Share News

18 గంటల్లోనే మళ్లీ గండి

ABN , Publish Date - Jun 17 , 2024 | 11:39 PM

వైసీపీ పాలనలో అభివృద్ధి పనుల తీరుకు నిదర్శనం ఈ ఉదంతం. వేగావతి నదిపై పారాది వద్ద రూ.94 లక్షలతో అప్పట్లో కాజ్‌వే నిర్మించారు కానీ నాణ్యతకు తిలోదకాలిచ్చారు. ఇటీవల తొలివర్షానికే కొట్టుకునిపోగా అధికారులు మరమ్మతులు చేశారు. అయితే కొద్ది గంటల్లోనే మళ్లీ గండి పడింది. రహదారి పూర్తిగా ధ్వంసమైంది. దీంతో అధికారులు చేపట్టిన చర్యలు అభాసుపాలైనట్టయింది. దీంతో ప్రధానంగా రవాణా స్తంభించింది. చిన్న వాహనాలతో పాటు ఒడిశాలోని భారీ పరిశ్రమలకు ముడిసరకుల రవాణా కూడా ఆగిపోయింది.

18 గంటల్లోనే మళ్లీ గండి
వేగావతిపై పారాది వద్ద ధ్వంసమైన కాజ్‌వే

18 గంటల్లోనే మళ్లీ గండి

వేగావతి నదిపై పారాది కాజ్‌వేకు గండాలు

వైసీపీ హయాంలో రూ.94 లక్షలతో నిర్మాణం

తొలి వర్షానికే కొట్టుకుని పోయిన వైనం

మరమ్మతు చేసిన కొద్దిగంటల్లోనే మళ్లీ..

స్తంభించిపోయిన అంతర్రాష్ట్ర రవాణా

వైసీపీ పాలనలో అభివృద్ధి పనుల తీరుకు నిదర్శనం ఈ ఉదంతం. వేగావతి నదిపై పారాది వద్ద రూ.94 లక్షలతో అప్పట్లో కాజ్‌వే నిర్మించారు కానీ నాణ్యతకు తిలోదకాలిచ్చారు. ఇటీవల తొలివర్షానికే కొట్టుకునిపోగా అధికారులు మరమ్మతులు చేశారు. అయితే కొద్ది గంటల్లోనే మళ్లీ గండి పడింది. రహదారి పూర్తిగా ధ్వంసమైంది. దీంతో అధికారులు చేపట్టిన చర్యలు అభాసుపాలైనట్టయింది. దీంతో ప్రధానంగా రవాణా స్తంభించింది. చిన్న వాహనాలతో పాటు ఒడిశాలోని భారీ పరిశ్రమలకు ముడిసరకుల రవాణా కూడా ఆగిపోయింది.

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)/ బొబ్బిలి, జూన్‌ 17:

ఒడిశాలోని రాయగడ నుంచి విశాఖపట్నం వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిలో బొబ్బిలి మండలం పారాది వద్ద వేగావతి నదిపై ఇటీవల ఏర్పాటు చేసిన కాజ్‌వే సోమవారం మళ్లీ కొట్టుకుపోయింది. ఇక్కడున్న పురాతన వంతెన కుంగిపోయిన నేపథ్యంలో వాహనదారుల కోసం రూ.94 లక్షలతో కాజ్‌వేను నిర్మించిన సంగతి తెలిసిందే. అదివారం తెల్లవారుజామున తొలి వర్షానికే కొట్టుకుపోయింది. స్పందించిన అధికారులు దీనిపై వాహన రాకపోకలను నిషేధించి మరమ్మతులు చేయించారు. ఆదివారం సాయంత్రం నుంచి వాహన రాకపోకలకు అనుమతించారు. కాగా సోమవారం ఉదయం వేగావతి నదిలో వరద ఉధృతి పెరగడంతో కాజ్‌వే సగానికి పైగా కొట్టుకుపోయింది. అధికారుల తీరును వేగావతి పరిహసించిందా? అన్నట్లుగా పరిస్థితి తయారైంది. నదిలో ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో కాజ్‌వే చిరునామా గల్లంతు అయింది. వరద ఉధృతి తగ్గిన తరువాత చూస్తే సగానికి పైగా కొట్టుకుపోయినట్లు కనిపిస్తోంది. రోడ్డు ఆనవాళ్లు కనిపించలేదు.

