Share News

క్షణికావేశంలో భార్యను కడతేర్చాడు

ABN , Publish Date - May 27 , 2024 | 11:46 PM

ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. మూడేళ్లపాటు అన్యోన్యంగా కాపురం చేశారు. వారికి ఒక బాబు కూడా ఉన్నాడు. అంతలో ఏమైందో కాని నాలుగు నెలలుగా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

క్షణికావేశంలో భార్యను కడతేర్చాడు
మృతిచెందిన దారప్ప (ఫైల్‌)

క్షణికావేశంలో భార్యను కడతేర్చాడు

చెప్పిన మాట వినడం లేదని కక్ష

పుట్టింటికి వెళ్లిన భార్యను నమ్మించి తీసుకొచ్చి చంపేసిన వైనం

శృంగవరపుకోట రూరల్‌ మే 27 : ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. మూడేళ్లపాటు అన్యోన్యంగా కాపురం చేశారు. వారికి ఒక బాబు కూడా ఉన్నాడు. అంతలో ఏమైందో కాని నాలుగు నెలలుగా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త మనసులో కోపం కట్టలు తెంచుకుంది. అత్తారింటికి వెళ్లి మాయమాటలు చెప్పి భార్యను ఇంటికి తీసుకొచ్చి బయటకు వెళ్దామన్నాడు. వెళ్తుండగా మార్గమధ్యలో మళ్లీ గొడవపడ్డారు. కోపోద్రిక్తుడైన భర్త ఆమెను చున్నీతో మెడ ఇరికించి కడతేర్చాడు. బొడ్డవర పంచాయతీ ఒడ్డుమరుపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం జరిగిన ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. సీఐ మురళీరావు, మృతురాలు తల్లిదండ్రులు గొగ్గి రాము, కృష్ణమ్మ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఒడ్డుమరుపల్లి గ్రామానికి చెందిన చీమల కనకరావు అదే గ్రామానికి చెందిన గొగ్గి దారప్ప(22)ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. మూడేళ్లపాటు వీరి కాపురం సవ్యంగానే సాగింది. భార్య దారప్ప ఇటీవల లచ్చందొరపాలెంలో వున్న ఒక హోటల్‌లో పనికి చేరింది. దీనిని భర్త కనకరావు వ్యతిరేకించాడు. హోటల్‌లో పనిచేయవద్దన్నాడు. ఆమె వినకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. విసిగిపోయిన ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను బాగా చూసుకుంటానని కనకరావు చెప్పి ఆదివారం ఉదయం 8గంటల సమయంలో ఆమెను తన ఇంటికి తీసుకొచ్చాడు. అనంతరం బయటకు వెళ్దామని ఇద్దరూ బయలుదేరారు. గ్రామసమీపంలో మామిడితోట వద్దకు వచ్చేసరికి మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన భర్త కనకరావు, భార్య దారప్పను అమె చున్నీతో పీకకు బిగించి చంపేశాడు. అనంతరం భార్య మృతదేహాన్ని లచ్చందొరపాలెం సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి వద్ద పొదల్లో పడేసి ఇంటికి వెళ్లిపోయాడు. తనతో భార్య రాకపోవడంతో మృతురాలు తల్లిదండ్రులు పదేపదే ప్రశ్నించారు. సోమవారం ఉదయం 8గంటల సమయంలో నిజం చెప్పాడు. సీఐ మురళీరావు సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఎస్‌.కోట సీహెచ్‌సీ మార్చురీకి తరలించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - May 27 , 2024 | 11:46 PM