Share News

జనవరి నుంచి తల్లికి వందనం

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:45 PM

రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కోక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పింఛన్ల పెంపు, ఉచిత ఇసుక, ల్యాండ్‌ టైట్లింగ్‌ రద్దు, ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాల చెల్లింపు తదితర హామీలను నెరవేర్చింది.

జనవరి నుంచి తల్లికి వందనం
ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు

- విద్యార్థులకు రూ.15వేల చొప్పున అందించనున్న ప్రభుత్వం

- ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికీ వర్తింపు

- తల్లిదండ్రుల్లో ఆనందం

- మన్యంలో 1,18,547 మంది విద్యార్థులు

గరుగుబిల్లి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కోక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పింఛన్ల పెంపు, ఉచిత ఇసుక, ల్యాండ్‌ టైట్లింగ్‌ రద్దు, ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాల చెల్లింపు తదితర హామీలను నెరవేర్చింది. అలాగే, ఈ దీపావళి నుంచి దీపం పథకం కింద మహిళలకు ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా అందించనుంది. ఇప్పుడు ‘సూపర్‌ సిక్స్‌’లో కీలకమైన తల్లికి వందనం పథకాన్ని వచ్చే జనవరి నుంచి అమలుకు శ్రీకారం చుట్టింది. పాఠశాలలకు, జూనియర్‌ కాలేజీలకు వెళ్లే విద్యార్థుల తల్లులందరికీ ఈ పథకం కింద లబ్ధి చేకూరనుంది. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికీ ఈ పథకాన్ని వర్తింపజేసి రూ.15వేల చొప్పున అందించనుంది.


జిల్లాలో పరిస్థితి..

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు 1,749 ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు 1,583, ప్రైవేటు పాఠశాలలు 166 ఉన్నాయి. జిల్లాలో 1 నుంచి 5వ తరగతికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో 39,903 మంది, 6 నుంచి 10వ తరగతి వరకు 54,099 మంది, అలాగే ప్రైవేటు పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు 12,121 మంది, 6 నుంచి 10వ తరగతి వరకు 12,451 మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికీ తల్లికి వందనం పథకం అమలు కానుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించే వారి పిల్లలకు ఈ పథకం వర్తించదు. ఒకే ఇంటిలో ఇద్దరు విద్యార్థులు ఉంటే వారికి రూ.30 వేలు మంజూరు కానుంది. అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు విధిగా పాఠశాలలకు వెళ్లేవారికి మాత్రమే పథకం వర్తిస్తుంది. 75 శాతం హాజరు కచ్చితంగా ఉండాలి. ఇప్పటికే మండలాల వారీగా విద్యార్థుల వివరాలతో పాటు తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలను సేకరించే పనిలో ఉపాధ్యాయులు నిమగ్నమయ్యారు.


అమ్మఒడికి ధీటుగా..

గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకానికి ధీటుగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇంటిలో ఎంతమంది చదివినా ఒక్కరికే గత ప్రభుత్వం అమ్మఒడిని అందించింది. ఒక్కో తల్లికి రూ.15వేలు అని ప్రచారం చేసినా వాస్తవంగా ఇచ్చింది రూ.13వేలు మాత్రమే. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ నిధి కింద రూ.వెయ్యి, పాఠశాలల నిర్వహణ నిధి కింద మరో రూ.వెయ్యి కోత పెట్టారు. పైగా ఈ పథకానికి అర్హత ఉన్నా పలు నిబంధనలతో మంజూరుకాని పరిస్థితి అప్పట్లో నెలకొంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తదుపరి ఒక ఇంటిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా వారందరికీ పథకం అమలుపర్చేందుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Oct 25 , 2024 | 11:45 PM