Share News

సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు.. రోడ్డెక్కించారు

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:21 PM

‘అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తాం.. ఫ్రెండ్లీ ప్రభుత్వంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం.. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం.’ అని గత ఎన్నికల సమయంలో సీఎం జగన్‌ హామీలిచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి.. మడమ తిప్పారు. సీపీఎస్‌ స్థానంలో జీపీఎస్‌ తీసుకొచ్చారు.

సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు.. రోడ్డెక్కించారు
సీపీఎస్‌ రద్దు, సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల కార్మిక పెన్షన్‌దారులు (ఫైల్‌)

మాట మార్చి.. మడమ తిప్పిన ముఖ్యమంత్రి జగన్‌

గాలిలో కలిసిపోయిన సీపీఎస్‌ రద్దు హామీ

ఓపీఎస్‌ అమలు ఎక్కడ?

దాని స్థానంలో కొత్తగా జీపీఎస్‌ రాగం

ప్రతినెలా ఒకటిన జీతాలు, పెన్షన్లు అందించని వైనం

పీఆర్సీ అమలులో మోసం.. ఇతర బకాయిలు చెల్లించని సర్కారు

దీనిపై ఆందోళనలు చేపట్టినా స్పందించని ప్రభుత్వం

వివిధ సంఘాల నాయకుల మండిపాటు

(పార్వతీపురం- ఆంధ్రజ్యోతి/కొమరాడ)

‘అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తాం.. ఫ్రెండ్లీ ప్రభుత్వంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం.. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం.’ అని గత ఎన్నికల సమయంలో సీఎం జగన్‌ హామీలిచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి.. మడమ తిప్పారు. సీపీఎస్‌ స్థానంలో జీపీఎస్‌ తీసుకొచ్చారు. ప్రతినెలా పెన్షన్లు, జీతాలకు పెన్షనర్లు, ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదురుచూసేలా చేశారు. పీఆర్సీ, డీఏ తదితర బకాయిలతో పాటు సకాలంలో పీఎఫ్‌ సొమ్ములను కూడా చెల్లించలేకపోయారు. ఎన్నడూ లేని విధంగా వాటి కోసం వారంతా రోడ్డెక్కేలా చేశారు. ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన వారికి నోటీసులు ఇచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలను గృహ నిర్బంధాలు, అక్రమ కేసులు, బైండోవర్‌తో కట్టడి చేశారు. మొత్తంగా వైసీపీ సర్కారు ఐదేళ్ల కాలంలో ఉద్యోగ, ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో మొత్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు 17,307 వరకూ ఉన్నారు. వారు కాకుండా సచివాలయ పరిధిలో ఉద్యోగులు తదితరులు ఉన్నారు. అయితే వారంతా గత ఎన్నికల్లో జగన్‌ మాటలు నమ్మి.. వైసీపీకి ఓటు వేశారు. అయితే అధికారంలోకి వచ్చిన నాటి నుంచే వైసీపీ వారిని అనేక అవమానాలకు గురిచేసింది. ఎన్నికల్లో గెలిచాక సీపీఎస్‌ రద్దుపై మాట్లాదాలంటే ఉద్యోగులకు అపాయింట్‌మెంట్‌ లేదు. ప్రభుత్వం కొలువుదీరిన తొలి రెండేళ్లు మౌనంగా ఉన్న ఉద్యోగులు తరువాత ఉద్యమ బాట పట్టారు. దీన్ని అడ్డుకునేందుకు అడుగడుగునా సర్కారు ప్రయత్నించినా ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ పోరాటాన్ని కొనసాగించారు. చివరకు ప్రభుత్వం చర్చలకు పిలిచి జీపీఎస్‌ (గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌) అంటూ కొత్త రాగం అందుకుంది. ఇది కూడా తమను మోసం చేసేదేనంటూ ఉద్యోగులు మళ్లీ ఆందోళన కార్యక్రమాలు కొనసాగించారు. హక్కుల కోసం పోరాడుతున్న వారిపై పరోక్ష రూపంలో వైసీపీ క్షోభ పెట్టింది.

- గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రతినెలా ఒకటో తేదీకే జీతం వచ్చేది. దీంతో వారు అన్ని అవసరాలు సర్దుబాటు చేసుకునేవారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్‌ మారింది. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రతినెలా జీతం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. చివరకు రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెన్షన్‌ కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. కొన్నిసార్లు 12వ తేదీ వరకు జీతాలు, పెన్షన్లు చెల్లించకుండా ఆయా వర్గాలు తీవ్ర ఆందోళనకు గురయ్యేలా వైసీపీ చేసింది. దీంతో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు ‘ప్రతినెలా ఒకటో తేదీకే జీతాలు ఇప్పించండి మహా ప్రభో’ అంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి వచ్చింది. సక్రమంగా జీతాలు చెల్లించకపోవడంతో బ్యాంకు ఈఎంఐలు తదితర వాటిని సకాలంలో కట్టలేక తమ పరపతి పోతోందని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎంతోమంది ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేసినా.. సర్కారు స్పందించలేదు. మరోవైపు పెన్షనర్లు కూడా వైద్య ఖర్చులు, మందుల కొనుగోలుకు అవస్థలు పడినా.. వారిపైనా వైసీపీ కరుణ చూపలేదు.

- గత కాంగ్రెస్‌ , టీడీపీ ప్రభుత్వాల హయాంలో ఉద్యోగ, ఉపాఽధ్యాయుల సమస్యలపై వినతిపత్రం అందించిన వెంటనే వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించే పరిస్థితి ఉండేది. వారు ఎటువంటి ఆందోళనకు గురికాకుండా చూసుకునేవారు. కానీ వైసీపీ ప్రభుత్వ కాలంలో ఆ పరిస్థితి లేకుండా పోయింది. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి వినతిపత్రాలు అందించినా స్పందించకపోడంతో వివిధ రూపాల్లో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సంఘాల ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా భిక్షాటన, రోడ్లు శుభ్రం చేయడం, నల్ల రిబ్బన్లు ధరించి విధులు నిర్వహించడం.. ఇలా ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.

- ఉద్యోగులకు జీపీఎఫ్‌, డీఏ, పీఆర్సీ , ఏపీజీఎల్‌ఐ బకాయిలు, ఇతర అలవెన్సులు వైసీపీ చెల్లించలేదు. ఐదేళ్లుగా ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకోలేని పరిస్థితి. ఉద్యోగ విరమణ తర్వాత సకాలంలో పింఛన్‌ మంజూరు చేయలేదు. మరోవైపు ఆన్‌లైన్‌ సేవలు పెట్టి ఒత్తిడికి గురిచేశారని ఉద్యోగుల సంఘం నాయకులు వాపోతున్నారు.

- మధ్యాహ్న భోజనం , ఆన్‌లైన్‌ హాజరు నమోదు, మరుగుదొడ్ల శుభ్రత ఫొటోలు అప్‌లోడ్‌ , నాడు-నేడు పనుల బాధ్యతతో టీచర్లపై పనిభారం పెరిగింది.

- వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కూడా భారంగా మారింది. వాటిని నిధులు కేటాయించకపోవడంతో సుద్దముక్కలు, రిజిస్టర్లు, డస్టర్లు ఇతర సామగ్రి కొనగోలుకు కొందరు ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు చేతి డబ్బులను వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది. ఏటా సమగ్ర శిక్ష ద్వారా విద్యార్థుల సంఖ్యను బట్టి స్కూళ్లకు నిధులు మంజూరు చేసేవారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితిలేదు.

- ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లుల చెల్లింపులు కాక.. ఎంతోమంది ఉద్యోగులు తమ శుభ కార్యాలు, పిల్లల చదువులకు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.

పీఆర్సీ ఇలా..

వైసీపీ ప్రభుత్వం 11వ పీఆర్సీలో ఉద్యోగులను మోసం చేసిందని చెప్పవచ్చు. ఎప్పుడూ లేని విధంగా మధ్యంతర భృతి 27 శాతం ఉంటే దాన్ని నాలుగు శాతాలను తగ్గించి 23 శాతం ఫిట్మెంట్‌ ఇచ్చింది. దీంతో ఐఆర్‌తో తీసుకున్న జీతం కంటే ఫిట్మెంట్‌తో తీసుకున్న జీతం తగ్గిపోయింది. దీనిపై కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పీఆర్సీ సిఫారసు చేసిన పేస్కేలును పూర్తిస్థాయిలో అమలు చేయకుండానే 12వ పీఆర్సీ కమిషన్‌ను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌ను వేసినప్పటికీ ఇంతవరకు ఎటువంటి కార్యకలాపాలు చేపట్టలేదు. వాస్తవంగా 2023, జూలై నుంచి కొత్త పీఆర్సీ కమిషన్‌ అమలు కావాలి. ఇదిలా ఉండగా ప్రతిసారీలానే వైసీపీ సర్కారు ఐఆర్‌కూ మంగళం పాడేసింది. దీనిపై ఉద్యోగుల సంఘాల నాయకులు నేటికీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగులకు ఇదే మేలు..

