఉపేక్షించొద్దని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. విద్యా సంస్థలు, ప్రధాన కూడళ్లలో విద్యార్థులు, వాహనదారులకు హెల్మెట్‌ వాడకంపై రవాణా, పోలీస్‌ శాఖాధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో ద్విచక్ర వాహన ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా యువత హెల్మెట్‌ పెట్టుకోవడానికి నామోషీగా ఫీలవుతున్నారు. రోజూ హెల్మెట్‌ వాడితే తల వెంట్రుకలు రాలిపోతాయని, తల వేడికి గురవుతుందని శిరస్త్రాణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ప్రమాదాలకు గురై తమ నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ ఘటనల్లో కొంతమంది అక్కడికక్కడే మృతి చెందుతున్నారు. మరెందరో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రులకు చేరుతున్నారు. అయినా చాలామంది హెల్మెట్‌ పెట్టుకోవాలన్న నిబంధన మాత్రం ఎవరూ పాటించడం లేదు. ప్రమాదాలు సంభవించినప్పుడు శిరస్ర్తాణం ఉంటే ఏమీ జరగకుండా ఉండేదని అనుకుంటున్నారు తప్ప హెల్మెట్‌ను మాత్రం పెట్టుకోవడం లేదు. జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండదని మరోవైపు వాహన తయారీదారులు, రవాణా శాఖ అధికారులు, పోలీసులు చెబుతున్నారు. అయితే గమ్యానికి త్వరగా చేరుకోవాలనే ధ్యాసతో కొందరు, మరికొందరు నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ప్రాణాల మీదకి తెచ్చకుంటున్నారు. హెల్మెట్‌ పెట్టుకోకపోవడం వల్ల వారితో పాటు ఎదుటి వారిని కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు. శిరస్ర్తాణం లేక జూన్‌ నుంచి ఇప్పటివరకు 16 మంది ద్విచక్ర వాహనదారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వాస్తవంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తలకి దెబ్బ తగిలితే మెడదు కణాలుగా పిలిచే న్యూరాన్లు నశిస్తాయి. దీనివల్ల అవయవాలు శాశ్వతంగా చచ్చుబడిపోతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే తలకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, హెల్మెట్‌ ధరిస్తే ప్రాణాలను రక్షించుకునే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు.

- ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని మోటారు వాహనాల చట్టం 1998లోని 129, 177 సెక్షన్‌లు చెబుతున్నాయి. దీని ప్రకారం ఎవరైనా హెల్మెట్‌ ధరించకపోతే జరిమానా విధించే అవకాశాలున్నాయి. పదేపదే వాహనదారుడు హెల్మెట్‌ లేకుండా జరిమానా పడుతుంటే డ్రైవింగ్‌ లైసెన్స్‌ శాశ్వతంగా రద్దు చేసే అవకాశం ఉంది.

నాణ్యమైనవి వాడాలి..

నాసిరకం హెల్మెట్‌ను ధరిస్తే ప్రమాద తీవ్రతను ఏమాత్రం తగ్గించలేవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని హెల్మెట్‌ కొనుగోలు సమయంలో జాగ్రత్తలు పాటించాలి. హెల్మెట్‌ స్ర్టాప్‌ గడ్డంపై ఉంచేందుకు అనువుగా ఉండేలా ఎంపిక చేసుకోవాలి. తలకు ధరించినప్పుడు స్ర్టాప్‌ తీసుకునేందుకు, పెట్టుకునేందుకు వీలుగా ఉండాలి. ప్రధానంగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ఐఎస్‌ఐ అనుమతులు పొందిన కంపెనీల శిరస్ర్తాణం ధరించాలని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. హెల్మెట్‌ వాడటం వల్ల ప్రమాదాలు జరిగినా తలకు అయ్యే గాయాల తీవ్రతను తగ్గిస్తుంది. ప్రమాదంలో ప్రాణ్రాపాయ స్థితి నుంచి 98 శాతం బయటపడొచ్చు. దుమ్ము, ధూళి, ఎండ నుంచి హెల్మెట్‌ వాడకంతో రక్షణ పొందొచ్చు.

ధరించకపోతే ఉపేక్షించం

హెల్మెట్‌ నిబంధన పక్కాగా అమలు చేస్తున్నాం. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలి. లేకుంటే కేసులు నమోదు చేస్తాం. మొదటిసారి పట్టుబడితే అవగాహన కల్పిస్తాం. మళ్లీ పట్టుబడితే వాహనాలను సీజ్‌ చేస్తాం.

- ఎస్‌వీ మాధవరెడ్డి, ఎస్పీ, పార్వతీపురం మన్యం

===================================

నిబంధనలు పాటించాలి..

సురక్షిత ప్రయాణానికి హెల్మెట్‌ తప్పనిసరి. హెల్మెట్‌ లేకుండా ద్విచక్ర వాహనదారుల వాహనాలకు రిజిస్ట్రేషన్‌ చేయడం లేదు. వాహనదారులంతా విధిగా మోటారు నిబంధనలు పాటించాలి. హెల్మెట్‌ లేకుండా ప్రయాణిస్తే మోటార్‌ యాక్ట్‌ చట్టం కింద జరిమానా విధించడంతో పాటు వాహనాన్ని సీజ్‌ చేస్తాం.

- ఎం.శశికుమార్‌, ఇన్‌చార్జి జిల్లా రవాణా అధికారి

Updated Date - Dec 22 , 2024 | 12:38 AM