- బొబ్బిలి-విజయనగరం రహదారిలో భారీ వాహనాల రాకపోకలకు ఆంక్షలు విధించక తప్పలేదు. విజయనగరం నుంచి బొబ్బిలి వైపు రావాల్సిన భారీ వాహనాలను రామభద్రపురంలో దారిమళ్లిస్తున్నారు. అలాగే ఇటు నుంచి విజయనగరం వైపు వెళ్లాల్సిన భారీ వాహనాలను బొబ్బిలి నుంచి దారి మళ్లిస్తున్నారు. దీంతో ఇటు బొబ్బిలి నుంచి తెర్లాం వరకు, అటు రామభద్రపురం నుంచి తెర్లాం జంక్షన్‌ వరకు వాహనదారులకు, ప్రజలకు ట్రాఫిక్‌ కష్టాలు తప్పడం లేదు.

- పారాది వద్ద వేగావతి నదిపై 1936లో నిర్మించిన వంతెన గత ఏడాది కుంగిపోవడంతో దానికి గడ్డర్లతో తాత్కాలికంగా నిలబెట్టి తేలికపాటి వాహనాల రాకపోకలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. భారీ వాహనాల రాకపోకల కోసం నదిలో రూ.94 లక్షలతో కాజ్‌వే నిర్మించారు. నిర్మాణంలో ఎటువంటి శాస్ర్తీయత లేకపోవడంతో కొద్దిపాటి వర్షానికే కొట్టుకుపోయంది.

- సోమవారం బొబ్బిలి కోటకు వచ్చిన జిల్లా నూతన మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ దృష్టికి స్థానిక ఎమ్మెల్యే బేబీనాయన పారాది వంతెన, కాజ్‌వే, ట్రాఫిక్‌ కష్టాలను వివరించారు. పాతవంతెననే మరింతగా పటిష్ట పరచాలని కోరారు.

స్తంభించిన అంతర్‌ రాష్ట్ర రవాణా

విజయనగరం-రాయగడ రోడ్డు మార్గంలో భారీ వాహనాల రవాణా స్తంభించుకుపోయింది. ఒడిశా రాష్ట్రంలోని భారీ పరిశ్రమలకు ముడి సరకులు వెళ్లాలంటే విజయనగరం-రాయగడ రోడ్డు కీలకం. విశాఖ పోర్టు నుంచి ముడిసరకులు తరలించేందుకు ఈ అంతర్‌ రాష్ట్ర రోడ్డే అధారం. ఈ మార్గంలోనే చంపావతి, వేగావతి, సువర్ణముఖీ, జంఝావతి నదులపై బ్రిటీష్‌ వారు వంతెనలు నిర్మించారు. అవన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. తగిన నిర్వహణ పనులు చేయని కారణంగా దెబ్బతిన్నాయి.

మళ్లీ మరమ్మతులు చేయిస్తాం

బీకేఏ రాజు, ఆర్‌అండ్‌బీ జేఈ, బొబ్బిలి

నదిలో వరద ఎప్పుడు వస్తుందో తెలియదు. వరద వచ్చినప్పుడు కాజ్‌వే ఉనికికి ముప్పు వాటిల్లుతోంది. రూ.94 లక్షలతో కాజ్‌ వే నిర్మించాం. ఆదివారం కాంట్రాక్టర్‌ తో ఉచితంగానే మరమ్మతులు చేయించాం. మళ్లీ సోమవారం కొట్టుకుపోయింది. మళ్లీ పనులు చేయిస్తాం. పక్కాగా చేయాలంటే రూ.20 లక్షలు అవసరం ఉంటుంది. పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదించాం.

Updated Date - Jun 17 , 2024 | 11:39 PM