ఓపీఎస్‌ : పాత పింఛన్‌ స్కీం (ఓపీఎస్‌)లో ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ నాటికి బేసిక్‌ పే, డీఏలో లెక్కలో తీసుకొని పింఛన్‌ ఇస్తారు. చివరిగా రూ. 50 వేలు వేతనం ఉంటే పింఛన్‌గా రూ. 25 వేలు ప్రతి నెలా దక్కుతుంది.

ఏం లాభం లేదు..

సీపీఎస్‌ : కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) అంటే ఉద్యోగులు బేసిక్‌ పే, డీఏతో సంబంధం ఉండదు. ఉద్యోగులు పొదుపు చేసిన ధనాన్ని పెట్టుబడిగా ఉంచి ప్రతి నెల పింఛన్‌ ఇచ్చే స్కీం. ఉద్యోగ విరమణ నాటికి రూ. 10 లక్షలు ఖాతాలో ఉంటే 60 శాతాన్ని ఉద్యోగ విరమణ బెనిఫిట్స్‌గా విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 40 శాతం పెట్టుబడిగా ఉండాల్సిందే. ఈ 40 శాతం పెట్టుబడిగా ఉన్న నగదు నుంచి ఫింఛన్‌గా ఇచ్చే మొత్తం సామాజిక పింఛన్‌ కన్నా తక్కువే. ఒకవేళ దురదృష్టవశాత్తు సీపీఎస్‌ ఉద్యోగి మరణిస్తే రూ.10 వేలు మట్టి ఖర్చులకు ఇస్తారు. షేర్‌లో పొదుపు చేసిన నగదు పూర్తిగా విత్‌డ్రా చేసుకుంటే పింఛన్‌ వర్తించదు.

బెనిఫిట్స్‌ ఉండవు

జీపీఎస్‌ : గ్యారెంటీడ్‌ పెన్షన్‌ స్కీం (జీపీఎస్‌) పేరిట ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం వేసిన వల ఇది. ఉద్యోగ విరమణ తరువాత బెనిఫిట్స్‌ ఏమీ ఉండవు. పింఛన్‌ కావాలంటే నగదు 100 శాతం మొత్తం పొదుపులో ఉండాల్సిందే.

నమ్మి మోసపోయాం

అధికారంలోకి వచ్చిన వారంలోగా సీపీఎస్‌ రద్దు చేస్తామన్న జగన్‌ మాట నమ్మి మోసపోయాం. సీపీఎస్‌తో ఉద్యోగుల భద్రతకు ముప్పు. ఉద్యోగ విరమణ తరువాత పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ఉద్యోగుల సర్వీసుకు గుర్తింపు లేకపోవడం బాధాకరం.

- ఓ సంఘం నాయకుడు, పార్వతీపురం

===========================

సమస్యలేవీ పరిష్కరించలేదు..

గత ఎన్నికల్లో ప్రతిపక్ష నేతగా జగన్‌ మాటలు నమ్మి వైసీపీకి ఓటేశాం. అయితే దారుణంగా మోసపోయాం. ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలేవీ వైసీపీ సర్కారు పరిష్కరించలేదు. సీపీఎస్‌ రద్దు రద్దు చేయకపోవ డంతో జగన్‌ ఇచ్చిన మాటని నీటిమూటగా మారింది. ఇతర బకాయిలు కూడా చెల్లించలేదు.

- ఓ ప్రభుత్వ ఉద్యోగి, పార్వతీపురం

===========================

జీతాలకు ఎదురుచూపులు..

గత ప్రభుత్వాల హయాంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ సర్కారు పాలనలో జీతాల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ప్రతినెలా ఒకటో తేదీకే జీతాలు చెల్లించాలని రోడ్డెక్కాల్సి వచ్చింది. పెన్షన్‌దారులకు సైతం సకాలంలో పెన్షన్లను అందించలేక పోయారు. మరోవైపు సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేస్తామన్న సీఎం జగన్‌ మాట మార్చి.. మడమ తిప్పారు. జీపీఎస్‌ అని కొత్తగా తెరపైకి తెచ్చి ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేశారు.

- ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, పార్వతీపురం

Updated Date - Apr 26 , 2024 | 11:21 PM