Share News

హరోం హర

ABN , Publish Date - Mar 09 , 2024 | 11:51 PM

నాగావళి - జంఝావతి నదీ సంగమం నడుమ కొలువుదీరిన గుంప సోమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహా శివరాత్రి రోజున నది ఇసుక తిన్నెలపై టెంట్లు వేసి జాగరణ చేసిన భక్తులు అర్ధరాత్రి శివ దర్శనం కోసం పోటీపడ్డారు.

 హరోం హర
నాగావళి - జంఝావతి సంగమం దాటి గుంప సోమేశ్వరుడి ఆలయానికి తరలి వస్తున్న భక్తులు

జాగరణ అనంతరం సోమేశ్వరుని దర్శనానికి బారులు

కొమరాడ, మార్చి 9 : నాగావళి - జంఝావతి నదీ సంగమం నడుమ కొలువుదీరిన గుంప సోమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహా శివరాత్రి రోజున నది ఇసుక తిన్నెలపై టెంట్లు వేసి జాగరణ చేసిన భక్తులు అర్ధరాత్రి శివ దర్శనం కోసం పోటీపడ్డారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా శ్రీకాకుళం, ఒడిశా నుంచి వచ్చిన వారు శనివారం వేకువ జామున నదీ స్నానాలు ఆచరించారు. అక్కడి నుంచి నేరుగా ఆలయానికి చేరుకుని.. క్యూలైన్లలో గంటలకొద్దీ నిరీక్షించారు. అనంతరం సోమేశ్వరుడిని దర్శించుకుని పులకరించిపోయారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భక్తజనంతో ఆలయ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. శివ నామస్మరణతో జంఝావతి, నాగావళి సంగమం మార్మోగింది. సోమేశ్వరుని దర్శనం అంతనరం సమీపంలో విక్రయించే చేపలను కొనుగోలు చేసి భక్తులు తమ ఆచారాన్ని కొనసాగించారు. ఆలయానికి వచ్చే భక్తులు సౌకర్యార్థం స్వచ్ఛంద సంస్థలు ఆహార పొట్లాలు, తాగునీటిని అందించారు. టీడీపీ అరకు పార్లమెంటు నియోజకవర్గ రైతు అధ్యక్షుడు డి. వెంకటనాయుడు ఆధ్వర్యంలో మజ్జిగను పంపిణీ చేశారు. ఆలయ ప్రాంగణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొమరాడ ఎస్‌ఐ నీలకంఠం ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

వైభవంగా రుద్రాభిషేకం

గరుగుబిల్లి, మార్చి 9 : రావివలసలో శనివారం సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సాయి శత రుద్రాయం పూజలను ఘనంగా నిర్వహించారు. భగవాన్‌ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా తొలుత గ్రామంలోని సాయి మందిరం వద్ద పతాకావిష్కరణ, గోపూజ చేశారు. అనతరం రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటారు. సత్యసాయి మందిరం నుంచి శోభాయాత్ర నిర్వహించారు. ఆ తర్వాత మందిరం ఆవరణలో స్పటిక శివలింగానికి రుద్రాభిషేకం చేశారు. ప్రపంచ శాంతి, లోక కల్యాణార్థం రాష్ట్ర వేద అధ్యయన విభాగం ఆధ ్వర్యంలో గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సత్యసాయి సేవా సంస్థల ప్రతినిఽధులు కె.సాయిశ్రీహరి, ప్రసాద్‌ వర్మ, జిల్లా అధ్యక్షుడు పల్ల నేతాజీనాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో వంద మందికి పైగా రుత్వికులు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2024 | 11:51 PM